బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రీసా జోలీ–గాయత్రీ గోపిచంద్ సంచలన విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో త్రీసా-గాయత్రి 21-15, 21-12 తేడాతో 16వ సీడ్ అమెరికా జోడీ లారెన్ లామ్–అల్లిసన్ క్విన్ లీని వరుస గేముల్లో ఓడించి ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌ను భారతజంట కేవలం 38 నిమిషాల్లో ముగించింది. మరో భారత మహిళల డబుల్స్ జోడీ కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింఘి మాత్రం రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. 9వ సీడ్ బల్గేరియా జోడీ గాబ్రియేలా స్టోయేవా–స్టెఫానీ స్టోయేవా చేతిలో 7-21, 14-21తో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ కేవలం 32 నిమిషాల్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ ఉన్నతి హుడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మయన్మార్‌కు చెందిన థెట్ హ్తార్ తుజార్‌ను 22-20, 21-16తో ఓడించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఉనతి కీలక సమయంలో రాణించి విజయం సాధించింది. ఉన్నతి.. తదుపరి రౌండ్‌లో 13వ సీడ్ కెనడా షట్లర్ మిషెల్ లీతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ బల్గేరియాకు చెందిన కాలిన్స్ వాలెంటైన్ ఫిలిమోన్ను మూడు గేముల్లో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 16-21, 21-8, 21-4తో ఫిలిమోన్‌పై విజయం సాధించాడు. లక్ష్యసేన్ తదుపరి రౌండ్‌లో అమెరికాకు చెందిన గారెట్ టాన్తో తలపడనున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీలకు శుభారంభం దక్కలేదు. రోహన్ కపూర్–రుత్విక శివాని గద్దె జోడీ కెనడాకు చెందిన జొనాథన్ బింగ్ త్సాన్ లై–క్రిస్టల్ లై చేతిలో 22-20, 19-21, 17-21తో పోరాడి ఓడింది. ఇక అశిత్ సూర్య–అమృత ప్రముతేష్ కూడా టర్కీకి చెందిన ఎమ్రే సోన్మెజ్–యాసెమెన్ బెక్టాస్ జోడీ చేతిలో తీవ్ర పోరాటం తర్వాత 21-16, 29-30, 22-24తో పరాజయం పాలైంది.







కామెంట్‌లు (0)