- అమెరికా పర్యటనలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు
- వాణిజ్య ఒప్పందం పొడిగింపు
- శ్వేతసౌధంలో ట్రంప్- జిన్‌పింగ్ భేటీ
- ఎఐపైనే అందరి దృష్టి
వాషింగ్టన్: ప్రపంచ శ్రేయస్సు కోసం కృతిమమేధ (ఎఐ) అభివృద్ధి మానవ నియంత్రణలోనే ఉండాలని చైనా అధ్యక్షులు జిన్ పింగ్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం మధ్యాహ్నం జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు చేరుకున్నారు. జిన్‌పింగ్‌కు, ఆయన సతీమణి పెంగ్ లియువాన్‌కు విమానాశ్రయంలో ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ స్వయంగా అరుదైన రీతిలో స్వాగతం పలికారు. అమెరికన్ చిన్నారులు దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేయగా, 21 తుపాకుల వందనం, ఇరు దేశాల జాతీయ గీతాల ఆలాపన, సైనిక విమానాల ప్రదర్శనతో స్వాగత కార్యక్రమం ఘనంగా సాగింది.
శ్వేతసౌధంలో లాంఛనప్రాయ స్వాగతం
గురువారం శ్వేతసౌధం సౌత్ పోర్టికోలో సైనిక బృంద వాద్యాల నడుమ ట్రంప్, మెలానియా దంపతులు జిన్‌పింగ్, పెంగ్‌లకు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘బీస్ట్’కు సమానమైన నల్లరంగు హాంగ్‌కీ (రెడ్ ఫ్లాగ్) ఎన్701 ఎస్‌యువిలో జిన్‌పింగ్ శ్వేతసౌధానికి చేరుకున్నారు. ఇరు జంటలు రెడ్ కార్పెట్‌పై కొద్దిసేపు కలిసి నిలబడిన అనంతరం లోపలికి వెళ్లారు. ఈ భేటీ, శ్వేతసౌధంలో జరిగిన లాంఛనాలను అమెరికాలోని ప్రధాన టివి చానెళ్లు ఏవీ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం గమనార్హం.
జిన్‌పింగ్‌తో కలిసి పనిచేస్తూనే ఉంటాను : ట్రంప్
తన ప్రారంభోపన్యాసంలో ట్రంప్ మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా పాత్రను గుర్తుచేస్తూ, ‘‘ఆ యుద్ధంలో విజయం సాధించేందుకు మన ప్రజలు కలిసి పనిచేసినట్టుగానే, ఇరు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పనిచేస్తూనే ఉంటాను’’ అని పేర్కొన్నారు. 2016లో తాను తొలిసారి అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి జిన్‌పింగ్‌తో పరస్పర గౌరవం, ప్రజల ప్రయోజనాల ప్రాతిపదికన ‘‘నిజమైన గొప్ప స్నేహాన్ని’’ పెంపొందించుకున్నట్టు ట్రంప్ చెప్పారు.
‘థ్యూసిడైడిస్ ట్రాప్’ను నివారించాలి: జిన్‌పింగ్
శ్వేతసౌధంలోని గ్రాండ్ ఫోయర్‌లో జరిగిన లాంఛన కార్యక్రమంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ, స్నేహాన్ని కొనసాగించేందుకు, సహకారాన్ని విస్తరించేందుకు, ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును పెంపొందించేందుకు ట్రంప్ ఆహ్వానం మేరకు తాను అమెరికా వచ్చినట్టు తెలిపారు. చైనా, అమెరికాలు రెండు ప్రధాన దేశాలుగా సహకారం వల్ల ప్రయోజనం పొందుతాయని, ఘర్షణ వల్ల రెండూ నష్టపోతాయని పలుమార్లు తాను చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న శక్తికి, స్థిరపడిన శక్తికి మధ్య యుద్ధం అనివార్యమనే సిద్ధాంతమైన ‘థ్యూసిడైడిస్ ట్రాప్’ను ఇరు దేశాలు నివారించాలని ఆయన సూచించారు.
‘‘పోటీ అనే మాటను మనం విస్మరించాల్సిన అవసరం లేదు, కానీ మన పోటీ ఆరోగ్యకరంగా, పరిమితుల్లోనే ఉండాలి. అది ఒకరినొకరు అధిగమించే పరుగు పందెంలా ఉండాలే తప్ప, ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోయే మల్లయుద్ధంలా ఉండకూడదు’’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. చైనా, అమెరికాల మధ్య ఘర్షణ, తలపడే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని, ఈ గ్రహంపై రెండు గొప్ప దేశాలుగా కలిసి మెలిగే సరైన మార్గాన్ని ఖచ్చితంగా కనుగొనగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాల్లో సంభాషణ, నివారణ యంత్రాంగాలను మెరుగుపరచుకుంటూ ఇరు దేశాల సైన్యాలు క్రమం తప్పకుండా చర్చలు జరపాలని, ‘‘థ్యూసిడైడిస్ ట్రాప్’ను అధిగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కృత్రిమ మేధ (ఎఐ) అంశాన్ని కూడా జిన్‌పింగ్ తన ప్రారంభోపన్యాసంలో ప్రస్తావించారు. ఎఐని మనుషులే ఎల్లప్పుడూ నియంత్రించేలా చూడాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని పేర్కొంటూ, ‘‘ఎఐ అభివృద్ధి, నిర్వహణను మంచి కోసం వినియోగించే సామర్థ్యం, బాధ్యత రెండూ మనకున్నాయి. ఎఐ అభివృద్ధి ఎల్లప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండేలా, ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడేలా చూసుకోవాలి’’ అని ఆయన స్పష్టం చేశారు.
అట్లాంటాకు రెండు పాండాలు, లక్ష మంది అమెరికన్ విద్యార్థులకు ఆహ్వానం కొద్ది రోజుల్లో అట్లాంటాలోని జూలో ఒక జత పాండాలు కొత్త నివాసం ఏర్పరచుకోనున్నాయని జిన్‌పింగ్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మార్పిడి కార్యక్రమాలు, అధ్యయనం నిమిత్తం లక్ష మంది అమెరికన్ యువతను చైనాకు ఆహ్వానించేందుకు బీజింగ్ యోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పెంచాలని కూడా జిన్‌పింగ్ శ్వేతసౌధంలో పిలుపునిచ్చారు. శ్వేతసౌధంలో లాంఛనప్రాయ స్వాగతం అనంతరం ఇరువురు నేతలు ఓవల్ ఆఫీసులో చర్చలు జరిపి, సాయంత్రం భారీ రాజకీయ విందుకు హాజరు కానున్నారు.
వాణిజ్య యుద్ధ విరమణ పొడిగింపు
జిన్‌పింగ్ పర్యటనకు ముందు జరిగిన కీలక పరిణామంలో, వాణిజ్య యుద్ధ విరమణను జనవరి వరకూ పొడిగించనున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. చైనా ఉప ప్రధాని హీ లిఫెంగ్‌తో భేటీ అనంతరం మాట్లాడుతూ, నవంబర్ 10తో ముగియాల్సిన ‘బుసాన్ ఒప్పందా’న్ని పొడిగించేందుకు, పరస్పరం సుంకాలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు ఆయన తెలిపారు. అధిక సుంకాల పరిస్థితి తిరిగి రాకుండా చూసుకునేందుకు ఈ పొడిగింపు ఇరు దేశాలకూ ప్రయోజనకరమే అయినప్పటికీ, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మరిన్ని కొనుగోలు చేస్తామని, అరుదైన ఖనిజాలను ఎక్కువగా విక్రయిస్తామని ఇచ్చిన హామీలను చైనా విస్మరించినట్టు తెలుస్తోంది. తైవాన్‌కు అమెరికా చేస్తున్న ఆయుధాల విక్రయాన్ని మరింత వాయిదా వేయాలని జిన్‌పింగ్ ట్రంప్‌ను కోరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అగ్రస్థానంలో కృత్రిమ మేధ (ఎఐ)
ఈ శిఖరాగ్ర భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం ఎఐ కానుంది. ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రమాదాలపై పరిశ్రమ వర్గాల నుంచి హెచ్చరికలు వెలువడుతున్నప్పటికీ, అభివృద్ధిని నెమ్మదింపజేసేందుకు కొత్త నిబంధనలపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే, సాంకేతికత అదుపు తప్పితే ఒకరినొకరు హెచ్చరించుకునేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంపై నేతలు అంగీకరించే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌తో భేటీకి ముందు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ పోస్ట్ చేస్తూ, ‘‘సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్‌ఐ)’’ చర్చకు వస్తుందని, అయితే దాన్ని ప్రస్తుత స్థితిలోనే ఉంచాలని తాను, చైనా ఇరువురూ భావిస్తున్నామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇటీవల మాట్లాడుతూ, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా పునర్నామకరణం చేయాలని ట్రంప్ అభిప్రాయపడగా, కొత్త నిబంధనలను తాను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు కూడా సంకేతాలిచ్చారు. మరోవైపు, ‘‘ముప్పు కథనాలు’’ ప్రపంచ ఎఐ పాలనకు ఆటంకం కలిగిస్తాయని చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది.
టెక్ దిగ్గజాలతో విందు
గురువారం నిర్వహించే ప్రత్యేక విందులో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల, యాపిల్‌కు చెందిన టిమ్ కుక్, ఓపెన్‌ఎఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్, ఎన్విడియాకు చెందిన జెన్సన్ హువాంగ్‌లతోపాటు, అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ తదితరులు ట్రంప్, జిన్‌పింగ్‌లతో కలిసి పాల్గొననున్నట్టు శ్వేతసౌధం అధికారులు తెలిపారు.
ట్రంప్, జిన్‌పింగ్ మధ్య సంబంధాలు కుదురుకున్నట్టు కనిపిస్తున్నా, వ్యక్తిగత శైలిలో వీరిద్దరూ పూర్తి భిన్నం. బీజింగ్‌లో గత మేలో జరిగిన భేటీలో ‘‘మీరు గొప్ప నాయకుడు’’ అంటూ జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసించగా, జిన్‌పింగ్ మాత్రం ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తారు. ట్రంప్ ప్రశంసలకు ఆయన స్పందించరు. బదులుగా ఇరు దేశాల మధ్య ఈ భేటీల ప్రాముఖ్యతపైనే దృష్టి సారిస్తారు. మీడియా ముందు యథేచ్ఛగా మాట్లాడే ట్రంప్ శైలికి భిన్నంగా, జిన్‌పింగ్ తన పర్యటనలోని ప్రతి అంశం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా సాగాలని కోరుకుంటారని పలువురు విశ్లేషిస్తున్నారు.







కామెంట్‌లు (0)