‘పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ శంకుస్థాపనలో లోకేష్, సింధు
ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధి ఆరిలోవ తోటగరువలో 'పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బ్యాడ్మింటన్ దిగ్గజం పివి సింధు కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రపంచ క్రీడా వేదికలపై పివి సింధు సాధించిన అద్భుతమైన విజయాలు భారత్‌కు ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చాయన్నారు. పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ స్థాపనతో రాబోయే తరం విజేతలను ప్రోత్సహిస్తూ, తీర్చిదిద్దుతూ ఆమె ఒక శాశ్వతమైన ఆదర్శాన్ని నిర్మిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, యువ ప్రతిభకు గొప్ప అవకాశాలు ఉన్న అగ్రగామి క్రీడా ప్రాంతంగా మార్చాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ చారిత్రక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామి కావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. పివి సింధు మాట్లాడుతూ... భారతీయ రాబోయే తరాలకు గొప్ప అవకాశాలను సృష్టించే ఒక మహోన్నత సంస్థను నిర్మించడం కోసం తన క్రీడా జీవితంలో సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగాన్ని ఈ క్రీడారంగానికి కేటాయిస్తున్నానని తెలిపారు. యువ అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, విద్య, వారి పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసేందుకు కావలసిన మద్దతు లభించే ఒక చక్కటి వాతావరణాన్ని తయారు చేయడమే తన కల అని పేర్కొన్నారు. రాబోయే తరాలకు సేవలందించే ఈ పవిత్ర ఆశయంలో కార్పొరేట్ సంస్థలు, విరాళాలు ఇచ్చే దాతలు సైతం సిఎస్‌ఆర్, సుదీర్ఘ భాగస్వామ్యాల ద్వారా తమతో చేయి కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి కలెక్టర్ విధ్యాదరి, అకాడమీ డైరెక్టర్ స్వాతి పాల్గొన్నారు.
ఐబిఎం ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభం
విశాఖపట్నం ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన ఐటి సంస్థ ఐబిఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్‌ను మంత్రి నారా లోకేష్, ఐబిఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ ప్రారంభించారు. కేంద్రంలోని ఎఐ గవర్నెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్, పరిశ్రమల ఆధారిత సాంకేతిక పరిష్కారాలను మంత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.








కామెంట్‌లు (0)