హిందూపురం: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్‌నగర్, వాల్మీకి కాలనీల్లో పోలీసులు ఆదివారం విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీలు అంకిత సురాన, కె.వి. మహేష్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్ల ఇళ్లను పరిశీలించి వారి ప్రస్తుత కార్యకలాపాలపై ఆరా తీశారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, వాటి రిజిస్ట్రేషన్, వాహన పత్రాలు, యజమానుల వివరాలను పరిశీలించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి ఇకపై నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న గణేష్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో నిర్వహించుకోవాలని, గొడవలు, అల్లర్లు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
హిందూపురంలో కార్డెన్ సెర్చ్.. 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)