ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
భారతీయ యువతకు స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ఆవశ్యకత, ఆయన ఆశయాల ప్రాముఖ్యతపై ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అవగాహన సదస్సు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమగ్ర వికాసం కోసం తత్వశాస్త్ర విభాగం, వివేకానంద కేంద్రం మధ్య కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందంపై చర్చించారు. ప్రిన్సిపల్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో కృత్రిమ మేధ విద్యార్థుల జీవితాల్లో అంతర్భాగంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ సాంకేతికతతో పాటు నైతిక విలువలు, మానసిక, శారీరక ఆరోగ్యంపై సరైన శిక్షణ అందించడం ఆవశ్యకమని ఉద్ఘాటించారు. ముఖ్య అతిథిగా రవినాయుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం, బోధనలు యువతకు సరైన దిశానిర్దేశం చేస్తాయని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానేతలపై వివేకానంద ఆలోచనలు ఎంతో ప్రభావం చూపాయన్నారు. వైస్ ప్రిన్సిపల్ వసంత లక్ష్మి మాట్లాడుతూ వివేకానంద జీవిత విశేషాలను ఉదహరిస్తూ సమాజంలో నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత ఆవశ్యకతను వివరించారు. రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్ర విభాగాధిపతి కె. సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవ, జాతి నిర్మాణంలో వివేకానంద ఆదర్శాలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో లక్ష్మీ కుమారి, రామారావు, సరోజ, రామకృష్ణ, ఉన్నికృష్ణన్, మహేష్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)