మరో ఐదుగురికి గాయాలు
భరూచ్: గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో రసాయన తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు కారణంగా విషవాయువు లీకైనట్లు అధికారులు శనివారం వెల్లడించారు.
వాగ్రా తాలూకాలోని సాయిఖా జీఐడీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సింజీల్ ఫార్మాకెమ్ (SynZeal Pharmachem) పరిశ్రమలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు మేజిస్ట్రేట్ మనీషా మనానీ తెలిపారు.
పేలుడు తీవ్రతకు రియాక్టర్ ట్యాంక్ పూర్తిగా ధ్వంసమైందని, యంత్రాల భాగాలు పరిశ్రమ ప్రాంగణమంతా చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు. సాయిఖాలో ఈ పరిశ్రమను ఏడాది క్రితమే ఏర్పాటు చేశారని, ఇక్కడ ఔషధాల తయారీకి అవసరమైన మధ్యంతర రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని జయదీప్ మహేశ్‌భాయ్ పటేల్, భావిక్ దిలీప్‌కుమార్ వాసవా, వృంద్ తలావియా, అనికేత్ హరిలాల్ గౌతమ్, అర్జున్‌కుమార్ రామ్‌సింగ్ గౌతమ్‌గా గుర్తించారు. వీరిలో తొలి ఇద్దరు అమోడ్కు చెందినవారు కాగా, వృంద్ తలావియా గిర్ సోమనాథ్ జిల్లాలోని తలాలాకు చెందినవారు. మిగిలిన ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
గాయపడిన వారిని పవన్‌కుమార్ రామ్‌సింగ్ గౌతమ్, మౌసమ్కుమార్ రామ్‌సేవక్ యాదవ్, శివదయాల్ రామ్‌అవతార్ యాదవ్, ప్రతీక్ ప్రవీణ్ ప్రజాపతి, ప్రియాన్షు బహదూర్లాల్గా గుర్తించారు. వీరు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని భరూచ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్‌రాజ్ మక్వానా తెలిపారు. పేలుడు, వాయువు లీకేజీ ఘటనపై గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి, పారిశ్రామిక భద్రత, ఆరోగ్య సంచాలకుల విభాగం (డీఐఎస్‌హెచ్), పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్లు (0)