క్రీడలు : జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు మరోసారి సత్తా చాటింది. వరుసగా మూడోసారి టైటిల్‌ను గెలుచుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది. చైనాలోని మోకీలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఆతిథ్య చైనాను 1-0 గోల్స్ తేడాతో ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌పై 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అనంతరం సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-1తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
చైనాతో జరిగిన టైటిల్ పోరులో భారత జట్టుకు సనికా చంద్రకాంత్ కీలక గోల్ అందించింది. 17వ నిమిషంలో ఆమె చేసిన గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చైనా జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత క్రీడాకారిణులు సమర్థంగా అడ్డుకున్నారు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు.
ఈ విజయంతో భారత జూనియర్ మహిళల జట్టు 2027లో జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. భారత్‌తో పాటు పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన చైనా, జపాన్, దక్షిణ కొరియా కూడా ప్రపంచకప్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. 2023, 2024 సీజన్లలోనూ ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. తాజా టోర్నీలోనూ టైటిల్‌ను దక్కించుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.








కామెంట్‌లు (0)