గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసీస్‌తో రెండో టెస్టుకు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. స్టబ్స్‌పై వేటు !

1 గంట క్రితం

South Africa announces squad for second Test against Australia... Stubbs dropped!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 03:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

క్రీడలు : సొంతగడ్డ పై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తొలుత 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించాలని భావించినప్పటికీ, టోనీ డీజార్జి అందుబాటులో లేకపోవడంతో అతడిని జాబితా నుంచి తొలగించింది.


తొలి టెస్టులో బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ట్రిస్టన్ స్టబ్స్‌కు జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో మాథ్యూ బ్రీట్జ్‌కేను ఎంపిక చేశారు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్టబ్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 33 పరుగులే చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు సాధించిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు.


మరోవైపు, మాథ్యూ బ్రీట్జ్‌కే చివరిసారిగా 2025లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో ఆడాడు. ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన అతడు 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉండటంతో అతడికి అవకాశం కల్పించినట్లు దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కొన్‌రాడ్ వెల్లడించాడు. మాథ్యూ ఇప్పటివరకు 50 ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 1,280 పరుగులు సాధించాడు.


ఇక రెండో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలను రియాన్ రికిల్‌టన్ చేపట్టనున్నాడు. దీంతో కైల్ వెరిన్నే బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. గత 13 ఇన్నింగ్స్‌ల్లో వెరిన్నే ఒక్క అర్ధశతకం కూడా సాధించలేకపోవడం అతడికి ప్రతికూలంగా మారింది.


తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల భారీ ఆధిక్యంతో సౌతాఫ్రికాను ఓడించింది. మాట్ రెన్‌షా తొలి ఇన్నింగ్స్‌లో 190, రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో అద్భుతంగా రాణించగా.. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా సత్తా చాటారు. దీంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.


ఇరు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 18 నుంచి గెబెర్హా వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తుండగా, విజయ పరంపరను కొనసాగించాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్