మూడు అకాడమీల్లో 13 క్రీడాంశాలు
తక్షణ సాయంగా రూ.6కోట్లు విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి-స్పోర్ట్స్ కరస్పాండెంట్ : క్రీడా కారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో క్రీడా అకాడమీల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకొని మూడు అకాడమీల్లో 13 క్రీడాంశాలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణ సాయంగా రూ.6కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రీడా ప్రాధికారిక సంస్థ(సాప్) వైస్ ఛైర్మన్ నివేదించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం రాష్ట్రంలో మూడు జిల్లాల్లో క్రీడా అకాడమీల ఏర్పాటుకు ముందడుగు వేసింది. విశాఖపట్నం, కాకినాడ మరియు తిరుపతిలో క్రీడా ప్రాధికారిక సంస్థ(సాఫ్) ఆధ్వర్యంలో అకాడమీల ఏర్పాటు అనుమతి మంజూరు చేసింది. విశాఖపట్నంలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్(పురుషుల రెసిడెన్షియల్)లో 45మందికి రూ.1.46కోట్లకు, కాకినాడలో 70మంది అథ్లెట్లకు (బాలికల రెసిడెన్షియల్) కోసం రూ.1.97కోట్లు గ్రాంట్ చేసింది. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, హాకీ, ఖో-ఖోలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇక తిరుపతిలో పురుషుల, మహిళలకు వేర్వేరుగా 70మందికి జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌కోసం రూ.2.36కోట్లు మంజూరు చేసింది. అలాగే ఒక్క తిరుపతిలోనే పురుషులు, మహిళల బోర్డర్ కోసం రూ.40మందికి రైఫిల్ షూటింగ్, లాన్-టెన్నిస్‌కోసం రూ.20.60లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ తన వద్ద అందుబాటులో ఉన్న నిధులతోపాటు అకాడమీల నిర్వహణకు సంబంధించిన పునరావృత వ్యయాలను భరించడానికి రూ.6.003 కోట్లు అనుమతి మంజూరు చేసింది.







కామెంట్‌లు (0)