బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి, ఇసిల ఎంపిక కమిటీలో మంత్రి నియామకంపై సుప్రీంకోర్టు అభ్యంతరం

1 గంట క్రితం

sc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 06:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసిల) ఎంపిక కమిటీలో ప్రధాని నేతృత్వంలోని ఎంపిక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేబినెట్‌ మంత్రిని నియమించడంపై సుప్రీంకోర్టు బుధవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రిని నియమించడం అనేది కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా ‘ప్రత్యేకమైన వీటో’ అధికారాన్ని వినియోగించడమేనని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా వెల్లడించారు. సిఇసి, ఇసిల ఎంపిక కమిటీలో మంత్రి నియామకం నిష్పాక్షికతపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతోందని అన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకం, పనితీరులో స్వాతంత్ర్యం అనేది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అంతర్భాగమని, అలాగే రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన అంశమని, చట్టపరంగా సుస్పష్టమైన విషయమని జస్టిస్ దత్తా గుర్తు చేశారు. సిఇసి, ఇతర ఇసిల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023'లోని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనే విషయంలో భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు వెలువడిన తర్వాత, జడ్జి తన ప్రత్యేక అభిప్రాయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత ముఖ్యమైన అంశాలు ఉన్నందున, ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని డివిజన్ బెంచ్ సభ్యులైన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగపరమైన వ్యాఖ్యానానికి సంబంధించిన కీలక ప్రశ్నలు ఉన్న కేసుల విచారణకు కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఉండాలని నిర్దేశించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3)ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.


రిఫరెన్స్ ప్రశ్నపై ఇద్దరు న్యాయమూర్తులకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, నిబంధనల చట్టబద్ధతపై అధికారిక తీర్పును వెలువరించడానికి తగినంత మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు, ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తికి పంపడానికి వారు ఏకీభవించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసిన అనూప్ బరన్వాల్ కేసులోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును 2023 చట్టం "ఓడించిందని" పిటిషనర్లు వాదించారు. ఆ తీర్పు వెలువడిన కొన్ని నెలలకే ఆమోదించబడిన 2023 చట్టం, ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధాని నామినేట్ చేసిన ఒక కేబినెట్ మంత్రిని నియమించిందని అన్నారు.

సిఇసి, ఇసిల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గానికి ‘ప్రధాన నియంత్రణ’, ‘ప్రభావవంతమైన వీటో’ అధికారాన్ని చట్టం కల్పించిందని పిటిషన్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు గోపాల్‌ శంకరనారాయణన్‌, షాదన్‌ ఫరాసత్‌, ప్రశాంత్‌ భూషణ్‌, కాలీశ్వరం రాజ్‌, నేహా రాఠీల వాదనలు వినిపించారు. పిటిషనర్లు వ్యక్తం చేసిన ఆందోళనలో ప్రాథమికంగా సారాంశం ఉందని, దానిని కేవలం ‘తప్పుదారి పట్టించే రూపకాలు’గా కొట్టిపారేయలేమని జస్టిస్‌ దత్తా పేర్కొన్నారు. ఎంపిక కమిటీలో కేంద్ర మంత్రిని చేర్చడం నిష్పాక్షికతపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి ప్రధానమంత్రిని ధిక్కరిస్తారని ఆశించలేమని జస్టిస్‌ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్