మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విలువలు నేర్పే పుస్తకం

17 మే, 2026

book review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 07:37 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అనాది కాలంగా సమాజంలో స్త్రీ వివక్షకు గురవుతూనే ఉంది. అంతరిక్షవీధుల్లో విహరిస్తునందుకు గర్వించాలో, పట్ట పగలు అల్లరిమూకల మధ్యలో దైర్యంగా నిలబడలేనందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆడబిడ్డను ఒంటరిగా వీధి చివరకు పంపించే దైర్యం తల్లితండ్రులకి రాలేదన్నది నిర్వివాదం._ఈ పురుషాధిక్య సమాజంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చివరి వరకూ అవరోధాలను ఏదుర్కొంటూనే ఉంది. ఆకాశంలో సగం అని చెప్పినా, ఆమె కళ్ళల్లో కనిపించని, మాటలతో చెప్పలేని, మనసుతో మోయలేని వివక్షను ఎదుర్కొంటూనే ఉంది.

రచయిత పేట యుగంధర్ ప్రముఖ బాలసాహిత్యవేత్త. వీరి రచనలు తెలుగు ప్రముఖ దినపత్రికలలో.. సామాజిక మధ్యమాలలో చాలా ఉన్నాయి. వీరి రచనలు ఆలోచింపజేస్తూ, విలువలు పెంచుతూ ఉంటాయి. బాలలను, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని వీరు రచనలు చేస్తారు. అందులో భాగంగానే ‘తానా మరియు మంచి పుస్తకం’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలసాహిత్య నవలల పోటీల్లో వీరు రాసిన "జాను అనే నేను, నా స్నేహితురాళ్లు" అనే బాలల సాహస నవల ఎంపిక కావడం విశేషం._ సంకల్పం బలంగా ఉంటే, ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అనే నీతిని చక్కగా వివరించి, చదివేకొద్దీ తర్వాత ఏమవుతుందోనన్న ఉత్సుకతను నవల చివరి పేజీ వరకూ కొనసాగించి, పాఠకులను తన రచనా ప్రతిభతో ఆకట్టుకున్నారు రచయిత పేట యుగంధర్.

​కథ విషయానికి వస్తే, జానూ ఒక తెలివైన, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వాళ్ళ నాన్నకి, నానమ్మకు జాను కన్నా, జానూ అన్నయ్య కిషోర్ మీదే మమకారం ఎక్కువ. అందుకే తినే తిండి నుంచి బట్టలు, చదువు… చెప్పుకుంటూ పొతే, ఏదీ కిషోర్ తో సమానంగా జానుకు అందేవి కాదు. ఇవన్నీ గమనించిన జాను తన పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను అవగతం చేసుకొని, స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, జీవితం మీద పూర్తి అవగాహనతో ముందుకు సాగుతుంది. పాఠశాల స్థాయిలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచింది. తన అన్నయ్య కిషోర్ కన్నా జానుకు తక్కువ వసతులు ఉన్నప్పటికీ ఎక్కువ మార్కులను తెచ్చుకోగలిగింది.

​ఏదైనా సమస్యను ఎదుర్కొనే దైర్యం ఆడపిల్లలకి ఆభరణం, జాను సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తన గ్రామంలో తలపెట్టిన ఒక బాల్య వివాహాన్ని తన స్నేహితురాళ్లు, పోలీసుల సహాయంతో నిలిపివేసి, ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడింది. తద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ నవల ద్వారా రచయిత ఇటీవల జరుగుతున్న పిల్లల కిడ్నాపుల గురించి సమాజాన్ని అప్రమత్తం చేయడం, వ్యవస్థలోని లోటుపాట్లని జాను పాత్ర ద్వారా వెలుగులోకి తీసుకుని రావడం మంచి విషయం. ప్రతి ఏటా మన దేశంలో వేల సంఖ్యలో బాలలు అదృశ్యమవుతున్నారు. వారిలో కొందరు అవయవాలు అమ్మేసే ముఠాలో మగ్గిపోతా ఉంటే, మరికొందరు బాలకార్మికులుగా కుమిలిపోతున్నారు.

అమ్మాయిలు కొందరు లైంగికంగా కూడా హింసించబడుతున్నారన్నది సామజిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది. తన పిన్ని కూతురు మూడేళ్ళ అమృత కనబడకుండా పోవడంతో, తన ఊరిలో, చుట్టుపక్కల ప్రాంతాలలో పిల్లలు తప్పిపోతున్నారన్న విషయాన్ని గమనించిన జాను, తన టీచర్, స్నేహితురాళ్ల సహాయంతో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా గుట్టు రట్టు చేసిన తీరు అమోఘం. తన తెలివి తేటలతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ముఠాను పోలీసులకు పట్టించి అందరి మెప్పు పొందడం నవలలో కీలక పరిణామం.

ఆడపిల్లకు చదువు ప్రాధాన్యత చెబుతూ, సూక్ష్మదృష్టితో చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలకి పరిష్కారం చూపే నేర్పు, ధైర్య సాహసాలను అలవరచుకోవాలని చెప్పే ఆడపిల్లల నిజమైన స్నేహితురాలు ఈ నవల. పుస్తకం చదివిన బాలికలకు జాను ఒక రోల్ మోడల్ కాగలదు. స్వీయ క్రమశిక్షణ, ధైర్యం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కుటుంబ బాధ్యత, అనుబంధం, నాయకత్వ లక్షణాలు, సాహసం, సమస్య పరిష్కార నైపుణ్యం, సామాజిక బాధ్యత లాంటి సుగుణాలన్నీ జాను పాత్రకి ఆభరణాలు. పుస్తకం చదువుతున్న పాఠకుడు తనకు తెలియకుండానే జానుతో ప్రయాణం చేస్తాడు. ఆమెతో పాటు నవ్వుతారు, ఏడుస్తారు, భయపడతారు, పోరాడతారు. పుస్తకంలో చివరి ఇరవై పేజీలు చదువుతున్నప్పుడు పాఠకులు జాను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు.

రచయిత ఈ నవలని ఎంతో గొప్పగా, ఒక సాహస బాలిక విజయగాథగా చిత్రీకరించడం వారి ప్రతిభకి నిదర్శనం. ఇది ప్రతి ఆడపిల్ల చదవాల్సిన నవల. ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు తప్పకుండా చదవాల్సిన నవల. ఇంత గొప్పగా ఈ రచన చేసిన రచయితకి మరోమారు హృదయపూర్వక శుభాకాంక్షలు.


​పుస్తకం : జాను అనే నేను, నా స్నేహితురాళ్లు (నవల)

రచన: పేట యుగంధర్

వెల: 60 రూ/-

పుస్తకం కొరకు : 9490746614


వినాయకం ప్రకాష్

8142512219


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్