బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionUS Open : యుఎస్‌ ఓపెన్‌ విజేత జ్వెరెవ్‌

14 గంటల క్రితం

zverev.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:07 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఫైనల్లో షెల్టన్‌‌పై గెలుపు

  • యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ‌టైటిల్‌‌ను టాప్‌‌సీడ్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ ‌జ్వెరేవ్‌ ‌చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో జ్వెరేవ్‌ ‌నాలుగుసెట్ల ఉత్కంఠ పోరులో అమెరికాకు చెందిన 8వ సీడ్‌ బెన్‌ షెల్టన్‌‌ను ఓడించాడు. ఆర్థర్‌ యాష్‌ స్టేడియంలో సోమవారం జరిగిన ఫైనల్లో జ్వెరెవ్‌ 6-3, 7-6(7-2), 5-7, 6-2తో షెల్టన్‌ను ఓడించాడు. దీంతో జ్వెరేవ్‌ ‌ఖాతాలో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరింది. ఫైనల్‌ను జ్వెరెవ్‌ దూకుడుగా ప్రారంభించాడు. బేస్‌లైన్‌ నుంచి పదునైన షాట్లతో షెల్టన్‌పై ఒత్తిడి పెంచాడు. అమెరికా ఆటగాడి డబుల్‌ ఫాల్ట్‌లు కూడా జ్వెరెవ్‌కు కలిసొచ్చాయి. ఆరంభంలోనే సర్వీస్‌ బ్రేక్‌ సాధించిన అతడు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. 6-3తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో షెల్టన్‌ పోరాటం పెంచాడు. సర్వీస్‌తో పాటు ర్యాలీల్లోనూ జ్వెరెవ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో సెట్‌ టైబ్రేక్‌కు వెళ్లింది. అయితే కీలక సమయంలో జ్వెరెవ్‌ తన స్థాయిని చూపించాడు. 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైబ్రేక్‌ను 7-2తో గెలుచుకున్నాడు. రెండు సెట్లు కోల్పోయినా షెల్టన్‌ వెనక్కి తగ్గలేదు. మూడో సెట్‌లో మరింత దూకుడుగా ఆడుతూ జ్వెరెవ్‌ రిథమ్‌ను దెబ్బతీశాడు. 3-3 వద్ద జ్వెరెవ్‌ సర్వీస్‌పై తొలి బ్రేక్‌పాయింట్‌ అవకాశాన్ని సృష్టించాడు. దానిని జర్మన్‌ ఆటగాడు కాపాడుకున్నప్పటికీ.. 5-5 పాయింట్లతో ఇరువు సమంగా ఉన్న కీలక సమయంలో షెల్టన్‌ పుంజుకున్నాడు. జ్వెరెవ్‌ సర్వీస్‌పై వరుసగా మూడు సెట్‌ పాయింట్లు సాధించాడు. ఒకదాన్ని కోల్పోయినా రెండో అవకాశంలో జ్వెరెవ్‌ ఫోర్‌హ్యాండ్‌ వాలీ బయటకు వెళ్లడంతో బ్రేక్‌ సాధించాడు. చివరకు 7-5తో మూడో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచాడు. నాలుగో సెట్‌ ఆరంభంలోనే షెల్టన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. షెల్టన్‌ పోరాడుతున్నా జ్వెరెవ్‌ ఏమాత్రం వెనక్కి తప్పలేదు. 4-2 వద్ద మరోసారి సర్వీస్‌ బ్రేక్‌ సాధించి టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. 5-2 వద్ద ఛాంపియన్‌షిప్‌ కోసం సర్వ్‌ చేస్తూ ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసినా వెంటనే ఏస్‌, ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో పుంజుకున్నాడు. చివరకు షెల్టన్‌ ఫోర్‌హ్యాండ్‌ బయటకు కొట్టడంతో మ్యాచ్‌ ముగిసింది. 2020 యుఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ అయిన జ్వెరేవ్‌ ఈ విజయంతో కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి తన తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 1989లో బోరిస్‌ బెకర్‌ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన తొలి జర్మన్‌ ఆటగాడిగా కూడా జ్వెరెవ్‌ రికార్డు సృష్టించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్