ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెఐని కేంద్రం ఎందుకు తొలగించింది?

29 సెప్టెంబర్, 2026

Why did the Centre remove the CJI?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:35 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

కొత్త చట్టం వెనుక మతలబేంటి
​ఎన్నికల సంఘం నియామక వ్యవస్థలో 2023లో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక కీలక మార్పు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) స్థానాన్ని తొలగించి, ప్రధాని నామినేట్ చేసే కేంద్ర మంత్రికి ఆ స్థానాన్ని ఇవ్వడమే ఆ మార్పు. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? సుప్రీంకోర్టు సూచించిన వ్యవస్థను కేంద్రం ఎందుకు మార్చింది? అన్న అంశాలు ఆసక్తి కరంగా మారింది.


తొలుత వ్యవస్థ ఎలా ఉండేది ?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేస్తారు. అయితే ఆ నియామక ప్రక్రియను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్దేశించవచ్చని రాజ్యాంగం పేర్కొంది. 1991లో పార్లమెంట్ ఎన్నికల కమిషనర్ల జీతభత్యాలు, పదవీకాలం, విధుల నిర్వహణ వంటి అంశాలకు చట్టం చేసింది. కానీ ఎన్నికల కమిషనర్లను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై ప్రత్యేకమైన నియామక చట్టం చేయలేదు. ఫలితంగా చాలా కాలం పాటు నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వమే ప్రధాన పాత్ర పోషించింది.

​ఇదే అంశంపై అనూప్ బరణ్వాల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది.


​2023లో సుప్రీంకోర్టు కీలక తీర్పు

​2023 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అనూప్ బరణ్వాల్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల కమిషనర్ల నియామకంపై చట్టం చేసే వరకు తాత్కాలికంగా ఒక ఎంపిక కమిటీ ఉండాలని కోర్టు నిర్ణయించింది. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని పేర్కొంది. అంటే ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధాని, ప్రతిపక్ష ప్రతినిధిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, న్యాయవ్యవస్థ నుంచి సీజేఐ ఉండేలా మూడు వైపుల సమతుల్యతను కోర్టు ఏర్పాటు చేసింది. ​సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను శాశ్వతంగా విధించలేదు. పార్లమెంట్ చట్టం చేసే వరకు మాత్రమే ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీనినే నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుంది.


సిజెఐ స్థానంలో కేంద్ర మంత్రి

​సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొద్ది నెలలకే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామకంపై కొత్త బిల్లును తీసుకొచ్చింది.2023 ఆగస్టులో బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. డిసెంబర్‌లో పార్లమెంట్ రెండు సభల్లోనూ ఆమోదం పొందింది. 2023 డిసెంబర్ 28న అది చట్టంగా మారింది. దీనిలో కీలక మార్పు చేశారు. సుప్రీంకోర్టు సూచించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సిజేఐ ఉండగా,

​కేంద్రం రూపొందించిన కొత్త చట్టంలో మాత్రం సిజెఐ స్థానంలో ప్రధాని నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చింది.

​అంటే కొత్త కమిటీలో ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను ఈ కమిటీ సిఫారసు ఆధారంగా నియమిస్తారు. మెజార్టీ ఎప్పుడూ అధికార పక్షానికే ఉంటుంది. ఇదే మార్పు మొత్తం వివాదానికి కేంద్ర బిందువైంది. నిజానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ ప్రతినిధి కాదు. న్యాయవ్యవస్థకు చెందిన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి. అందువల్ల కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. కానీ, కొత్త వ్యవస్థలో ప్రధాని ఒకరు. ఆయన నామినేట్ చేసే కేంద్ర మంత్రి మరొకరు. మూడో సభ్యుడు ప్రతిపక్ష నేత. ఇదే అంశాన్ని 2023లో బిల్లుపై జరిగిన చర్చల్లో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. సిజేఐ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టడం ద్వారా ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వానికి మెజారిటీ లభిస్తుందని వారు వాదించారు. ఈ అంశంపైనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమైన సవాలు కొనసాగుతోంది.


​సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్ మార్చగలదా?

​ఇక్కడ మరో ముఖ్యమైన రాజ్యాంగ ప్రశ్న తలెత్తింది. 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సిజెఐని కలుపుకొని ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం పార్లమెంట్ అదే అంశంపై చట్టం చేసి సిజెఐ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టింది.

పార్లమెంట్ చట్టం చేయడానికి రాజ్యాంగపరమైన అధికారం ఉంది. కానీ ఆ చట్టం సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందా లేదా అన్నది మరో ప్రశ్న. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు 2026లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్