'స్క్విడ్ గేమ్' స్టార్ జంగ్ హో-యోన్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు
న్యూయార్క్ : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ జంగ్ హో-యోన్ ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌తో కలిసి వరల్డ్ కప్ ట్రోఫీ కేస్‌ను మైదానంలోకి తీసుకొచ్చి ఆవిష్కరించారు. ఈ గౌరవం పొందిన తొలి కొరియా నటిగా ఆమె నిలిచారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

జూలై 19 న న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌కు ముందు వేలాదిమంది అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిఫాతో భాగస్వామ్య సంస్థ అయిన లూయీ విట్టన్ ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీ ట్రంక్‌ను జంగ్ హో-యోన్, కార్లోస్ అల్కరాజ్ మైదానంలోకి తీసుకువచ్చారు. జంగ్ హో-యోన్ ఆ సంస్థకు గ్లోబల్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'స్క్విడ్ గేమ్' సిరీస్‌లో కాంగ్ సే-బ్యోక్ పాత్ర ద్వారా జంగ్ హో-యోన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నటిగా మారకముందు ఆమె ప్రముఖ ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. 'స్క్విడ్ గేమ్' విజయానంతరం అంతర్జాతీయ స్థాయిలో నటిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆ తర్వాత పలు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో నటిస్తూ ... ప్రముఖ లగ్జరీ బ్రాండ్లకు అంబాసడర్‌గా ఫ్యాషన్ షోలు, బ్రాండ్ ప్రచార కార్యక్రమాలు, ప్రపంచస్థాయి ఈవెంట్లలో పాల్గొంటూ తన గ్లోబల్ ఇమేజ్‌ను మరింత విస్తరించుకున్నారు. ఇటీవల దర్శకుడు నా హాంగ్-జిన్ తెరకెక్కించిన 'హోప్' (Hope) చిత్రంతో జంగ్ హో-యోన్ తన ఫీచర్ ఫిల్మ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే దక్షిణ కొరియాలో 20 లక్షలకు పైగా ప్రేక్షకుల మన్ననలను ఆమె పొందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటిస్తున్నారు. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ వంటి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే వేదికపై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో జంగ్ హో-యోన్ పాల్గొనడం ద్వారా ఆమె మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. వినోద రంగంతో పాటు ప్రపంచస్థాయి క్రీడా వేదికలపైనా ఆమెకు లభిస్తున్న గుర్తింపు మరింత విస్తరిస్తోంది.








కామెంట్‌లు (0)