- 4x400మీ. రిలేలోనూ..
- రోయింగ్, స్కీట్ మిక్స్‌డ్, 10వేల మీ. మారథాన్‌లో కాంస్యాలు
20వ ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో ఐదు పతకాలు దక్కాయి. గురువారం జరిగిన వుషులో రోషిబినా దేవి రజత పతకంతో మెరవగా.. భారత మిక్స్‌డ్ 4x400మీ. రిలే జట్టు మరో రజత పతకాన్ని అందించింది. అలాగే మహిళల 10వేల మీ. మారథాన్‌లో సీమా కుమారి చారిత్రాత్మక కాంస్య పతకాన్ని సాధించగా.. రోయింగ్, మిక్స్‌డ్ స్కీట్ విభాగాల్లోనూ కాంస్య పతకాలు దక్కాయి.
ఐచి-నగోయా(జపాన్): ఆసియా క్రీడల మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో పూవమ్మ, విశాల్ తెన్నరసు, విత్య రామ్‌రాజ్ మరియు మను టిఎస్ లతో కూడిన బృందం 3నిమిషాల 14.46సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాయి. అలాగే మహిళల 10,000 మీటర్ల ఫైనల్లో సీమా కుమారి చారిత్రాత్మక కాంస్య పతకాన్ని అందించింది. తద్వారా 2023లో హాంగ్జౌలో జరిగిన గత క్రీడలలో తాము గెలుచుకున్న పతకాన్ని వారు తరిగి నిలబెట్టుకున్నారు. భారత్ రజత పతకం సాధించడంలో విత్య రామ్‌రాజ్ ప్రదర్శించిన అద్భుతమైన చివరి దశ (ఫైనల్ లెగ్) కీలక పాత్ర పోషించింది. బహ్రెయిన్ జట్టు 3 నిమిషాల 12.87సెకన్లతో గేమ్స్ రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక 10వేల మీ. మారథాన్‌ను సీమ 32 నిమిషాల 50.05సెకన్లలో పూర్తి చేసింది.తీవ్రమైన పోటీని అధిగమించి, 16 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో సీమ భారత్‌కు పతకాన్ని అందించింది. ఆసియా క్రీడలలో 10వేల మీ. పరుగు ఈవెంట్‌లో భారత్ గెలుచుకున్న పతకాలలో ఇది కేవలం మూడోది మాత్రమే.
ఇక 60 కేజీల సాండా ఈవెంట్‌లో పాల్గొన్న రోషిబినా దేవి ఫైనల్లో 0-2 తేడాతో చైనా ప్రత్యర్థి జాంగ్జ్ జియావో చేతిలో పరాజయాన్ని చవి చూసింది. దీంతో రోషిబినాకు రజత పతకం ఖాయమైంది. మార్షియల్ ఆర్ట్స్ ఈవెంట్ వుషులో 25 ఏళ్లు రోషిబినా పతకాన్ని గెలుచుకోవడం ఇది మూడోసారి. 2018లో జకర్తాలో జరిగిన గేమ్స్‌లో కాంస్యం, 2023లో హాంగ్జౌ గేమ్స్‌లో రజత పతకాలతో మెరిసింది. వాస్తవానికి ఈ టోర్నమెంట్ కోసం ఆమెను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. సెలెక్షన్ ట్రయల్స్ లో యువ అథ్లెట్ దివ్యాన్ష్ చౌదరీ చేతిలో రోషిబినా ఓటమి పాలైంది. కానీ దివ్యాన్షి గాయపడడంతో రోషిబినాకు మళ్లీ అవకాశం కల్పించడంతో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొంది. చివరి నిమిషంలో ఎంపికైన రోషిబినా రజతంతో మెరవడం విశేషం. మణిపుర్‌కు చెందిన రోషిబినాకు ఈసారి ఆసియా క్రీడల్లో దక్కిన పతకంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.
రోయింగ్‌లో కాంస్యం..
రోయింగ్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో భారత అథ్లెట్లు సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించారు. మొదటి 1500మీ. వరకు రెండో స్థానంలో సాగిన భారత ద్వయం.. ఆఖరి 500 మీటర్ల పోటీలో మూడో స్థానానికి పడిపోయింది. దీంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పోటీల్లో చైనా జోడీ స్వర్ణం సాధిం చగా.. ఉజ్బెకిస్థాన్ ద్వయానికి రజతం దక్కింది.
కబడ్డీలో సెమీస్‌కు...
కబడ్డీ పురుషుల విభాగంలో భారతజట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 37-21 పాయింట్లతో చైనీస్ తైపీని చిత్తుచేసింది. ఇక మహిళల జట్టు 33-16పాయింట్ల తేడాతో ఆతిథ్య జపాన్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది.
దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్..
ఆసియా క్రీడల హాకీ ఈవెంట్‌లో భారత్ దుమ్మురేపుతోంది. పూల్-ఏ నుంచి భారత జట్టు వరుసగా విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు 8-2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గింది. భారత స్ట్రయికర్ దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసాడు. దిల్‌ప్రీత్‌తో పాటు అభిషేక్, శిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రాజిందర్ సింగ్ కూడా గోల్స్ చేశారు.
స్కీట్ మిక్స్‌డ్‌లో కాంస్యం
ఆసియా క్రీడల స్కీట్ విభాగంలో భారత్‌కు మరో కాంస్య పతకం లభించింది. గురువారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో భారత జోడి అనంత్ జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలీవాల్.. ఫైనల్ చివరి రౌండ్‌లో 44 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. 138 సగటు స్కోరుతో అనంత్ జీత్, పరినాజ్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఆరు సిరీస్‌ల గేమ్‌లో 14, 21, 29, 36తో రాణించారు.







కామెంట్‌లు (0)