ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమూడో వన్డేలో భారత్‌ ఓటమి..

1 రోజు క్రితం

ind vs wi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:38 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

352 పరుగుల టార్గెట్‌‌ను ఛేజ్‌ చేసిన వెస్టిండీస్‌

చండీగఢ్‌ : భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఊహించని ఫలితం నమోదైంది. న్యూ చండీగఢ్‌లోని పిసిఎ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. భారత్‌ ‌నిర్దేశించిన 352 పరుగుల టార్గెట్‌‌ను ఛేదించింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ బౌలర్లు గట్టి దెబ్బ కొట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. జేడెన్ సీల్స్ వరుస బంతుల్లో ఈ రెండు వికెట్లు పడగొట్టి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. ఆ దశలో రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రోహిత్ దూకుడుగా ఆడుతూ 85 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి చేరువైన సమయంలో కీమో పాల్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు. రుతురాజ్ 69 బంతుల్లో 57 పరుగులు చేసి జేడెన్ సీల్స్‌కు వికెట్‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన కెఎల్ రాహుల్ తన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. మొదట్లో వికెట్ కాపాడుకుంటూ ఆడిన అతడు తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. 41 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన రాహుల్.. ఆ తర్వాత బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచాడు. కేవలం 80 బంతుల్లోనే వన్డే కెరీర్‌లో 9వ శతకాన్ని నమోదు చేశాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన రాహుల్ 87 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి నమన్ ధీర్ నుంచి కూడా విలువైన సహకారం లభించింది. నమన్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అనంతరం అన్షుల్ కంబోజ్ 9 బంతుల్లో 17 పరుగులు చేయడంతో భారత్ చివరి ఓవర్లలో పరుగుల వేగాన్ని మరింత పెంచింది. 50 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

షాయ్ హోప్ ఒంటరి పోరాటం

352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా కెప్టెన్ షాయ్ హోప్ అడ్డుగోడలా నిలిచాడు. ఒకవైపు సహచరులు పెవిలియన్ చేరుతున్నా.. అతడు మాత్రం క్రీజులో నిలబడి పరుగుల వరద పారించాడు. పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. హోప్ చివరికి 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 162 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి జంగూ 67 పరుగులతో, కీమో పాల్ 44 పరుగులతో కీలక సహకారం అందించారు. ఈ భాగస్వామ్యాల కారణంగా లక్ష్యం క్రమంగా చేరువైంది. చివర్లో విండీస్ బ్యాటర్లు అవసరమైన పరుగులు సాధించి విజ‌యం అందుకున్నారు. దీంతో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 162 పరుగులతో జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన షాయ్ హోప్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌ను తప్పించింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్ సిరీస్‌ను 2-1తో తన ఖాతాలో వేసుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్