శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముప్పు ముంచుకొస్తున్నా.. మార్పు లేదు

1 గంట క్రితం

cop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 12:56 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- కాప్ 31లోనూ వెనకడుగే - దేశాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

అంటాల్యా : వాతావరణ మార్పుల ముప్పు రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కరువు, వరదలు, కార్చిచ్చులు, తుపానులు, అసాధారణ ఉష్ణోగ్రతలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న పారిస్ ఒప్పంద లక్ష్యం చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పుల సదస్సులు కొనసాగుతున్నా నేటికీ సమగ్ర కార్యచరణ అమలుపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. టర్కీలోని అంటాల్యాలో ఈ నెల 9న ప్రారంభమై 20తో ముగిసిన సిఒపి 31 సదస్సులోనూ ఇది స్పష్టమైంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న అమెరికా వరుసగా రెండో ఏడాది కూడా సదస్సుకు గైర్హాజరైంది. దాదాపు 200 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశాల్లో శిలాజ ఇంధనాల భవిష్యత్తు, వాతావరణ అనుకూల నిధులు, విద్యుదీకరణ, న్యాయమైన ఇంధన పరివర్తన (అందరికీ ప్రయోజనం చేకూర్చే ఇంధన మార్పు), ఉద్గారాల తగ్గింపు ప్రధానంగా చర్చకు వచ్చాయి. సదస్సు చివరి దశలో ఈ నెల 19న విడుదలైన ముసాయిదా పలు కీలక అంశాల్లో వెనక్కి తగ్గినట్లు పేర్కొంది.

శిలాజ ఇంధనాలపై వెనకడుగు

సదస్సు ప్రారంభంలో విడుదల చేసిన ముసాయిదాలో 2023లో దుబాయ్‌లో జరిగిన సిఒపి 28లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, స్వచ్ఛమైన ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. ఈ నెల 19న విడుదలైన తొమ్మిది పేజీల సవరించిన ముసాయిదాలో ఈ ప్రస్తావనలన్నీ తొలగించారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగాన్ని తగ్గించకుండా ఉద్గారాల నియంత్రణ సాధ్యం కాదు. కార్బన్ క్యాప్చర్, వినియోగం, నిల్వ సాంకేతికతలను విస్తరించాలన్న ప్రతిపాదనకు ముసాయిదాలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇవి ఉద్గారాల తగ్గింపునకు ప్రత్యామ్నాయంగా మారకూడదని పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

​2035 నాటికి 35 శాతం విద్యుదీకరణ

ఈ సదస్సులో ముందుకొచ్చిన మరో ప్రధాన ప్రతిపాదన '35 బై 2035'. అంటే 2035 నాటికి ప్రపంచ తుది ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను 35 శాతానికి పెంచడం. ప్రస్తుతం ఇది సుమారు 23 శాతంగా ఉంది. రవాణా, పరిశ్రమలు, గృహావసరాలు తదితర రంగాల్లో విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం. విద్యుదీకరణ పెరగడం మాత్రమే వాతావరణ పరిష్కారం కాదు. ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందన్నది కీలకం. బొగ్గు ఆధారిత విద్యుత్‌తో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపినా, పరిశ్రమలను విద్యుదీకరించినా ఉద్గారాల తగ్గింపు పరిమితంగానే ఉంటుంది. అందుకే పునరుత్పాదక విద్యుత్‌తో అనుసంధానించిన విద్యుదీకరణ అవసరం. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్ 2026 నివేదిక ఈ లక్ష్యం సాధ్యమేనని చెబుతూనే ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో 2035 నాటికి విద్యుత్ వాటా 28-29 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది. భారత్, చైనా, ఈజిప్ట్, సౌదీ అరేబియా తదితర దేశాలతో కూడిన లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ (ఎల్‌ఎండిసి) కూటమి 35 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని అధికారిక నిర్ణయంలో చేర్చడాన్ని వ్యతిరేకించింది. దేశాల అభివృద్ధి అవసరాలు, ఇంధన వనరులు, ఆర్థిక పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పుడు అందరికీ ఒకే లక్ష్యాన్ని నిర్దేశించడం సరికాదని ఈ దేశాలు స్పష్టం చేశాయి.

​నిధుల దగ్గరే అసలు పేచీ

వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం, నీటి వనరులు, తీర ప్రాంతాలు, ఆరోగ్య వ్యవస్థలను సిద్ధం చేయడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత అవసరం. ఇందుకు భారీగా నిధులు కావాలి. కానీ ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. తొలి ముసాయిదాలో 2035 నాటికి ఏటా సుమారు 11.11 లక్షల కోట్ల రూపాయలను వాతావరణ అనుకూల నిధుల కింద ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. సవరించిన ముసాయిదాలో ఈ మొత్తాన్ని తొలగించారు. 2035 నాటికి అనుకూలత నిధులను కనీసం మూడింతలు చేయాలని మాత్రమే పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అంచనా ప్రకారం 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ అనుకూలత కోసం ఏటా కనీసం 28.24 లక్షల కోట్ల రూపాయలు అవసరం. 2024లో అంతర్జాతీయంగా అందిన ప్రభుత్వ నిధులు కేవలం రూ.2 లక్షల 59 వేల కోట్ల నుండి రూ.2 లక్షల 96 వేల కోట్లు. ఈ అంతరాన్ని చూస్తే ప్రకటిస్తున్న లక్ష్యాలు అవసరాలతో పోలిస్తే ఎంత తక్కువగా ఉన్నాయో అర్థమవుతుంది.

​అభివృద్ధి చెందిన దేశాల కొత్త వాదన

వాతావరణ నిధుల విషయంలో ఈసారి మరో వివాదం ముందుకొచ్చింది. 1992 ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య బాధ్యతలను వేరు చేసింది. పారిశ్రామిక విప్లవం నుంచి బొగ్గు, చమురు, సహజ వాయువులను విస్తృతంగా ఉపయోగించి సంపద సృష్టించుకున్న అభివృద్ధి చెందిన దేశాలే చారిత్రకంగా అత్యధిక ఉద్గారాలకు కారణమయ్యాయి. అందువల్ల పేద దేశాలు ఉద్గారాలను తగ్గించుకోవడానికి, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడానికి ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత వాటిపై ఉంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ కొత్త వాదనను ముందుకు తెస్తున్నాయి. చైనా, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆర్థికంగా బలపడ్డాయని, ప్రపంచ ఉద్గారాల్లో వాటి వాటా పెరిగిందని, కాబట్టి వాతావరణ నిధులు అందించే దేశాల జాబితాలో వాటినీ చేర్చాలని కోరుతున్నాయి. దీనికి భారత్, చైనా వంటి దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల చారిత్రక బాధ్యతను ప్రస్తుత ఉద్గారాల ప్రాతిపదికన మార్చలేమని వాటి వాదన. సంపన్న దేశాలు తమ బాధ్యతను ఇతరులపైకి నెట్టకూడదని, ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వాల నిధుల బాధ్యతకు ప్రత్యామ్నాయంగా చూపకూడదని అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుతున్నాయి.

​అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒకే వైపు లేవు

అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒకే వైఖరితో లేవన్నది ఈ సదస్సులో మరోసారి స్పష్టమైంది. భారత్, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ అభివృద్ధి అవసరాలు, ఇంధన భద్రత, దేశాల సార్వభౌమత్వాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. చమురు ఎగుమతులపై ఆధారపడే సౌదీ అరేబియా వంటి దేశాలు శిలాజ ఇంధనాల నుంచి వైదొలగేందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఆఫ్రికా దేశాలు, చిన్న ద్వీప దేశాలు, వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావితమవుతున్న పేద దేశాలు మరింత బలమైన చర్యలు కోరుతున్నాయి. వాటిలో 80కి పైగా దేశాలు గత సదస్సులోనే శిలాజ ఇంధనాల నుంచి వైదొలగడానికి రోడ్‌మ్యాప్ రూపొందించాలని మద్దతు తెలిపాయి.

​భారత్‌ ‌సవాళ్లు..

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పురోగతి ఉన్నప్పటికీ బొగ్గుపై ఆధారపడటం ఇంకా ఎక్కువగానే ఉంది. 2025 జూన్ నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర ఇంధనాల వాటా 50 శాతానికి చేరినా, వాస్తవ విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ప్రాధాన్యత కొనసాగుతోంది. గ్రిడ్ సామర్థ్యం, విద్యుత్ నిల్వ వ్యవస్థల కొరత కారణంగా సౌర విద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉంది.

క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2027లో భారత్ ఐదు స్థానాలు దిగజారి 28వ ర్యాంకుకు చేరడం కూడా ఈ లోపాలను ఎత్తిచూపుతోంది. 2070 నాటికి నెట్‌జీరో లక్ష్యాన్ని సాధించాలంటే బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. పరిశ్రమలు, రవాణా, వ్యవసాయ రంగాల్లో స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంచాలి. యూరోపియన్ యూనియన్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సిబిఎఎం) వంటి చర్యలు భారత ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అదనపు భారం మోపే ప్రమాదం పొంచి ఉంది.

​చిన్న దేశాల ఆందోళన..

ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, చిన్న ద్వీప దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ సంక్షోభం తాము సృష్టించిన సమస్య కాదని, కానీ దాని ప్రభావాన్ని అత్యధికంగా తామే భరిస్తున్నామని వాపోతున్నాయి. హిమానీనదాలు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగడం, వ్యవసాయ దిగుబడులు పడిపోవడం, తాగునీటి కొరత, తీవ్రమైన వాతావరణ సంఘటనలు ఆయా దేశాల జీవనాధారాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే నష్టాలు, నష్టపరిహారం (లాస్‌ అండ్‌ డ్యామేజ్‌) నిధులను బలోపేతం చేయాలని, తగినంత ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్