శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జక్కంపూడి ‘టిడ్కో’ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి

1 గంట క్రితం

The Jakkampudi TIDCO houses must be completed immediately.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 12:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లేదంటే లబ్ధిదారులతో కలిసి మేమే గృహ ప్రవేశాలు చేస్తాం : సిపిఎం హెచ్చరిక


ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ జక్కంపూడి వద్ద టిడ్కో ఇళ్ల పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్. బాబురావు, మాజీ కార్పొరేటర్ బి. సత్యబాబు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు లేని పేదలందరికీ గృహాలు ఇస్తామని చెప్పిన మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వారు మండిపడ్డారు. 2014-19 మధ్యకాలంలో నాటి టీడీపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7.20 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి, పేదల నుండి రూ. 25 వేల నుండి 2 లక్షల రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారని, కానీ ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇళ్లు మాత్రం లబ్ధిదారులకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఈ ఇళ్లను పూర్తి చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. మొత్తం ఇళ్లలో 5 లక్షల ఇళ్లను రద్దు చేసి, ఇప్పుడు కేవలం 2,60,000 ఇళ్లు మాత్రమే అంటున్నారని ఆరోపించారు. జక్కంపూడి వద్ద 11 వేలకు పైగా గృహాలు మంజూరవగా, అందులో 6,500 ఇళ్లు ప్రారంభించామని, గత మార్చి నాటికి 2,200 ఇళ్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని, కానీ అక్కడ ఒక్క కరెంట్, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం వల్లే ఒక్కరు కూడా నివసించడం లేదని నేతలు ఎత్తిచూపారు. పేదల ఇళ్లకు పదేళ్లు తీసుకుంటున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి నివాసం, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు, అమరావతిలో బహుళ అంతస్తుల భవనాలను మాత్రం ఆరు నెలల్లోనే ఎలా పూర్తి చేస్తోందని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఉన్న శ్రద్ధ పేదల ఇళ్లపై లేదని దుయ్యబట్టారు. ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారులపై మోపిన రూ.3 లక్షల నుండి 4 లక్షల రూపాయలు బ్యాంకు రుణాలు, వాటిపై పెరిగిన వడ్డీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద కంపెనీల వేల కోట్ల అప్పులను రద్దు చేస్తున్న ప్రభుత్వం, పేదల అప్పులను ఎందుకు రద్దు చేయదని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించాలని, లేనిపక్షంలో లబ్ధిదారులను సమీకరించి సీపీఎం ఆధ్వర్యంలోనే నేరుగా గృహ ప్రవేశాలు (బలవంతపు ఆక్యుపేషన్) జరుపుతామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్