సెయింట్ లూయిస్ : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ (జిసిటి) టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచారు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కారువానాను 15-13 తేడాతో ఓడించి తన తొలి జిసిటి ఫైనల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 2 లక్షల డాలర్ల (సుమారు రూ.1.7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది. సెయింట్ లూయిస్ చెస్ క్లబ్‌లో గురువారం జరిగిన ఫైనల్‌లో ప్రజ్ఞానంద అద్భుతమైన పునరాగమనం చేశారు. ఆట ప్రారంభానికి ముందు కారువానా 9-3 ఆధిక్యంలో ఉన్నారు. తొలి క్లాసికల్ గేమ్‌లో కారువానా విజయం సాధించగా, రెండో క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో ప్రజ్ఞానంద ఆరు పాయింట్ల వెనుకబాటుతో చివరి రోజు ర్యాపిడ్, బ్లిట్జ్ గేమ్‌లకు దిగారు. అయితే ర్యాపిడ్ గేమ్‌లలో ప్రజ్ఞానంద సత్తా చాటారు. వరుసగా రెండు గేమ్‌ల్లోనూ కారువానాను ఓడించి ఎనిమిది పాయింట్లు సాధించారు. దీంతో 11-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అనంతరం జరిగిన నాలుగు బ్లిట్జ్ గేమ్‌ల్లో ఇరువురు చెరో నాలుగు పాయింట్లు సాధించడంతో ప్రజ్ఞానంద 15-13తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విజయం ప్రజ్ఞానంద కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విజయాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో వచ్చే ఏడాది గ్రాండ్ చెస్ టూర్‌లో పాల్గొనే అర్హతను కూడా ఆయన ఖాయం చేసుకున్నారు. ఈ టోర్నీలో మూడో స్థానాన్ని అమెరికాకు చెందిన వెస్లీ సో దక్కించుకున్నారు. ఆయన జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై 18-12తో విజయం సాధించారు.
గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)