శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

T20 - వెస్టిండీస్‌తో కీలక పోరు.. వైభవ్‌ ఆసక్తికర పోస్టు

1 గంట క్రితం

Crucial clash against West Indies.. Vaibhav's interesting post
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 11:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

క్రీడలు : ఐదు మ్యాచ్‌ల టి 20 సిరీస్‌లో భారత్‌, వెస్టిండీస్‌ జట్లు 2-2 తో సమంగా నిలిచాయి. దీంతో శనివారం రాత్రి జరగనున్న చివరి మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ పోరులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టు ఆసక్తిని రేకెత్తిస్తోంది.


15 ఏళ్ల యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లభించలేదు. నాలుగు మ్యాచ్‌ల్లోనూ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్లుగా సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ జోడీకి కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, జట్టు యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుండటంతో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ‘ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నా’ అనే భావాన్ని వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టాడు. దీంతో కీలకమైన చివరి టి 20 లోనైనా తనకు అవకాశం లభిస్తుందనే ఆశతో వైభవ్‌ ఉన్నాడనే చర్చ మొదలైంది.


మరోవైపు, వైభవ్‌ను ఆడించే అంశంపై ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ గతంలోనే తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. వైభవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, తుది జట్టు ఎంపికలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాణిస్తున్న సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మలలో ఎవరిని తప్పించాలన్నది అంత సులభమైన నిర్ణయం కాదని తెలిపారు. మంచి ఫలితాలు ఇస్తున్న జట్టు కూర్పును అకస్మాత్తుగా మార్చడం సరైనది కాదనే అభిప్రాయాన్ని గంభీర్‌ వ్యక్తం చేశారు. సిరీస్‌ విజేతను నిర్ణయించే ఆఖరి టి 20 లో తుది జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం కల్పిస్తారా ? లేక సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మలతో కూడిన ఓపెనింగ్‌ జోడీనే కొనసాగిస్తారా ? అన్నది మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్పష్టత రానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్