గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసిపై మళ్లీ అభిశంసన!

1 గంట క్రితం

cec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 12:56 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిద్ధ‌మ‌వుతున్న ప్ర‌తిపక్షాలు

- ఉభయ సభల్లో నోటీసులు

- ఇసిలో విభేదాల నివేదికల నేపథ్యంలో నిర్ణయం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్ర‌తిపక్షాలు మరోసారి పార్లమెంట్‌లో అభిశంస‌న‌ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇవ్వడానికి కాంగ్రెస్‌ ఇతర ప్ర‌తిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో జ్ఞానేష్‌ కుమార్‌ తొలగింపునకు ప్ర‌తిపక్షాలు ప్రయత్నించడం ఇది మూడోసారి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన తాజా కథనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండు వారాల్లో నోటీసులు సమర్పించే అవకాశం ఉందని సమాచారం. జ్ఞానేష్‌ కుమార్‌ తొలగింపునకు ప్ర‌తిపక్షాలు ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించాయి. మార్చి 12న లోక్‌సభలో 130 మంది ఎంపిలు, రాజ్యసభలో 63 మంది ఎంపిలు సంతకాలతో తొలగింపు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్‌ 6న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, అప్పటి రాజ్యసభ ఛైర్మన్‌ సి.పి రాధాకృష్ణన్‌ ఆ నోటీసులను స్వీకరించేందుకు నిరాకరించారు. ఏప్రిల్‌ 24న 73 మంది ప్ర‌తిపక్ష రాజ్యసభ సభ్యుల సంతకాలతో మరో నోటీసు సమర్పించారు. ఇందులో తొమ్మిది ఆరోపణలను ప్రస్తావించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ నోటీసు రాజ్యసభ చైర్మన్‌ వద్ద ఇంకా పెండింగ్‌లో ఉందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైశంకర్‌ గుర్తు చేశారు.

రాజ్యాంగంలో ప్రత్యేక విధానం

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తొలగింపునకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(5) ప్రత్యేక విధానాన్ని నిర్దేశిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే సిఇసిని కూడా తొలగించాల్సి ఉంటుంది. తొలగింపు తీర్మానానికి లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. నోటీసును సభాధ్యక్షుడు లేదా చైర్మన్‌ స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. విచారణ దశకు చేరితే రెండు సభలు అదే సమావేశంలో మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ‘నిరూపిత దుష్ప్రవర్తన లేదా అసమర్థత’ ఆధారంగానే తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్