మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశానికి స్వర్ణం.. కుటుంబానికి నిలువనీడ కరువు !

1 గంట క్రితం

Gold for the country... but no roof over the family's head!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 11:11 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

జోర్హాట్‌ (అసోం) : దేశం గర్వించేలా జాతీయ స్థాయి కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన ఆ బాలికకు.. సొంతింటికి తిరిగి వచ్చేసరికి నిలువ నీడే కరువైంది. క్రీడా ప్రాంగణంలో పతకంతో మెరిసిన 17 ఏళ్ల జన్మోని కొన్వార్‌.. వరదల్లో ఇల్లు కోల్పోయి కట్టపై టార్పాలిన్‌ కింద తలదాచుకుంటున్న కుటుంబాన్ని చూసి కన్నీటిపర్యంతమైంది. అసోంలోని జోర్హాట్‌ జిల్లా భోగ్దోయిపోరియా గ్రామానికి చెందిన జన్మోని కథ.. ప్రతిభ ఉన్నా పేదరికం, ప్రకృతి విపత్తులు వెంటాడుతున్న క్రీడాకారుల పరిస్థితికి అద్దం పడుతోంది.


ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్‌ స్టేడియంలో ఆగస్టు 7 నుంచి 9 వరకు జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అషిహరా విభాగంలో జన్మోని స్వర్ణ పతకం సాధించింది. సోమవారం స్వగ్రామానికి చేరుకున్న ఆమెకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీళ్లతో స్వాగతం పలికారు. పతకాన్ని చూసి గర్వపడాల్సిన సమయంలో.. ఉండటానికి ఇల్లు లేకపోవడం వారి ఆనందాన్ని విషాదంగా మార్చింది.


వరద మిగిల్చింది శిథిలాలనే ..

గత నెల 19న అసోంలో సంభవించిన భారీ వరదలు జన్మోని కుటుంబాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. వారి ఇంటికి కేవలం 150 మీటర్ల దూరంలో నది కట్ట తెగిపోవడంతో గ్రామం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. జన్మోని కుటుంబం నివసిస్తున్న ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇంటితో పాటు మూడేళ్లుగా పెంచుతున్న చేపల చెరువు, కోళ్లు, బాతులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం కుటుంబం కట్టపై టార్పాలిన్‌ కింద కాలం వెళ్లదీస్తోంది.


చేపలు అమ్మి ఢిల్లీకి పంపాలనుకున్నారు ...

జన్మోనిని జాతీయ పోటీలకు పంపేందుకు కుటుంబ సభ్యులు మూడేళ్లుగా పెంచుతున్న చేపలను విక్రయించాలని భావించారు. అయితే వరద వారి ఆశలన్నింటినీ తుడిచిపెట్టేసింది. “ చేపలు అమ్మి జన్మోనిని పోటీలకు పంపాలనుకున్నాం. కానీ వరద మా ప్రణాళికను పూర్తిగా నాశనం చేసింది ” అని ఆమె సోదరుడు కృష్ణమోని కొన్వార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ జన్మోని పోటీల ఖర్చుల కోసం కుటుంబం రెండు గేదెలను విక్రయించినట్లు ఆయన తెలిపారు.


చిన్న వయసులోనే కరాటేపై మక్కువ ....

ఐదేళ్ల వయసు నుంచే జన్మోని కరాటే సాధన చేస్తోంది. సరైన శిక్షణా సౌకర్యాలు, ఆర్థిక వనరులు లేకపోయినా పట్టుదలతో ముందుకు సాగుతోంది. 2023లో కాంస్య పతకం సాధించిన ఆమె.. 2025లో స్వర్ణ పతకం సాధించింది. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో పతకం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తుండగానే వరదలు కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టాయి. ఇల్లు కోల్పోవడంతో పాటు రవాణా సౌకర్యాలు స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లి పోటీలో పాల్గొనడం కూడా ఆమె కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది.

photo


ఆపన్నహస్తం అందించిన అలఖ్‌ పాండే ....

జన్మోని కుటుంబ పరిస్థితి గురించి అసోం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న 'ఫిజిక్స్‌ వాలా' వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే తెలుసుకున్నారు. వెంటనే స్పందించి జన్మోనితో పాటు ఆమె జట్టు ఢిల్లీకి వెళ్లి తిరిగి రావడానికి ప్రయాణ ఖర్చులు, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆమె కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు. కేంద్ర మంత్రి పబిత్రా మార్గెరిటా కూడా రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. ఈ సహాయంతోనే జన్మోని ఢిల్లీకి వెళ్లి జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకంతో తిరిగి వచ్చింది.


కట్టపైనే సాధన.. స్వర్ణంతో తిరుగు ప్రయాణం ....

ఇల్లు లేదు.. సరైన సౌకర్యాలు లేవు.. కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయినా జన్మోని మాత్రం తన సాధనను ఆపలేదు. కట్టపై తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టార్పాలిన్‌ కిందే జీవిస్తూ కరాటే సాధన కొనసాగించింది. ఆ పట్టుదలే ఆమెను జాతీయ ఛాంపియన్‌గా నిలిపింది.


దిబ్రూగఢ్‌ విమానాశ్రయంలో పతకంతో దిగిన జన్మోని .. స్వగ్రామానికి చేరుకున్న తర్వాత తన విజయానందం కంటే కుటుంబం ఎదుర్కొంటున్న దుస్థితినే చూసి కలత చెందింది. నవంబర్‌ వరకు కట్టపైనే జీవించాల్సి రావచ్చని ఆమె సోదరుడు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతున్న జన్మోని.. కరాటేలోనే తన కెరీర్‌ను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరదలు వారి ఇల్లును లాక్కున్నా.. ఆమె సంకల్పాన్ని మాత్రం లాక్కోలేకపోయాయి. జాతీయ స్వర్ణం సాధించిన ఈ యువ క్రీడాకారిణి కుటుంబానికి ఇప్పుడు ఆ పతకమే కొత్త ఆశకు ప్రతీకగా నిలిచింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్