శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదు రోజులకే ప్రెస్ సెక్రటరీని పదవి నుండి తొలగించిన ట్రంప్ ..!

1 గంట క్రితం

Trump removes press secretary from the position after just five days..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 12:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజులకే కేటీ జెకారియా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆమె న్యాయవాద అర్హతలపై వివాదం చెలరేగడం, మీడియా నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవిపై మరోసారి ఆలోచించుకోవాలని తానే కేటీకి సూచించినట్లు ట్రంప్ వెల్లడించారు.


మీడియా విమర్శలే కారణమా ?

విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. కేటీ పట్ల మీడియా అన్యాయంగా, కఠినంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. మీడియా నుంచి ఎదురవుతున్న విమర్శలు, ఒత్తిడిని ఆమె భరించాల్సిన అవసరం లేదని తాను చెప్పినట్లు తెలిపారు. తాను ఆమె స్థానంలో ఉంటే ప్రెస్ సెక్రటరీ పదవిని పునఃపరిశీలించుకుంటానని సూచించినట్లు వివరించారు.


న్యాయవాద అర్హతలపై వివాదం ...

ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే కేటీ జెకారియా విద్యార్హతలు, వృత్తిపరమైన నేపథ్యంపై ప్రశ్నలు మొదలయ్యాయి. తనను తాను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నప్పటికీ, అమెరికాలోని ఏ రాష్ట్రంలోనూ బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ఆధారాలు లేవని పలు కథనాలు వెలువడ్డాయి. గతంలో చైనాలోని ఓ ప్రముఖ న్యాయ సంస్థలో పనిచేసినప్పటికీ, అక్కడ కూడా సంబంధిత అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే ఆరోపణలు వచ్చాయి.


ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా ... ట్రంప్ కేటీని సమాధానం చెప్పాలని కోరారు. అయితే, హెలికాప్టర్ శబ్దాల మధ్య ఆమె చైనాకు వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడటం ప్రారంభించి, ఆ తర్వాత ఆగిపోయారు. దీంతో ఆమె అర్హతలపై నెలకొన్న వివాదం మరింత చర్చనీయాంశమైంది.


వైట్‌హౌస్ వివరణ ....

ఈ వివాదంపై వైట్‌హౌస్ స్పందిస్తూ కేటీ అర్హతల గురించి ప్రకటన విడుదల చేసింది. పెప్పర్‌డైన్ యూనివర్సిటీ నుంచి 2011లో న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆమె, అవసరమైన అర్హతలతో అంతర్జాతీయ లావాదేవీల చట్టాన్ని అభ్యసించినట్లు పేర్కొంది.


ట్రంప్‌పై కేటీ ప్రశంసలు ...

పదవి నుంచి వైదొలిగిన అనంతరం కేటీ జెకారియా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన దయగల వ్యక్తి అని, ఆయన కోసం పనిచేయడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మరోవైపు, వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుంగ్ కూడా కేటీకి మద్దతుగా స్పందించారు. ఆమె సమర్థురాలని, ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేస్తారని తాము విశ్వసించినట్లు పేర్కొన్నారు. గతంలో కేటీ ట్రంప్‌కు చెందిన మీడియా సంస్థలో కొన్ని నెలలపాటు పనిచేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్