ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

70 ఏళ్ల దాత నుంచి రెండు కిడ్నీలు.. ఒకరికే మార్పిడి

1 గంట క్రితం

Two kidneys from a 70-year-old donor... transplanted into a single recipient.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 04:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 70 ఏళ్ల బ్రెయిన్‌డెడ్‌ మహిళ నుంచి సేకరించిన రెండు మూత్రపిండాలను ఒకే రోగికి విజయవంతంగా మార్పిడి చేసి ఎయిమ్స్‌-ఢిల్లీ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అధిక వయసు కారణంగా ‘మార్జినల్‌ డోనర్‌’గా పరిగణించిన దాత నుంచి రెండు కిడ్నీలను ఒకే రోగికి అమర్చడం ఎయిమ్స్‌లో ఇది రెండోసారి. మృతదాతల నుంచి లభించే అవయవాలను మరింతగా వినియోగించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.

జులై 28న ఈ శస్త్రచికిత్స జరిగింది. చండీగఢ్‌లోని కమాండ్‌ హాస్పిటల్‌లో బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 70 ఏళ్ల మహిళ నుంచి కిడ్నీలను సేకరించి ఆర్మీ హెలికాప్టర్‌ ద్వారా చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. అవయవాలకు సుమారు 12 గంటల కోల్డ్‌ ఇస్కీమియా సమయం ఉన్నప్పటికీ.. మార్పిడి అనంతరం రెండు కిడ్నీలు వెంటనే పనిచేయడం ప్రారంభించాయి. 56 ఏళ్ల మహిళకు రెండు కిడ్నీలను శరీరంలోని కుడివైపు అమర్చారు. ఆమె ఎలాంటి సమస్యలు లేకుండా కోలుకుని 10 రోజుల తర్వాత సాధారణ కిడ్నీ పనితీరుతో డిశ్చార్జ్‌ అయ్యారు.

60 ఏళ్లు దాటిన దాతల నుంచి లభించే అవయవాలను సాధారణంగా ‘మార్జినల్‌’ లేదా ‘ఎక్స్‌పాండెడ్‌ క్రైటీరియా డోనర్‌’ అవయవాలుగా పరిగణిస్తారు. ఇలాంటి దాతల నుంచి లభించే రెండు కిడ్నీలను కొన్ని సందర్భాల్లో ఒకే రోగికి అమర్చడం ద్వారా వయసు లేదా ఇతర కారణాలతో సాధారణంగా తిరస్కరించే అవకాశం ఉన్న అవయవాలను కూడా వినియోగించుకోవచ్చు. ఎయిమ్స్‌ వైద్యుల ప్రకారం, డ్యూయల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ద్వారా మృతదాతల నుంచి లభించే కిడ్నీల వినియోగాన్ని పెంచి, చివరి దశ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరింత మంది రోగులకు మార్పిడి అవకాశాలు కల్పించవచ్చు. కోల్డ్‌ ఇస్కీమియా అంటే దాత నుంచి అవయవాన్ని సేకరించిన తర్వాత దాని జీవక్రియను నెమ్మదించేందుకు చల్లని పరిస్థితుల్లో భద్రపరిచి, రోగికి అమర్చే వరకు ఉండే సమయం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్