గాలే : గాలే వేదికగా భారత్–శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆటలో టీమిండియా విజయానికి చేరువైంది. 372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక లంచ్ సమయానికి 67 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 197 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్‌కు మరో నాలుగు వికెట్లు మాత్రమే అవసరమయ్యాయి.
శ్రీలంక తరఫున సోనాల్ దినూష (65 బ్యాటింగ్) ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు. అతడికి కెషారా నువంతా 8 పరుగులతో అండగా ఉన్నాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 10 పరుగులు చేసిన నిరోషన్ డిక్‌వెల్లాను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్‌కు పంపడంతో శ్రీలంక 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో ధనంజయ డి సిల్వా 59 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 142 పరుగులకే లంక ఐదో వికెట్ కోల్పోయింది.
కెప్టెన్ ధనంజయ డి సిల్వా, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సోనాల్ దినూష అర్ధశతకాలతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లంకపై ఒత్తిడి పెంచారు. ఐదో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 96 పరుగులతో ఉంది. ధనంజయ 39, దినూష 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. అనంతరం లంక స్కోరు 100 పరుగుల మార్కును దాటినా, వరుస వికెట్లతో భారత జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రస్తుతం రెండు సెషన్ల ఆట ఇంకా మిగిలి ఉండగా, శ్రీలంక విజయానికి 197 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్లింది.







కామెంట్‌లు (0)