- కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు - రాకపోకలు బంద్
- నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు- పలు గ్రామాల్లో అంధకారం
- అరటి, జొన్న, బొప్పాయి, వరి పంటలకు నష్టం
- విద్యుదాఘాతానికి ఐదుగురు మృతి
- 48 గంటలు అప్రమత్తం : వాతావరణశాఖ
ప్రజాశక్తి-యంత్రాంగం : కోస్తాంధ్రను వణకించిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం-పోలాకి మధ్య తీరం దాటింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట మధ్యకళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదరుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అరటి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. తీరం దాటినప్పటికీ తీవ్ర వాయుగుండ ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వాయుగుండం తీరం దాటడంతో శ్రీకాకుళం జిల్లాలో అంధకారం నెలకొంది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలవాలడంతో గురువారం వేకువజామున మూడు నుంచి మధ్యాహ్నం వరకూ పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి తో పాటు టమాట, కూరగాయాల పంటలు 1576 ఎకరాల మేర నష్టం వాటిల్లింది. 276 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సంతబొమ్మాళి మండలంలోని పలు గ్రామాల్లో వర్షపు నీరు ముంచెత్తడంతో రొయ్యల చెరువులు నీట మునిగాయి. వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలు, రహదారులను పరిశీలించారు. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 115.25 మిల్లీమీటర్లు, కొత్తూరులో 31.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఎచ్చెర్ల మండలం కొయ్యాంలో అత్యల్పంగా 0.19 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హిరమండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో 33,400 ఇన్ ఫ్లో నమోదైంది. శ్రీకాకుళం నగరం కొత్త వంతెన వద్ద నాగావళి నదిలో ఏడు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. బాహుదాలో 23 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎగువశోభ ఘాట్‌రోడ్డులో భారీ వృక్షాలు, కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలో 93 ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. 37 గ్రామాల్లో విద్యుత్ అంతరాయం నెలకొంది. జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలవరం జిల్లాలో చింతూరు వద్ద శబరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. శబరి ఉపనదులైన సీలేరు, సోకిలేరు, చంద్రవంక, జల్లివారిగూడెం వాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ మండలంలో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడురాళ్లపల్లి వద్ద వాగు నీరు రహదారిపైకి చేరడంతో 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రంపచోడవరం, రాజవొమ్మంగి మండలాల్లోనూ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మారేడుమిల్లి నుంచి గుర్తేడు, పాతకోటవైపు వెళ్లే ప్రధాన రహదారి మార్గంలోని బొడ్లంక సమీపంలో పెళ్లిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, గొలుగొండ సహా పలు మండలాల్లో వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ పట్నం ఐదో వార్డు పరిధి కార్పెంటర్ కాలనీలో ఓ రేకుల షెడ్డు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లోనే దంపతులు వారి ఇద్దరు కుమారులకు గాయాలయ్యాయి. పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో ఉన్న ఏరువ చెరువుకు గండి పడింది. పెదగంట్యాడ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఇళ్లలోకి మోకాలు లోతు నీరు చేరింది. ఆర్కే బీచ్‌లో కోకో ఎరీనా ప్రాంతం కోతకు గురైంది.
ఉమ్మడి విశాఖలోని రైవాడ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరింది. విశాఖ జిల్లాలో 21 నుంచి 24 సాయంత్రం వరకూ కురిసిన భారీ వర్షాలకు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆనందపురం, భీమిలి మండలాల్లో 21 మంది రైతులకు చెందిన పది ఎకరాల్లో అరటి పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 11 ఇళ్లు దెబ్బతిన్నాయి.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా సుమారు 129 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 31 ట్రాన్సుఫార్మర్లు పాడైనట్లు అధికారులు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలంలో 275 ఎకరాల్లో అరటి, బొప్పాయి 110 ఎకరాలు, మొక్కజొన్న 90 ఎకరాల్లో నేలమట్టమైంది. విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో చీపురుపల్లిలో మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకూ అంధకారం నెలకొంది. చీపురుపల్లిలో ఒకటి, పార్వతీపురంలో ఒకటి, కొమరాడలో రెండిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పార్వతీపురం పట్టణంలోని ఎస్‌సి హాస్టల్ లోకి నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీతంపేట మండలంలో గొయిది గెడ్డ పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పార్వతీపురం, సాలూరు, పాచిపెంట మండలాల్లో మొక్కజొన్న, జియ్యమ్మవలస మండలంలో అరటిపంట నేలమట్టమయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లాలో 130.05 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లాలో 106 మిల్లీమీటర్లు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 34.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లాలో ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షం కురిసింది. రెండు జిల్లాల్లోనూ విద్యాసంస్థలు మూతపడ్డాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం పంచాయతీ పరిధిలో జల్లేరు వాగు పొంగిపొర్లుతోంది. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలోని గుబ్బలమంగమ్మ తల్లి జల్లేరు జలాశయం, చింతలగూడెంలోని పోగొండ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం పూచికపాడు గ్రామాల మధ్య కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారిపై నుంచి వరద నీరు వెళ్లడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంకన్నగూడెం పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం, వేపులపాడు గ్రామాల సమీపంలో వరద ఉధృతికి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లే రహదారి కొట్టుకుపోయింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు
ఎగువ ప్రాంతాలైన ఖమ్మం, తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బుడమేరు ఉధృతి ప్రమాదకర స్థితికి చేరింది. దీంతో వెలగలేరు వద్ద డైవర్షన్ కెనాల్ ద్వారా వరద నీటిని కృష్ణానదిలోకి పంపుతున్నారు. బుడమేరు ప్రవహించే మార్గంలో పలుచోట్ల చిన్నపాటి వంతెనలు, చట్టాల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. విజయవాడ రూరల్ మండలం నున్న వద్ద పెద్దవాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నున్న పిఎసిఎస్ అధ్యక్షుడు, టిడిపి గ్రామ అధ్యక్షులు కలకోటి శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. బుడమేరు వరద ప్రవాహం పెరిగినప్పటికీ, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
మున్నేరుకు భారీగా వరద
వైరా, కట్టెలేరు, మునేరు సంగమమైన కీసర బ్రిడ్జి వద్ద మున్నేరు కు భారీగా వరద చేరింది. కీసర సమీపంలోని మున్నేరు బ్రిడ్జి వద్ద నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. పెదవాగు ఉద్ధృతి వల్ల వెలగలేరు రెగ్యులేటర్ వద్ద బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.
ఎన్‌టిఆర్ జిల్లాలో 707.4 మిల్లీమీటర్ల వర్షపాతం
ఎన్‌టిఆర్ జిల్లాలో 707.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో 60 నుంచి 70 ఇళ్లు దెబ్బతిన్నాయి. 10 మంది వరకు గాయపడ్డారు. నదిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా— కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వీరులపాడు—నందిగామ మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దాదాపు 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విజయవాడ సింగ్‌నగర్, వన్‌టౌన్ ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు పర్యటించారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో అత్యధికంగా 103 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో అత్యధికంగా 101.8 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షం కురిసింది. అమరావతి మండలంలో లింగాపురం–అమరావతి మధ్యలో ఉన్న వాగు పొంగిపొర్లుతోంది.
విద్యుదాఘాతానికి ఐదుగురు మృతి
వర్షం, ఈదురు గాలులకు తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి బాపట్లలో తల్లీ కుమారుడు, అనకాపల్లిలో తల్లీకుమార్తె, కృష్ణా జిల్లాలో ఓ మహిళ మరణించారు.స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు ఉప్పరపాలెం గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. గురువారం ఉదయం ముద్రబోయిన రమాదేవి (52) తన ఇంటి నుంచి రహదారి పైకి వచ్చారు. తెగిపడిన విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. గమనించిన కుమారుడు వెంకటేశ్వర్లు (32) తన తల్లిని కాపాడే ప్రయత్నంలో తాను షాక్‌కు గురయ్యారు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామం గొల్లవీధికి చెందిన గొంప అప్పారావు అలియాస్ చిన్నబాబు ఇంటి వద్ద విద్యుత్ సర్వీస్ లైన్ తెగిపోయింది. తెల్లవారుజామున రొంగల జానకి (28) బాత్‌రూంకు వెళ్లే సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆమె కేకలు విని తల్లి గొంప మంగ (55) రక్షించేందుకు ప్రయత్నించగా ఆమె షాక్‌కు గురయ్యారు. విద్యుత్ వైర్‌ను తొలగించే క్రమంలో జానకి భర్త నాగరాజు కూడా ప్రమాదం బారిన పడ్డారు. అక్కడికక్కడే జానకి, మంగ చనిపోయారు. నాగరాజును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లే పల్లి గ్రామంలో తెగిపడిన విద్యుత్ తీగను తాకిన సామ్రాజ్యం అనే మహిళ మరణించారు.
పలు విమానాల దారి మళ్లింపు
భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన 'ఇండిగో' విమానం శంషాబాద్‌కు దారిమళ్లింపు. శంషాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన 'స్టార్ ఎయిర్‌లైన్స్' విమానం బెంగళూరుకు దారిమళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి.










కామెంట్‌లు (0)