జపాన్‌లో యూట్యూబ్ లైవ్.. భారత్‌లో ఫ్యాన్‌కోడ్ ?
విజయవాడ : ఆసియా క్రీడలకు ముందు భారత్, జపాన్ క్రికెట్ జట్లు ప్రతిష్ఠాత్మక టి 20లో తలపడనున్నాయి. సెప్టెంబర్ 22న జపాన్‌లోని శానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ ఏకైక టి 20 మ్యాచ్ జరగనుంది. భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు గుర్తుగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే మ్యాచ్ ప్రసారంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రసార హక్కుల కోసం జపాన్ క్రికెట్ అసోసియేషన్ ఐటీడబ్ల్యూ యూనివర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆసియా క్రీడలు ప్రారంభానికి రెండు రోజుల ముందే మ్యాచ్ ఉండటంతో ప్రసార ఏర్పాట్లలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో జపాన్‌లో మ్యాచ్‌ను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో మాత్రం ఫ్యాన్‌కోడ్ ద్వారా ప్రసారం చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే రోజు ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఫైనల్ జరగనుంది. భారత జట్టు స్వర్ణ పతకానికి ప్రధాన పోటీదారుగా ఉంది. మహిళల ఫైనల్ ముగిసిన రెండు గంటల్లోనే భారత్-జపాన్ టి 20 జరగనుండటంతో ఒకేరోజు రెండు మ్యాచ్‌ల ప్రసారం జపాన్ బ్రాడ్‌కాస్టర్లకు సవాలుగా మారనుంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు భారత్-జపాన్ మ్యాచ్ కీలక అడుగుగా నిలుస్తుందని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. ఇలాంటి మ్యాచ్‌లతో జపాన్‌లో క్రికెట్‌కు కొత్త అభిమానులు ఏర్పడటంతో పాటు ఈ ప్రాంతంలో క్రీడ విస్తరణకు అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)