బి జెపి హయాంలో ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి, ఆ పార్టీ జేబు సంస్థగా వ్యవహరిస్తుందనే విమర్శలొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
• 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ, అమిత్ షా పలు సభల్లో విద్వేష ప్రసంగాలు చేశారు. ఈ ధోరణిని కట్టడి చేయాల్సిన ఎన్నికల సంఘం తనకు తానుగా స్పందించలేదు. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినప్పుడు కూడా మోడీకి నోటీసు ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షుడికి ఇచ్చింది. మోడీ, బీజేపీ ఇతర నాయకులపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో తగిన చర్యలు తీసుకోలేదు.
• 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం వివరాల విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. మొదటి గణాంకాలకు, తుది గణాంకాలకు మధ్య భారీ తేడాలు ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. పోలింగ్ వివరాలు నమోదైన సిసి పుటేజిని అడిగినప్పుడు కూడా పొంతన లేని సమాధానాలు చెప్పింది.
• 2025లో బిహార్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టడం జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల సంఘంపై పెద్ద విమర్శలకు దారితీసింది. బీజేపీ ప్రభుత్వం తేవాలనుకున్న పౌరసత్వ సవరణ చట్టానికి అనుగుణంగానే ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్టు విమర్శలు వచ్చాయి. బీహార్‌లో సుమారు 65 లక్షల మంది ఓట్లు తొలగించారు. పేదలు, వలస కార్మికులు, అవసరమైన పత్రాలు లేని ప్రజలు ఓటు హక్కు కోల్పోయారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగించారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఓటు నమోదుకు ఆధార్‌ను, రేషన్ కార్డును ఆధారంగా పరిగణించలేమని ఎన్నికల సంఘం పేర్కొనటం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. బిహార్‌లో ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌పై తీవ్ర అభ్యంతరాలు ఉండగానే ఇతర రాష్ట్రాలకు విస్తరించింది.
• ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో 2025 ఆగస్టు 17న జ్ఞానేష్ కుమార్ స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ఆరోపణలకు ఆధారంగా ప్రమాణపత్రం ఇవ్వాలని, లేకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని జ్ఞానేష్ కుమార్ ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మాట్లాడటం అచ్చం రాజకీయ నాయకుడిలా వ్యవహరించినట్టుగా ఉందనే విమర్శలు వచ్చాయి. మాజీ ఎన్నికల కమిషనర్లు కూడా ఆయన తీరును తప్పుపట్టారు.
• కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో అసలు ఓటర్లతో సంబంధం లేకుండా 6,000కుపైగా ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు రావడం వివాదాస్పదమైంది. బీజేపీ అనుకూల వ్యక్తులు ఈ పని చేశారని, ఎన్నికల సంఘం అండతో ఇలాంటివి చాలా జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
• ప్రధానమంత్రి మోడీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల పర్యటనలు ముగించిన తరువాతే 2026 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వచ్చింది. మోడీ ప్రచార కార్యక్రమాలకు అనుకూలంగా తేదీలను నిర్ణయించారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను ఒకే దశలో, మరికొన్ని రాష్ట్రాల్లో అనేక దశల్లో నిర్వహించడంపైనా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో గతానికి భిన్నంగా ఎక్కువ దశలు కేటాయించారు. దీనికి ఎన్నికల సంఘం చెప్పిన కారణాలు కూడా సమంజసంగా లేవు.
• 2026 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి విద్వేష ప్రసంగాలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తగిన చర్య తీసుకోలేదు. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం వేగంగా స్పందిస్తోందని విమర్శలు వచ్చాయి.
• కేరళ ఎన్నికలకు సంబంధించిన ఒక అధికారిక పత్రంలో బీజేపీ రాష్ట్ర యూనిట్ ముద్ర కనిపించింది. ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయంగా మారిపోయిందా అన్న ఆక్షేపణలు వచ్చాయి.
• 2026 ఏప్రిల్‌లో ఎన్నికల సంఘం అధికారిక ఖాతా నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఒక రాజ్యాంగ సంస్థ తన అధికారిక వేదిక నుంచి రాజకీయ పార్టీని నేరుగా విమర్శించడం తటస్థతకు విరుద్ధం. బీజేపీ రాజకీయ స్వరాన్నే ఎన్నికల సంఘం వినిపించిందన్న విమర్శ వచ్చింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో సమావేశంలో జ్ఞానేష్ కుమార్ అనుచితంగా వ్యవహరించారని, ‘గెటౌట్’ అంటూ అహంకారం ప్రదర్శించారని ఆ పార్టీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించారు. 22 లక్షల మందికి పైగా అర్హులైనవారు ఓట్లను కోల్పోయి, ఇప్పటికీ ఓటు హక్కు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఓట్లను తొలగించిన ఎన్నికల సంఘం తిరిగి చేర్చటానికి మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది.
అనేక విమర్శల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో 13-03-2026న నోటీసులు సమర్పించారు. ఎన్నికల సంఘం ఇంతగా అభాసుపాలైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. జ్ఞానేష్ కుమార్ తీరు ఏకపక్షంగా, బీజేపీకి అనుకూలంగా ఉందన్న విమర్శలకు మరింత బలాన్నిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజా పరిశోధనలో తేలింది. తోటి ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలకు సైతం ఆయన విలువ ఇవ్వటం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు కమిషనర్లు గత 10 నెలల్లో కనీసం 14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ప్రత్యేక సమగ్ర సవరణ, సమాచార వ్యవస్థ వంటి అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నాయి. ఉమ్మడి అభిప్రాయాన్ని గౌరవించని, ప్రజాస్వామికంగా వ్యవహరించని జ్ఞానేష్ కుమార్ ఇక ఎంతమాత్రం ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.








కామెంట్‌లు (0)