బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NZ vs IND - విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్‌..!

1 గంట క్రితం

NZ vs IND A spectacular catch by Virat Kohli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 12:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

NZ vs IND : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫిట్‌నెస్‌, మెరుపు వేగంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి వన్డేలో కోహ్లీ అందుకున్న అసాధారణ క్యాచ్ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్షుల్ కంబోజ్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన నాథన్ స్మిత్ బ్యాట్ అంచుకు తగిలిన బంతి రెండో స్లిప్ దిశగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో కోహ్లీ మెరుపు వేగంతో ఎడమవైపు డైవ్ చేస్తూ నేలను తాకకముందే ఒంటిచేత్తో బంతిని అందుకున్నారు. క్యాచ్ పట్టిన ఆనందంలో సంబరాలు చేసుకుంటూ, నాలుక బయటపెట్టి చిరునవ్వులు చిందించిన కోహ్లీ తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ స్థానం గురించి వస్తున్న విమర్శలకు అతడి ప్రదర్శన సమాధానంగా నిలిచింది.




భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల ...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. అర్ష్‌దీప్ సింగ్ (4/35), గుర్నూర్ బ్రార్ (3/42) అద్భుత బౌలింగ్‌తో కివీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. ఐదో ఓవర్లో విల్ యంగ్ (9), తొమ్మిదో ఓవర్లో హెన్రీ నికోల్స్ (9) వికెట్లను అర్ష్‌దీప్ పడగొట్టి భారత జట్టుకు శుభారంభం అందించారు. మరోవైపు రోహిత్ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్ చేయడం కూడా మ్యాచ్‌లో కీలక ఘట్టంగా నిలిచింది. అన్షుల్ కంబోజ్ సైతం రెండు వికెట్లు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను చివర్లో బ్లెయిర్ టిక్నర్ (34) ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కివీస్ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయింది.


అన్షుల్ కంబోజ్ వరుస దెబ్బలు ...

యువ పేసర్ అన్షుల్ కంబోజ్ కీలక సమయంలో న్యూజిలాండ్ మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. వికెట్ మెయిడెన్ ఓవర్‌తో ఒత్తిడి పెంచిన అతడు కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ వెంటనే తర్వాతి ఓవర్లో విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్‌కు నాథన్ స్మిత్ వెనుదిరిగారు. అంతకుముందే అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీసి కివీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దీంతో న్యూజిలాండ్ జట్టు కోలుకోలేని స్థితికి చేరుకుంది.


బౌలర్ల ఆధిపత్యంతో భారత్‌కు శుభారంభం ...

టి 20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన భారత జట్టు వన్డే సిరీస్‌ను మాత్రం ఘనంగా ప్రారంభించింది. సమష్టి బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో విశేషం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో టి 20 జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు భారత జట్టు తరఫున బరిలోకి దిగారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్