- బి.తులసీదాస్
మూడు ముక్కలాట గురించి చాలా మందికి తెలుసు. కూడలి ప్రదేశాల్లోనూ రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్ల సమీపంలో చిన్న గొనె పట్టా వేసి లేదా కొంతమంది పొడవాటి తువ్వాలు పరిచి దానిపైన మూడు పేక ముక్కలతో ఈ ఆట కాదు.. కాదు.. జూదం ఆడుతారు. ఈ ఆటలో ప్రత్యేకత ఏమిటంటే ఆ నిర్వాహకుడే తన మనుషులతో పందెం కాయించి వారు గెలిచేట్టు చేస్తాడు. అది చూసి తానూ ఆటాడి డబ్బు గెలుచుకోవచ్చు అనేలా చూసే వారిని టెంప్ట్ చేస్తాడు. వారు పందెం కాస్తే మొదట్లో గెలిచేట్టు చేస్తాడు కూడా! అందులోకి దించి వేడి పెరిగాక పెద్ద మొత్తాలు పందెం కాస్తే అలా అలా కోల్పోయేలా చేస్తాడు. జూద నిర్వాహకుడు , జనాన్ని ఆకర్షించి ఆడేట్టు చేసేవాడు అందరూ ఒక ముఠా వారేనని డబ్బు పోగొట్టుకున్న అమాయకులకు అప్పుడు అర్ధం కాదు. సాధారణంగా ఏ జూదం అయినా ఇంతే ! ఆట తీరులో తేడాలున్నప్పటికీ మూల సూత్రం ఇదే! సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు జరుగుతోంది. దేశ ప్రజలు జాగృతం కాకపొతే కొంప కొల్లేరు అయిపోవడం ఖాయం.
గురువారం దేశ రాజధానిలో జరిగిన భారత పరిశ్రమలు వాణిజ్య సంఘాల సమాఖ్య (ఫిక్కీ) వార్షిక సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామిక వాణిజ్యవేత్తలపై విరుచుకుపడ్డారు. కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకుండా ఉండేందుకు మతతత్వాన్ని ప్రేరేపించి విద్వేషాలు సృష్టించడం బిజెపి విధానం. అందుకే దీన్ని కార్పొరేట్ మతతత్వ కూటమి పాలన అంటారు. అలాంటిది వారి అనుంగు మిత్రులపైనే ప్రధాని ఎందుకిలా మాట్లాడారు అన్న సందేహం కొందరికి కలగవచ్చు. ఉద్యోగాలేవీ? జీతాలు పెంచరా? నా దేశ ప్రజలకు నాణ్యతగల సరుకులివ్వరా? పన్ను తగ్గింపు ప్రయోజనం ప్రజలకందించరా? ...ఇలా ప్రధాని పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ఒక కార్మిక నాయకుడిలా లేదా ప్రగతిశీల శక్తుల ప్రతినిధిలా జనం భ్రమ పడేంతలా అనర్గళంగా ప్రసంగించి గొప్పగా రక్తి కట్టించారు. పొదుపు గురించీ భారతీయ సంస్కృతి గురించి ప్రధాని చాలా చెప్పారు. గురువారం నాడు ప్రధాని మోడీ పేర్కొన్న వివిధ సమస్యలు హఠాత్తుగా ముందుకొచ్చినవి కాదు. గత దశాబ్దానికి పైగా నెలకొన్నవీ జనం వాటితో సతమతమవుతున్నవీ! కానీ ఇప్పుడే ప్రధాని ఇంత గట్టిగా ఎందుకు చెప్పారు అని పరిశీలిస్తే జెన్ జి ఉద్యమాలు సర్ వ్యతిరేక ఆందోళనలు కార్మికుల మెరుపు సమ్మెలు వగైరా ఎదురుదెబ్బలు వారి సర్కారును గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్న నేపథ్యం మన ముందు సాక్షాత్కరిస్తుంది.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపి సాగించిన ప్రచారాన్ని నమ్మి యువతీయువకులు గుండుగుత్తగా కమలం గుర్తుపై ఓట్లు వేశారు. మోడీ అధికారానికి వచ్చారే కానీ యువతకు ఉద్యోగాలు రాలేదు. కొంతకాలం మాయ మాటలతో ఇంకొంత కాలం వాట్సాప్ యూనివర్సిటీ బూటకాలతో పాలకులు నెట్టుకొచ్చినా, జీవితానుభవం యువతను మేల్కొలిపింది. యువతీయువకులు నిజం తెలుసుకొని రోడ్లెక్కుతున్నారు. కాబట్టి వారి ఆగ్రహావేశాలను ప్రభుత్వంపై కాకుండా పారిశ్రామిక వాణిజ్య వర్గాల వైపు మళ్లించడానికే ఈ ప్రయత్నమూ కావచ్చు. అసలు దోషి విధానాలు రూపొందించే ప్రభుత్వం అని అనుకోకుండా అటు ఇటు దృష్టి మళ్లించి యువతను భ్రమింపజేయడమే ఈ హుంకరింపులు! జీతాలు పెంచాలని ఉద్యోగ భద్రత కావాలని కార్మికులు ఢిల్లీ చుట్టుపక్కల మెరుపు సమ్మె చేస్తే వారిని ఉక్కు పాదంతో అణచివేయాలన్న కేంద్ర నాయకుల ఆదేశం మేరకు యుపి హర్యానా లోని బిజెపి ప్రభుత్వాలు విఫల యత్నం చేశాయి. ఇన్ని నిర్బంధాల మధ్య కార్మికులు కొన్ని కోర్కెలు సాధించుకున్నారు. కనీస వేతన చెల్లించాలని చట్టపరమైన ఆదేశాలివ్వాల్సిన ప్రభుత్వాలు కార్మికుల అణచివేతకు పోలీసు బలగాలను పంపి బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమాధిపతుల కొమ్ము కాయగా ఇప్పుడు అదే పార్టీకి సర్వాధిపతిలా వ్యవహరిస్తున్న ప్రధాని జీతాలు పెంచరా అని నిలదీస్తుంటే ఎలా నమ్మేది? ఎగుమతి ఆధారిత వ్యవసాయ విధానాలు, ప్రపంచ మార్కెట్ లో మనకున్న అన్ని అవకాశాలు వినియోగించుకోవాలంటూ నయా ఉదారవాద విధానాలపేరిట ఇన్నాళ్లూ ఊదరగొట్టి ఇప్పుడు హఠాత్తుగా నా దేశ ప్రజలకు నాణ్యమైన సరుకులు అమ్మరా అని ప్రశ్నించడం రెండు నాల్కల ధోరణి కాక ఇంకేమనుకోవాలి? నాసి రకం సరుకులు ఎగుమతి చేస్తే కొనుక్కునే వారెవరుంటారు?
సంపన్నులకు తమ ప్రభుత్వం చేసిన మేళ్లు గురించి కూడా ప్రధాని వివరించడం బాగుంది. అయన అధికారానికి వచ్చినపుడు 30 శాతం గా ఉన్న కార్పొరేట్ పన్ను 22 శాతానికి తగ్గించారు. ఏడాదికి ఐదారు లక్షల కోట్ల రూపాయల చొప్పున ఖజానాను కొల్లగొట్టి కార్పొరేట్లకు మళ్లించిన వాస్తవాన్ని అయన నోటితోనే చెప్పారు. అదే కునారిల్లి పోతున్న అన్నదాతలకు ఉన్న ఎరువుల సబ్సిడీకి కోతలు పెడుతూ వస్తున్నారు. అలాగే జిఎస్టి రేట్ల తగ్గింపు గురించీ వివరించారు. అప్పుడేమో వినియోగదారుల ప్రయోజనం కోసమే తగ్గింపు అంటూ ఫుల్ పేజీ వ్యాపార ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారు. ఆ రాయితీలు పారిశ్రామిక వాణిజ్య వర్గాలకే లబ్ది చేకూర్చాయి తప్ప జనానికి ఒరిగింది లేదు... ఖజానాకు కన్నం పడింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాంటివారు కూడా మురిసిపోయి జిఎస్టి ప్రయోజనాన్ని అంది పుచ్చుకోవాలని గొప్పగా చెప్పారు.
జెన్ జి ఆందోళనలు , సర్ వ్యతిరేక ఉద్యమాలు, మరో వైపు అయోధ్య రామాలయం నిధుల చోరీ ఇలాంటివి రోజు రోజుకూ చుట్టుముడుతున్న నేపథ్యం లోనే ఇటీవల ఉప ఎన్నికల్లో కమలనాథులు పరాజయాల పాలవుతున్నారు. తాజాగా జరిగిన రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లోనూ పరాభవం తప్పలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు పరిణామాల మధ్యనే ప్రధాని మోడీ ఫిక్కీ ఉపన్యాసాన్ని పరిశీలించాలి. అధికార పార్టీ ఇటువంటి జిమ్మిక్కులెన్ని చేసినా ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతూనే ఉంటాయి. పాలకులు తప్పించుకోలేరు!








కామెంట్లు (0)