ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Wimbledon : మహిళల సింగిల్స్‌ టైటిల్‌ విజేత నోస్కోవా

1 గంట క్రితం

winner.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫైనల్లో 10వ సీడ్‌ ముఛోవాపై గెలుపు

  • నేడు జ్వెరేవ్‌, సిన్నర్‌ మధ్య టైటిల్‌ పోరు

‌లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను 9వ సీడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన లిండా నోస్కోవా చేజిక్కించుకుంది. సెంటర్‌ కోర్టులో శనివారం జరిగిన మూడుసెట్ల హోరా హోరీ ఫైనల్లో నోస్కోవా సహచర క్రీడాకారిణి 10వ సీడ్‌, కరోలినా ముఛోవాను ఓడించింది. దీంతో తొలిసారి కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నోస్కోవా 6-2, 5-7, 6-2తో ముఛోవాను చిత్తుచేసింది. తొలుత నోస్కోవా జోరుకు ముఛోవా బ్రేక్‌ వేసింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన నోస్కోవా.. రెండో సెట్‌లోనూ ఒక దశలో మ్యాచ్‌ పాయింట్‌కు చేరువలో వచ్చింది. ఆ దశలో అనూహ్యంగా పుంజుకున్న ముఛోవా ఆ సెట్‌ను 7-5తో చేజిక్కించుకొని నోస్కోవాకు షాక్‌ ఇచ్చింది. దీంతో తేరుకున్న నోస్కోవా.. నిర్ణయాత్మక మూడోసెట్‌లో తొలుత రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించి ఆ సెట్‌పై పట్టు సాధించింది. దీంతో మూడో సెట్‌లో నోస్కోవా తన అనుభవాన్ని ఉపయోగించి ముఛావాకు చెక్‌ పెట్టి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇద్దరు చెక్‌ క్రీడాకారిణుల మధ్య వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి. ఇక ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌.. 2వ ర్యాంకర్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాది జ్వెరేవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

టైటిల్‌ విజేతగా నిలిచిన లిండా నోస్కోవా భారత కరెన్సీలో రూ.46.11కోట్లు, రన్నరప్‌గా నిలిచిన ముఛోవా రూ.23.05 కోట్లు ప్రైజ్‌ మనీ అందుకున్నారు. ఈ ఏడాది నుంచి పురుష, మహిళల సింగిల్స్‌ టైటిల్‌ విజేతలకు సరి సమానంగా ప్రైజ్‌ మనీ అందజేయనున్నట్లు బ్రిటన్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ టోర్నీ ప్రారంభానికి ముందే ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్