శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

"చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. లార్డ్స్‌లో అరుదైన ఘనత"

1 గంట క్రితం

Smriti Mandhana creates history... a rare feat at Lord's.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లండన్ : భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక మహిళల టెస్టు తొలి రోజున ఆమె తన కెరీర్‌లో 300వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. దీంతో భారత్ తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 29 సంవత్సరాల 357 రోజుల వయస్సులో ఈ మైలురాయిని అందుకుంది.


300వ మ్యాచ్‌లోనూ మంధాన తనదైన శైలిలో రాణించింది. 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 83 పరుగులు చేసింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అమీ జోన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో లార్డ్స్ మైదానంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత మహిళగా నిలిచే అవకాశం తృటిలో చేజారింది. అయినప్పటికీ ఆమె ఇన్నింగ్స్ భారత్‌కు బలమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించింది.


స్మృతి మంధాన అంతర్జాతీయ కెరీర్ 2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ భారత మహిళల క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 4,538 పరుగులు, వన్డేల్లో 5,411 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 718 పరుగులు నమోదు చేసిన ఆమె రెండు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలు సాధించింది. లార్డ్స్ టెస్టులో చేసిన పరుగులతో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, శుభాంగి కులకర్ణిలను అధిగమించి భారత మహిళల తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచింది.


భారత్‌కు ఆధిక్యం.. ఇంగ్లాండ్‌కు తొలి షాక్ ...

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సైవర్-బ్రంట్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే షఫాలీ వర్మ డకౌట్ అయినా, మంధాన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధశతకాలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు శుభారంభం అందించారు. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో టామీ బ్యూమాంట్ కేవలం రెండు పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 264 పరుగుల వెనుకబడి ఉండటంతో రెండో రోజు ఆటపై ఆసక్తి నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్