ప్రసుత్తం 205 కిలోమీటర్లకు *ఒక ఛార్జింగ్ స్టేషన్
ఛార్జింగ్ కోసం డిపోల్లోనే ఎక్కువ గంటలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిలో ప్రవేశపెడుతున్న ఎలక్ర్టిక్ బస్సుల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రయాణికుల నమ్మకం దెబ్బతినే అవకాశమూ ఉంది. అదే జరిగితే ప్రయాణికులు అనివార్యంగా ఇతర ప్రైవేటు వాహనాల వైపు మళ్లుతారు. దీనివల్ల సంస్థ నష్టాలపాలవుతుంది. ప్రభుత్వ నిర్ణయం కూడా అదే గనుక ఎన్ని అభ్యంతరాలొచ్చినా విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లను కట్టబెట్టే చర్యలు వేగవంతం చేసింది. విద్యుత్ వాహన పాలసీలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం 601 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి 205 కిలోమీటర్ల రోడ్డు పొడవుకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇంత పెద్ద దూరాల మధ్య ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం వల్ల, డీజిల్ బస్సుల్లాగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ స్వేచ్ఛగా పంపడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల మధ్య ఛార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం వల్ల బ్యాటరీ అయిపోతే బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ బస్సు మధ్యలో ఆగిపోతే, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ఆర్‌టిసి ప్రత్యామ్నాయ బస్సులను పంపాల్సి వస్తుంది. ఇది సంస్థకు అదనపు డీజిల్, సిబ్బంది ఖర్చులను పెంచే ప్రమాదం ఉంది. పైగా రోజువారీ సర్వీసుల నిర్వహణ సామర్థ్యం దెబ్బతింటుంది. ఒక డీజిల్ బస్సును అత్యవసర సమయంలో ఏ రూట్‌కైనా మార్చవచ్చు. కానీ, ఎలక్ట్రిక్ బస్సులను కేవలం ఛార్జింగ్ సదుపాయం ఉన్న పరిమిత రూట్లలో మాత్రమే తిప్పాల్సి వస్తుంది. డీజిల్ బస్సులకు ఇంధనం నింపడం నిమిషాల్లో అవుతుంది. ఇవి బస్సులు ఛార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నా ఇంకా ఎక్కడా ఏర్పాటు కాలేదు. దీనివల్ల బస్సులు ఎక్కువ సేపు డిపోలకే పరిమితమై, రోజువారీ ట్రిప్పుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటి వరకూ ఆర్‌టిసి బస్సులు సమయపాలనకు, నమ్మకానికి మారుపేరు. ఒకవేళ సాంకేతిక లేదా బ్యాటరీ సమస్యల వల్ల బస్సులు తరచూ ఆలస్యమైతే లేదా మధ్యలో ఆగిపోతే ప్రయాణికులు ప్రైవేట్ రవాణా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్‌టిసి నేరుగా టికెట్ ఆదాయాన్ని కోల్పోతుంది.








కామెంట్‌లు (0)