సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​సమాజ పరిస్థితులకు అద్దం..

20 గంటల క్రితం

kavithvam rase chethulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:52 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సామాజిక స్పృహ, మార్పు, భావోద్వేగాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కవిత్వం ఒక ప్రబలమైన మాధ్యమం. కవిత్వంలోని సామాజిక భావాల్లో సామాజిక స్పృహ, చైతన్యం, నైతికత, మానవతా విలువలు, సాంస్కృతిక విలువలు, వారసత్వం కాపాడాల్సిందేనంటారాయన. ఆయనే చలపాక ప్రకాష్. రచయిత, కార్టూనిస్టు, కవి, రచయిత, వ్యాసకర్త, రమ్యభారతి త్రైమాస పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం ప్రధానకార్యదర్శిగా ఉన్న ఆయన సాహితీవేత్తగా ప్రపంచానికి సుపరిచితులు. ఆయన రాసిన కొన్ని కవితలు హిందీ, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి కూడా. చలపాకప్రకాష్‌ను సాహిత్య వేదికలకు పరిచయం ‌చేసిన తొలి గురువు సాంస్కృతీ సమాఖ్య వి.శిరీష్ కుమార్, ఎక్స్ రే కొల్లూరి. ఆ విషయాన్ని తను రాసిన 'కవిత్వం రాసే చేతులు` పుస్తకంలో తొలి పేజీలోనే ప్రస్తావించారు. 2018లో ఆయన రాసిన 'మూడో కన్ను` కవితా సంపుటి అనంతరం ఏడేళ్ల తర్వాత వచ్చిన కవితాఝురి 'కవిత్వం రాసేచేతులు`. చలపాక కవిత్వంపై మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు, సాహితీవేత్త విస్తాలి శంకరరావు ప్రోత్సాహంతో వి.లావణ్య పరిశోధనలు చేశారు. ప్రముఖ సాహితీవేత్త కీర్తిశేషులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య తనయుడు వశిష్ట, సాహితీమిత్రుడు శర్మ సిహెచ్ కూడా ఈ కవితా సంపుటి రావటానికి సహకరించారు. ఇక పుస్తక సమీక్షలోకి వెళ్తే...బుక్ టైటిల్ తోనే 'కవిత్వం రాసే చేతులు` పేరుతో రాసిన కవితలో 'కవిత్వమై కలిసిపోవాలనుంది/భావమై మెరిసి మురిసిపోవాలనుంది` అంటూ సాహిత్యంపై తనకున్న మక్కువను అమాంతంగా తెలియజేశారు. తెలవారకముందే అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నిరంతర ప్రవాహంలా ఫేజ్ బుక్, ఇన్ స్టా, వాట్సాఫ్ లలో వచ్చే సందేశాలపై విసిరిన బాణంగా 'ఇదేం బుక్కురా బాబూ!!? సంధించారు. ‘కవితగానో.. కథగానో ఊహాత్మక రూపం పరుచుకొని ఎన్ని హృదయాల్లోనో ముద్రించుకుపోతావు' అంటూ ఊహాత్మకం కవితలో కాసింత విశ్రాంతి తీసుకుంటున్న చోటికి వచ్చి తిష్టవేస్తావు అంటూ కవి మనో పలకాన్ని ఆవిష్కరించారు. రైలు ప్రయాణాల విషయాలను తెలియజేసేలా 'ఉనికి` 'మై మరుపు` కవిత సాగుతుంది. నేటి డిజిటల్ బతుకుల చిత్రాన్ని ఎంతో హృద్యంగా 'నిత్య ఖైదీ` కవితలో ఆవిష్కరించారు. కొత్త యాప్‌ల ప్రమాదం, భయాన్ని కూడా పట్టిచూపించింది. భార్యాభర్తలు విడిపోతే వచ్చే ఎడబాటే విడిపోవటం. కాలం విలువను తెలియజేస్తూ 'కాసేపట్లో ఆవిరై చెరిగిపోతోంది! అదేంటో కాలమంతా క్షణంలా కరిగిపోతుంది!? మనిషి కలల సామ్రాజ్యం చెదిరిపోతుంది` అంటూ తెలియజేశారు. ‘సూర్యుడు వేడినిస్తున్నాడు.. చంద్రుడు చల్లదనాన్ని పంచుతున్నాడు. కానీ మనిషి మ్రాతం అర్థరాత్రి వరకూ టీవీలో ఓటీటీల్లో సినిమాలు చూస్తూ.. ఫోన్లలో రీల్స్ కోసం పడరాని కుస్తీ పడుతూ తెల్లార్లు నిద్రకాస్తూ కళ్లు ఇంతింత వాస్తూ..` అంటూ నేటి డిజిటల్ సమాజంలో ప్రజల జీవన పార్శ్యాన్ని అద్దంలా చూపారు.

ప్రపంచంలో యుద్ధోన్మాదాన్ని, దాని ప్రమాదాన్ని గుర్తుచేస్తూ 'వాడెవడో కష్టపడి తయారుచేస్తాడు, వీడెవడో వ్యాపారం చేసి అమ్మి పెడతాడు, మధ్యలో ఉన్న అహంకారి మీసం మెలేస్తూ, కాలుమీద కాలేసుకుని చోద్యంగా చూస్తూ, ఏసీ గదిలో దర్జాగా కూర్చుంటాడు! అంటూ వెలుగులు కోల్పోతున్న దే(శ)హం కవితలో హెచ్చరించారు. తీపి బాల్యపు గుర్తులను ప్రస్తావిస్తూ 'ఎందుకో బాల్యంకెప్పుడూ ఎదగాలనే తొందరే పరుగెత్తుకెళ్లి జీవితపు ఆటల్లో గెలవాలన్న సందడే...! అంటూ 'ఊహలసందడి` కవితలో చిన్నప్పటి బాల్యపు మధురిమలను గుర్తుచేశారు. ప్రకృతి వనరులను నిర్వీర్యం చేస్తే, చెట్లను నరికేస్తే వచ్చే ఇబ్బందులను ప్రస్తావిస్తూ 'కాయలు తిన్నారు, పువ్వులు కోసారు, ఆకులు రాల్చారు, కొమ్మలు నరికారు, మోడుభారుతున్న చెట్లలో కొత్త చిగురింతలు వస్తుందనుకుంటే ఏకంగా కాటికి అమ్మి తగులబెట్టే కుట్రలో భాగస్వామ్యం!! అంటూ 'నేలమ్మ ఘోష` కవితలో చక్కగా ఆవిష్కరించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, దోపిడీలు, పేదరికం, కుల వ్యవస్థ, స్త్రీలపై జరుగుతున్న హింస వంటి సమస్యలపై కూటమి, ఎక్కడికి పోతున్నాం, ఇదేంకాలం, నాకు దక్కనిది, దిగ్బంధనం,

కలగలుపలా మాటలు, మూడు తలలపాము, బ్రేకింగ్ న్యూస్, సరికొత్త రుమాల్, దోచె ముఖాలు, చిప్ప, నిగ్గ్గు తేలాలి, లొంగుబాటు, ద్రోహుల్ని తరిమేయాలి, దాపరికం, ప్రయోజనం, ముసుగువీరుడు, ముసుగు, ప్రతిబింబం, వారసత్వపు చిరునామా వంటి కవితల్లో చక్కగా చూపించారు. బాటసారులు, ఎటాక్ అనే , దుర్ముఖి, పైకప్పు, చూద్దాం, గమ్యం తప్పదు వంటి వాటిల్లో ప్రజల్లో ఆలోచన రేకెత్తించి, వారిని చైతన్యవంతులను చేయడానికి ఈ కవిత్వం ఉపయోగపడుతుంది.

సమాజంలో విప్లవాత్మక మార్పులకు, పోరాటాలకు కవిత్వం ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేశారు. అచ్చుతప్పు, ఆకర్షణ, దురద,పేదవాడి నేస్తం!ఉచిత ద్రవం వంటి వాటిల్లో ప్రేమ, దయ, సత్యం, అహింస వంటి మానవతా విలువలను పెంపొందించారు. హైబ్రిడ్ రంగులు, ప్రయోజనం, యుద్ధం వెనుక, ఏ దేశీయులం, సరికొత్త పునాది వంటి కవితలు సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియడానికి దోహదపడేలా సాగాయి. కవిత్వం సమాజ సంస్కృతి, ఆచారాలు, జీవన విధానాన్ని కాపాడి, భావితరాలకు అందించే ఒక వారసత్వ సంపదగా గుర్తుచేస్తూ కాటు, మహాద్భుత వనం, రంగుల్నిమించిన , సువిశాల తత్వం, ప్రపంచఘోష, ఎండచిత్రం వంటి కవితలు ఆద్యంతం సాగాయి. పర్యావరణం, ప్రకృతిని ఆవిష్కరిస్తూ పలు కవితాలు చక్కగా సాగాయి. సమాజంలో మహిళ పాత్రను గుర్తుచేస్తూనే వారు గురయ్యే హింసారూపాలు, దారుణలు, సమస్యలపై ఆమెకు సాటితోపాటుగా మరికొన్ని కవితల్లో వివరించారు. మొత్తంగా పుస్తకంలోని 97 కవితల్లోనూ చలపాక ప్రకాష్ సాహిత్యంలోని సరిగమలు సోయగం, సాంధ్రత సరికొత్తదనంగా కనిపించింది.

యడవల్లి శ్రీనివాసరావు

​పుస్తకం: కవిత్వం రాసే చేతులు
పేజీలు :199
ధర:150/-
నెం: 92474 75975


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్