శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు

1 గంట క్రితం

e3852930-1e78-47fe-a646-1809afb7817d.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 01:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ట భద్రత

  • విధులకు గైర్హాజరైన సిబ్బందిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు

  • కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా స్థానిక రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, అలాగే స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏ.ఆర్. దామోదర్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది కేటాయింపు, పోలింగ్ సామగ్రి పంపిణీ, వాహనాల రాకపోకలకు అనువైన మార్గాలు, బారికేడింగ్ ఏర్పాటు, పటిష్టమైన సీసీ కెమెరాల నిఘా, మరియు స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాప్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని మున్సిపల్ అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ​డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సుమారు 108 బస్సులు రానున్నందున, వాటి పార్కింగ్ మరియు సామగ్రితో సిబ్బంది నిర్దేశిత బస్సుల వద్దకు సులభంగా చేరుకునేలా వాహనాల రాకపోకలను నియంత్రించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందితో ఇక్కడి నుంచి బస్సులు మధ్యాహ్నం 2 గంటలకల్లా బయలుదేరేలా చర్యలు చేపట్టాలన్నారు.

​ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందితో పాటు రిజర్వ్ సిబ్బంది కూడా నిర్ణీత సమయానికి రిపోర్ట్ చేసేలా చూడాలని, విధులకు గైర్హాజరైన వారిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాలస్వామిని కలెక్టర్ ఆదేశించారు. ​ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పోలీసు సిబ్బందిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దే కేటాయించి, పోలింగ్ సిబ్బందితో పాటే వారు కూడా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఇంజనీర్ ప్రసాద్, సర్వేయర్ సింహాచలం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్