న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. శనివారం జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం సాధించగా.. తాజాగా మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల హైజంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకం సాధించాడు. దీంతో అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల హైజంప్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా బసంత్ రికార్డు సృష్టించాడు.
హైజంప్‌లో అల్జీరియాకు చెందిన యూనిస్ అయాచి, బసంత్ కుమార్, బ్రిటన్‌కు చెందిన ఓటిస్ పూల్ 2.21 మీటర్ల ఎత్తును అధిగమించారు. అయితే అయాచి తొలి ప్రయత్నంలోనే 2.21 మీటర్లు దూకడంతో స్వర్ణ పతకం సాధించాడు. బసంత్ రెండో ప్రయత్నంలో ఈ ఎత్తును అందుకోవడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓటిస్ పూల్ మూడో ప్రయత్నంలో 2.21 మీటర్లు అధిగమించి కాంస్య పతకం సాధించాడు. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్‌లో షానవాజ్ ఖాన్ 7.84 మీటర్ల దూరం దూకి కాంస్య పతకం సాధించాడు. అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ లాంగ్‌జంప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం.








కామెంట్‌లు (0)