సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్ఓఎం ఎన్నికల ప్రచారంపై పి.టి. ఉష ఫిర్యాదు

9 గంటల క్రితం

pt usha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- డోలా బెనర్జీపై కోడ్ ఉల్లంఘన ఆరోపణలు!

న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఎన్నికల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. సోమవారం (నవంబర్ 9, 2026) జరగనున్న అత్యుత్తమ ప్రతిభ గల క్రీడాకారుల (ఎస్ఓఎం) ఎన్నికల్లో వాట్సాప్ ద్వారా ఓట్ల అభ్యర్థన చేపట్టడంపై ఐఓఏ అధ్యక్షురాలు పి.టి. ఉష అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఆర్చర్ డోలా బెనర్జీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. డోలా బెనర్జీ పేరుతో ఉన్న ఖాతా నుంచి ఒక వాట్సాప్ సందేశం ప్రచారంలోకి వచ్చిందని ఉష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'న్యూ భారత్ ప్యానెల్'కు మద్దతు ఇవ్వాలని కోరుతూ, నలుగురు అభ్యర్థులకు వారి బ్యాలెట్ సీరియల్ నంబర్లు, రోల్ నంబర్లతో సహా ఓటు వేయాలని ఆ సందేశంలో అభ్యర్థించినట్లు తెలిపారు.

2026 అక్టోబర్ 30న జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని క్లాజ్ 1.9ను ఉష ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం అభ్యర్థులు కొత్త మీడియా, సోషల్ నెట్‌వర్క్‌లతో సహా ఎలాంటి మాధ్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా ఓట్లను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థించడం కూడా ఈ నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందని ఆమె వాదించారు. అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిష్పక్షపాతంగా, గౌరవప్రదంగా, పరిమితుల్లో నిర్వహించాలని సూచించే క్లాజ్ 1.2, 1.3లను కూడా ఫిర్యాదులో ఉటంకించారు. ఇతర అభ్యర్థుల పట్ల తగిన గౌరవం పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.

సదరు వాట్సాప్ సందేశాన్ని పరిశీలించి, అది ఎలాంటి పరిస్థితుల్లో రూపొందించబడింది, ఎవరి ద్వారా ప్రచారం చేయబడిందనే విషయాలను నిర్ధారించాలని ఉష ఎన్నికల అధికారులను కోరారు. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకోవడంతో పాటు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నవంబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ప్రారంభమయ్యేలోపే ఈ ఫిర్యాదుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని పి.టి. ఉష కోరారు. తన ఫిర్యాదుకు ఆధారంగా వాట్సాప్ సందేశం స్క్రీన్‌షాట్‌తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రతిని కూడా జతచేశారు. పోలింగ్‌కు ముందు ఈ వివాదం తెరపైకి రావడంతో ఐఓఏ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్