దుబాయ్ : మహిళల ఆసియా కప్ 2026 లో భారత జట్టు విజయపరంపరను కొనసాగిస్తోంది. హాంకాంగ్‌తో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ బౌలర్, తెలుగు తేజం శ్రీ చరణి మరోసారి తన సత్తా చాటింది. అద్భుతమైన బౌలింగ్‌తో రెండు వికెట్లు తీసిన ఆమె.. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు చేసింది. 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ స్వల్ప స్కోరుకే పరిమితమై భారీ ఓటమిని చవిచూసింది.
భారత విజయంలో శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది. కేవలం 3.2 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె 16 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో 2026 క్యాలెండర్ ఇయర్‌లో ఆమె టీ20ల్లో భారత మహిళల జట్టు తరఫున ఇప్పటివరకు 31 వికెట్లు సాధించింది.
దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత మహిళా బౌలర్ల జాబితాలో శ్రీ చరణి రెండో స్థానానికి చేరింది. 2024లో 30 వికెట్లు తీసిన దీప్తి శర్మను అధిగమించింది.
ఈ జాబితాలో పూనమ్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2018లో ఆమె 35 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పింది. శ్రీ చరణి ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ ఏడాది ముగిసేలోపు పూనమ్ యాదవ్ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది.
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్లు
35 వికెట్లు – పూనమ్ యాదవ్ (2018)
31* వికెట్లు – శ్రీ చరణి (2026)
30 వికెట్లు – దీప్తి శర్మ (2024)
29 వికెట్లు – దీప్తి శర్మ (2022)
29 వికెట్లు – రాధా యాదవ్ (2024)







కామెంట్‌లు (0)