మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జులై 20 ర్యాలీలో పెల్లెట్‌ గన్‌ కాల్పులు .. 10 మందికి గాయాలు

1 గంట క్రితం

RTI response
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 12:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జులై 20న జరిగిన పార్లమెంట్‌ ర్యాలీలో పెల్లెట్‌ గన్‌ కాల్పుల కారణంగా సుమారు 10 మంది గాయపడినట్లు ఆర్‌టిఐ నివేదిక తెలిపింది. రెండు ఆసుపత్రులు ఇచ్చిన ఈ వివరాలను టిఎంసి ప్రతినిధి సాకేత్‌ గోఖలే సోమవారం ‘ఎక్స్‌’ పోస్ట్‌లో వెల్లడించారు. ఢిల్లీలోని లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రి ఇచ్చిన ఆర్‌టిఐ సమాధానంలో పెల్లెట్ల వల్ల తొమ్మిది మంది గాయపడినట్లు పేర్కొంది. ఈ సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి తన సమాధానంలో ఒక వ్యక్తి పెల్లెట్‌ గాయాలతో చికిత్స పొందినట్లు తెలిపింది. జులై 20న జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన సందర్భంగా పెల్లెట్‌ గన్‌లను ఉపయోగించినట్లు మొదట ఢిల్లీ పోలీసులు ఖండించారు. అయితే జులై 22న పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన జనరల్‌ డైరీ ఎంట్రీలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) అల్లర్ల నియంత్రణ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు నమోదైనట్లు సమాచారం. పెల్లెట్‌ గాయాలైన వారిలో 25 ఏళ్ల కళాకారుడు ప్రశాంత్‌ కుమార్‌ సింగ్‌, 25 ఏళ్ల షేక్‌ ఇర్షాద్‌ మన్సూరీ, 19 ఏళ్ల విద్యార్థి సాహిల్‌ లోచబ్‌, ఒక పాత్రికేయుడు ఉన్నారు. మరోవైపు 32 ఏళ్ల నూతన్‌ అనే మహిళ ‘మొద్దుబారిన ఆయుధం’తో గాయపడినట్లు వైద్య నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు జులై 20న జరిగిన నిరసనల్లో పెల్లెట్‌ గన్‌ గాయాల సంఖ్య ఐదుగా వార్తలు వచ్చాయని సాకేత్‌ గోఖలే తెలిపారు. అయితే ఆసుపత్రుల నుంచి సేకరించిన రికార్డుల ప్రకారం నిర్ధారిత సంఖ్య సుమారు 10 మందికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ఎయిమ్స్‌, రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రుల నుంచి మరిన్ని వివరాల కోసం తాను ఇంకా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. “రాజధానిలో నిరాయుధ నిరసనకారులపై పెల్లెట్‌ గన్‌లను ఉపయోగించినప్పటికీ, ప్రభుత్వం, పోలీసులు పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు? పెల్లెట్‌ గన్‌ బాధితుల నిర్ధారిత సంఖ్యను మోదీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదు?” అని గోఖలే ప్రశ్నించారు. లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కాలేజ్‌కు మార్చ్‌ అనంతరం 81 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఆర్‌టిఐ సమాధానాల్లో వెల్లడైంది. వీరిలో 46 మంది నిరసనకారులు, 35 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి 25 మంది పోలీసు సిబ్బంది, నలుగురు నిరసనకారులను చికిత్స కోసం తీసుకువచ్చినట్లు ఆ ఆసుపత్రి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్