mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాస్తవ జీవిత కథల సమాహారం....

3 గంటల క్రితం

వాస్తవ జీవిత కథల సమాహారం....
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 11:54 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రామన్ మ్యాగసెసే అవార్డ్ గ్రహీత (2025) ‘‘ఎడ్యుకేట్ గర్ల్స్’’ సంస్థ ఫౌండర్ సఫీనా హుస్సేన్ రాసిన ఈ పుస్తకం ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, సమాజ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఒక మారుమూల కుగ్రామంలో గ్రామసభలో, మహిళా సర్పంచ్ మాధురి ‘మీ పిల్లలను బడికి ఎందుకు పంపడం లేదు ?’ అని గ్రామస్తులను ప్రశ్నిస్తే .. ‘ఇంట్లో పని ఎవరు చేస్తారు?, 'నీళ్లు ఎవరు తెస్తారు?`, 'పశువులను ఎవరు కాస్తారు?`, 'చిన్నపిల్లలను ఎవరు చూసుకుంటారు?`... అని ప్రశ్నలతో సమాధానాలు వస్తాయి. ఇవన్నీ వాస్తవాలు. ఆ సభలోనే ఉన్న ఏడేళ్ల చిన్నారి ప్రీతిని ‘నువ్వు బడిలో ఏమి నేర్చుకుంటున్నావు?’ అంటే.. 26 ఆంగ్ల అక్షరాలను చక్కగా చెప్పడంతో, ఆ పాప తాత సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మరి ఆ వూరిలో ఎవరికీ తెలియని ఆంగ్లం తన మనవరాలు చెప్పడం గొప్పే కదా!. ఆ తాతను మొదట హేళన చేసినా, చదువు అవసరం చెబుతూ, చదువు ఉండడం వల్లనే తాను సర్పంచ్ కాగలిగానన్న మాధురి మాటలతో తమ పిల్లలను బడిలో చేర్చడానికి ముందుకు వస్తారు.

రోజూ ఇంటిపని చేస్తూ, మేకలు కాస్తూ, కష్టపడి చదువుకున్న పూజ ‘పదవ తరగతి పరీక్షలకు వేరే ఊరు వెళ్ళి రాయాలి నాన్నా’.. అంటే మరి ‘మేకలు ఎవరు కాస్తారు?’ అని నిర్లక్ష్యంగా, నిరాశక్తంగా సమాధానమిచ్చిన తండ్రి .. పరుగున వెళ్ళి, వాలంటీర్ కి చెబుతుంది. వాలంటీర్ వేరే పిల్లల సహకారంతో మేకలు చూసుకుంటే - పూజ మిగిలిన విద్యార్థులతో కలసి బస్సులో వేరే వూరు వెళ్ళి, పరీక్షలు రాసి, విజయం సాధిస్తుంది.

‘మీ పిల్లలను బడిలో చేర్పించండి’ అని వాలంటీర్ విజయలక్ష్మి చెబితే 'బడిలో చేరిస్తే పొట్టి బట్టలు వేసుకుంటారు?, పెద్ద చదువులు చదువుకొని, ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోతారు’ అన్న మాటలకు వాలంటీర్‌ ‌సమాధానం చెప్పకుండా హెడ్‌ ‌మాస్టారు చేత మాట్లాడిస్తుంది. ‘మాస్టారు! మీరు మీ అమ్మాయిని చదివిస్తున్నారుగా, మీరు పిల్లలకు ఇవే నేర్పిస్తున్నారా ?’ అని అడుగుతుంది. ఆ మాస్టారు ఆ సభను ఉద్దేశించి, చదువు జీవితంలో ఎలా వెలుగు నింపుతుందో వివరించారు. దాంతో అందరూ తమ పిల్లలను బడిలో చేర్చడానికి సిద్ధమవుతారు.

‘భర్త అకస్మాత్తుగా మరణిస్తే ఐదుగురు ఆడపిల్లలు, అత్తతో పాటూ రోజుకు ఒక పూట తింటూ బతుకుతున్న శాంతికి పిల్లలను బడిలో చేరిస్తే, చదువుతో పాటు మరోపూట కడుపునిండా తిండి తింటారు’ అని చెప్పి చేర్పించడం... అందరూ చదవాలన్న తపన కనిపిస్తుంది. మాన్ భారీ, ఫాల్తు, నారాజ్, గల్లా, అచ్చుకి, అంతిమ బాల.. ఇవన్నీ, కొడుకు పుట్టాలని కోరుకొని, కూతురు పుడితే- కోపంత,టుబాధతో అయిష్టంగా ఆ తల్లితండ్రులు పెట్టుకున్న పేర్లు... ఆ పేర్లు పెట్టబడ్డ అమ్మాయిల మనోవేదన, జీవన పరిస్థితులు మనం ఊహించుకోవాల్సిందే.

కొద్దిపాటి చదువు ఉండడం వల్ల ఒక అంగన్వాడీ టీచరుగా ఉద్యోగం పొందిన విభ.. తమ జీవితంలో ఎదురైన కష్టాలను చదువు వల్లే తమ చెల్లెళ్ళు ఎదుర్కోగలిగారని నమ్మి, ప్రతి అమ్మాయీ చదువుకోవాలని కోరుకుంటుంది. వాలంటీర్ లుగా మారిన విక్రమ్, సంజయ్ లాంటి వారు తమ స్వంత అనుభవాలను పంచుకుంటూ, కృషి చేయడం గొప్ప విషయం.

‘నా భార్యకు లేడీ డాక్టర్ దగ్గర మాత్రమే వైద్యం చేయిస్తా` అని ఒక వ్యక్తి అంటే..‘అయితే నీ కూతురిని బడిలో చేర్పించు’ అని అంటే.. ‘లేడీ టీచర్ ఉంటేనే చేర్పిస్తా’ అని తండ్రి అంటే.. ‘ఆడపిల్లలు బడికి వెళ్లకపోతే లేడీ టీచర్లు, డాక్టర్లు ఎలా వస్తారు?.’ అని చెప్పిన డైలాగ్స్‌ నాటికలో ఒక దృశ్యం.

ఇలా నాటికలు, ఇంటింటి సర్వేలు, సర్పంచ్ లు, ఊరి పెద్దలు, ఉపాధ్యాయులు, అధికారులతో సభలు, వ్యక్తిగతంగా, సమూహాలుగా కౌన్సెలింగ్, ఇలా వివిధ రూపాలలో.. పిల్లలను ప్రత్యేకించి ఆడపిల్లలను బడిలో చేర్పించేలాగా, బడిలో చేరిన పిల్లలు కొనసాగేలా చేయడం అందరూ చదువుకోవాలనే ప్రయత్నం కనిపిస్తుంది. 2017 లో ప్రారంభమై..30 వేల గ్రామాలు, 2 మిలియన్ల బాలికలను బడి బాట పట్టించిన "ఎడ్యుకేట్ గర్ల్స్" సంస్థ కృషికి హ్యాట్సాఫ్..

చదువు లేకపోతే ఓ అమ్మాయి ఇంటికి, వంటింటికి పరిమితమై, బాల్య వివాహం, అనారోగ్యం, లాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చదువుకుంటే.. తనకంటూ ఒక స్వరం, తన జీవితం పట్ల ఒక స్పష్టతతో, ధైర్యంగా ముందుకు వెళ్ళగల సామర్థ్యంతో ఎదిగే అవకాశం ఉంటుందని ఈ పుస్తకం చదివాక నాకు అనిపించింది. మన చుట్టూ బడిలో చేరని, చేరినా డ్రాపౌట్ అయిన, ఆసక్తి -ప్రతిభ ఉన్నా, ఉన్నత చదువులు కొనసాగించలేని అమ్మాయిలకు చిన్నపాటి సపోర్ట్ ఇవ్వగలిగితే కనీసం ఒక్కరి జీవితం అయినా మెరుగుపడుతుందేమో ఆలోచించండి. ‘‘Every last girl" (ప్రతి చివరి అమ్మాయి) చదువుకోవాలి అన్న ఉద్దేశం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ఈ పుస్తకం ఓ సందేశం, ఓ ప్రేరణ, ఓ స్వచ్ఛంద సంస్థ రెండు దశాబ్దాల ప్రయాణం.


రచయిత : సఫీనా హుస్సేన్

పేజీలు : 276

పుస్తకం దొరికేది : అమెజాన్

ధర : 279/-

డా. విజయలక్ష్మి

92462 77122

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్