ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని వినతి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియలో ఏర్పాటు చేసిన కౌంటర్లను జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు. నగరంలోని 62 డివిజన్లలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు.
ప్రజలు, రాజకీయ పార్టీలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఫోన్లు, వాట్సాప్ ద్వారా నిరాధారమైన వదంతులను వ్యాప్తి చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 26, 27 తేదీల్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలతో పాటు ఉత్సవాలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు సిరిమాను ఉత్సవం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నగరంలో సమస్యాత్మక కేంద్రాలు ఏవీ లేవని, మూడు ప్రాంతాల్లో చిన్నపాటి గొడవలు జరగగా వాటిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. ఎన్నికలు, పండగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు స్పెషల్ ఫోర్స్తో పాటు పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఎన్నికలు, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్లు (0)