శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాహుల్‌, జైస్వాల్‌ అర్ధ సెంచరీలు

1 గంట క్రితం

jaswal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 12:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇండియా 159/1

  • న్యూజిలాండ్‌ 368/10

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు సత్తాచాటారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (52 నాటౌట్), యశస్వి జైస్వాల్ (85) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 130 భాగస్వామ్యాన్ని నెలకొల్పి 30ఏళ్ల క్రితం నెలకొల్పిన ఓపెనింగ్‌ వికెట్‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశారు. సెంచరీకి దశగా పయనిస్తున్న జైస్వాల్‌ ఔటైనా.. ఆ తర్వాత పడిక్కల్‌(5) మరో వికెట్‌ పడకుండా క్రీజ్‌లో కుదురుకున్నాడు. దీంతో రెండోరోజు ఆట ముగిసేసరికి భారతజట్టు వికెట్‌ నష్టానికి 159 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ కంటే ఇంకా 209పరుగులు వెనుకబడి ఉన్నా.. మరో 9వికెట్లు చేతిలో ఉన్న దశలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యత సంపాదిస్తేనే పట్టు సాధించనుంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 243 పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్‌ను ఫిలిప్స్‌, నికోల్స్‌ ఆదుకున్నారు. ఫిలిప్స్‌(118)ను ఆకాశ్‌ దీప్‌ ఔట్‌ చేయడంతో టీమిండియాకు తొలి బ్రేక్‌ లభించింది. స్మిత్‌(14), జేమీసన్‌(11), హెన్రీ(1), డఫీ(4) త్వరగా ఔటయ్యారు. మరో బ్యాటర్‌ నికోల్స్‌(175నాటౌట్‌) చివరివరకూ ఔటవ్వలేదు. దీంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 368 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లు బుమ్రాకు నాలుగు, ఆకాశ్‌దీప్‌కు మూడు, కంబోజ్‌కు రెండు, ప్రసిధ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 39 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. జైస్వాల్ (85) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, కేఎల్ రాహుల్ (52) అజేయ అర్థ‌శ‌త‌కం, ప‌డిక్క‌ల్ (16) క్రీజులో ఉన్నారు. మాట్ హెన్రీ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం...

టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్‌ రాహుల్ జోడీ తొలి వికెట్‌కు 130 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. న్యూజిలాండ్ గడ్డపై 32 ఏళ్ల తర్వాత భారత ఓపెనర్లు నమోదు చేసిన మరో సెంచరీ భాగస్వామ్యం ఇదే. గతంలో 1994లో హామిల్టన్ వేదికగా నయన్ మోంగియా-నవజ్యోత్ సింగ్ సిద్ధూ 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు 1990లో ఆక్లాండ్‌లో మనోజ్ ప్రభాకర్ -డబ్ల్యూవీ రామన్ జోడీ 149 పరుగులు జోడించింది. జైస్వాల్‌ 89 బంతుల్లో 16 ఫోర్లతో 85 పరుగులు చేయగా.. కెఎల్‌ రాహుల్‌ 41 పరుగులు చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 130 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం జైస్వాల్‌ను మాట్ హెన్రీ ఔట్ చేశాడు.

10కి పది వికెట్లు పేసర్లకే..

న్యూజిలాండ్‌పై 10కి పది వికెట్లు టీమిండియా పేసర్లు కూల్చడం ఇది రెండోసారి మాత్రమే. బుమ్రా, ఆకాశ్ దీప్‌లు క‌లిపి ఏడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అన్షుల్, ప్ర‌సిధ్‌లు క‌లిపి మ‌రో మూడు వికెట్లు తీశారు. జ‌ట్టులో ఏకైక స్పిన్న‌ర్‌గా ఉన్న వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ఒక్క వికెట్ కూడా ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో న్యూజిలాండ్‌తో టెస్టులో టీమిండియా పేస‌ర్లు అన్ని వికెట్లు తీయ‌డం చ‌రిత్ర‌లో ఇది రెండోసారి. 2014లో తొలిసారి ఇదే వెల్లింగ్ట‌న్ వేదిక‌గా భార‌త పేస‌ర్లు ఈ ఫీట్‌ను న‌మోదు చేశారు. అప్పట్లో ఇషాంత్ (6/51), ష‌మీ (4/70)లు క‌లిసి ప‌ది వికెట్లు తీయ‌డం విశేషం. ఇక బుమ్రా ఏడాది త‌ర్వాత టెస్టు క్రికెట్ బరిలోకి దిగి సూప‌ర్ బౌలింగ్‌తో అద‌ర‌గొట్టాడు. 92 ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీసిన బుమ్రా కివీస్‌పై బెస్ట్ ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేశాడు.

స్కోర్‌బోర్డు...

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 368ఆలౌట్‌

ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)బ్లండెల్‌ (బి)హెన్రీ 85, కెఎల్‌ రాహుల్‌ (బ్యాటింగ్‌) 52, పడిక్కల్‌ (బ్యాటింగ్‌) 16, అదనం 6. (39 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి) 159పరుగులు. వికెట్ల పతనం: 1/130 బౌలింగ్‌: హెన్రీ 12-3-43-1, జేమీసన్‌ 11-5-15-0, డఫీ 10-0-72-0, స్మిత్‌ 6-0-29-0.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్