ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసినిమారంగానికే ఆయనొక మూలస్తంభం

1 గంట క్రితం

M.H.REDDY BOOK.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:58 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సినిమా కేవలం వినోదం కాదు.. అది సమాజాన్ని ఆలోచింపజేసే శక్తివంతమైన కళారంగం. తెరపై కనిపించే ప్రతి పాత్ర, ప్రతి మాట.. ఏదో ఒక రూపంలో సమాజంపై తన ముద్ర వేస్తుంది. ఎందుకంటే సినిమా స్వాతంత్ర్య ఉద్యమకాలంలో సమాజాన్ని తనదైన బాధ్యతతో ప్రభావితం చేసింది. మూకీ సినిమాలతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు ఏఐ సాంకేతికతో ముందుకెళుతోంది. కాలం మారుతున్న కొద్దీ తెరపై శబ్దం, రంగులు, సాంకేతికత చేరాయి. అయితే 1931లో మొట్టమొదట తమిళ, తెలుగు తొలిటాకీ సినిమాలను తీసి దక్షిణ భారత టాకీ సినిమాలకు ఆద్యులుగా నిలిచింది హెచ్‌.ఎం.రెడ్డి అని గర్వంగా చెప్పుకోవచ్చు. భారతీయ సినిమా చరిత్రలో ఒక కీలకమలుపు ఆయనతోనే ప్రారంభమైంది. అప్పటివరకూ మూకీ సినిమాలు చూసిన ప్రజలు.. ఒక్కసారిగా తెర మీద నుంచి మాటలు వినిపించడంతో.. సినిమాపై ప్రేక్షకాదరణ పెరిగింది. అటువంటి సాంకేతిక నిపుణుడు, దర్శకుడు, నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి గురించి.. ఆయన కృషి, పట్టుదల, పనిపట్ల బాధ్యత ఇప్పటితరం తెలుసుకోవడం చాలా అవసరం కూడా. ఈ అంశాలపై రచయిత, జర్నలిస్టు హెచ్‌. రమేష్‌‌బాబు సీరియస్‌‌గా రీసెర్చ్‌ ‌చేశారు. హెచ్‌.ఎం రెడ్డి పరిచయస్తులతో మాట్లాడారు. ఆయన జన్మించిన ప్రాంతంతో మొదలుకొని, మరణించే వరకూ సాధికారమైన పరిశోధనాత్మక రచనతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

హెచ్‌.ఎం.రెడ్డి తీసిన సినిమాలతో పాటూ.. అందులోని కీలక ఘట్టాలను, ఆకాలంలో ముఖ్యమైన మార్పులను తెలియపరిచారు. ప్రతిపేజీలోనూ హెచ్‌.ఎం.రెడ్డికి కళారంగం పట్ల, సినిమా పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశారు. ఎంతోమంది సీనియర్‌ ‌నటీనటుల గురించి, అప్పట్లో వారి పనివిధానం గురించి కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ పుస్తకం కేవలం హెం.ఎం.రెడ్డి గురించేకాదు.. సినిమా చరిత్రను, సాంకేతిక విజ్ఞానాన్ని, సీనియర్‌ ‌దర్శక, నిర్మాతలు, నటీనటుల గురించి చాలా వరకూ తెలియజేస్తుంది.

భారతీయ తొలిటాకీ ‘‘ఆలం ఆరా’’

ప్రపంచ స్థాయిలో 1930ల నాటికి సినిమా రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నవి. ఇంపీరియల్‌ ‌కంపెనీ స్థాపకుడైన అర్దేషీర్‌ ఇరానీ భారతీయ సినిమా దశ, దిశను మార్చారు. హాలీవుడ్‌‌లో సైలెంట్‌ ‌చిత్రాల నిర్మాణం తగ్గుతూ మాటలు, పాటలు, సంగీతాలతో టాకీల నిర్మాణానికి అంతా ఆసక్తి చూపుతున్నకాలం అది. 1927లో హాలీవుడ్‌‌లో ‘జాబ్‌ ‌సింగర్‌’ టాకీ వచ్చింది. 1929లో బొంబాయిలోనే ఎక్సెల్సియర్‌ ‌థియేటర్‌‌లో 40 శాతం టాకీ చిత్రం ‘షో బోట్‌’ను చూసి పూర్తిస్థాయి భారతీయ చిత్రం తీయాలనుకున్నారు అర్డేషీర్‌ ఇరాని. ఇదే భారతీయ సినిమాను మలుపు తిప్పిన నిర్ణయం. బొంబాయికి చెందిన ప్రఖ్యాత నాటక రచయిత జోసెఫ్‌ ‌డేవిడ్‌ ‌రాసిన ‘ఆలం ఆరా’ నాటకాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న హెచ్‌.ఎం. రెడ్డిని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు.1931 మార్చి 14న బొంబాయిలో ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక చిత్రంలో తెలుగువారైన హెచ్‌.ఎం.రెడ్డి, ఎల్‌.వి. ప్రసాద్‌‌లు పనిచేయడం మనందరికీ గర్వకారణం. అప్పట్లో తెర నుంచి మాట రావడం అనేది గొప్ప విషయం. దీనికి కారణం సూపర్‌ ‌పర్ఫెక్ట్‌ ‌స్టూడియోల నిర్మాణంలో పరికరాల కోసం మిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం అవసరం లేకుండానే సాంకేతిక వనరులతోనే శబ్దాన్ని సమర్థవంతంగా రికార్డింగ్‌ ‌చేయవచ్చని ఈ సినిమా నిరూపించింది. మెజెస్టిక్‌‌లో యూనివర్సల్‌ ‌సౌండ్‌ ‌సిస్టమ్‌ ‌పునరుత్పత్తి పరికరాలను ఇరానీ స్థాపించారు. ఆయనతో కలిసి పనిచేసిన హెచ్‌.ఎం.రెడ్డి ఆ సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకున్నారు. అప్పటివరకూ సైలెంట్‌ ‌చిత్రాలకు డైరెక్టర్‌‌గా పనిచేసిన హెచ్‌.ఎం.రెడ్డి తమిళ, తెలుగు తొలి టాకీలు తీసేందుకు ముందుకు వచ్చారు.

‘‘కాళిదాస్‌’’తో గొప్ప ప్రయోగం

తమిళంలో ‘‘కాళిదాస్‌’’ తొలి తమిళ టాకీ సినిమా తీశారు. అది ఘన విజయాన్ని అందించింది. ఇందులో కొందరు పాత్రధారులు తమ మాతృభాష అయిన తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడారు. కానీ సినిమాకు సంబంధించిన శబ్దగ్రహణం అంతా జర్మనీ నుంచి తెప్పించిన విటాఫోన్‌ ‌ద్వారా చేశారు. సంగీత దర్శకుడు భాస్కరదాస్‌ ఈ చిత్రం కోసం సుమారు 50 పాటలను కంపోజ్‌ ‌చేయడం విశేషం. ఇందులో నటించిన టి.పి. రాజలక్ష్మి తొలి తమిళ హీరోయిన్‌‌గా చరిత్రకెక్కారు. ఆమె ఇందులో మూడు కీర్తనలు కూడా పాడారు. 1930లో దేశ స్వాతంత్ర్యం ఉధృతంగా సాగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని, స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రతిబింబించేలా పాటలను హెచ్‌.ఎం.రెడ్డి పెట్టారు. దాంతో ఈ చిత్రం విడుదలైన కొన్ని వారాల్లోనే ఘనవిజయం సాధించిందని అప్పటి ‘సుదేశ్‌‌ మిత్రన్‌’ పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా ‘‘భక్తప్రహ్లాద’’ తీశారు. 1932 ఫిబ్రవరిలో 6న విడుదలైంది. ఇందులో సురభి నాటక సంస్థ నుంచి వచ్చిన చాలామంది కళాకారులను ఎం.హెచ్‌.రెడ్డి సినిమా రంగానికి పరిచయం చేశారు. కొత్త నటీనటులనూ తెరకు పరిచయం చేస్తూ వారి చేత సామాన్య జనం మాట్లాడుకునే విధంగా డైలాగులు చెప్పించి ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడంలో హెచ్‌.ఎం.రెడ్డి శైలి తనదైన ముద్ర ఉండేది.

హెచ్‌.ఎం.రెడ్డి టాకీ సినిమాల ప్రయత్నం ప్రారంభించనప్పడు ముంబయి నుంచి మాద్రాసుకు మకాం మార్చారు. స్వయంగా ‘‘రోహిణీ పిక్చర్స్‌ ‌లిమిటెడ్‌’’ బ్యానర్‌ ‌స్థాపించారు. చాలా సినిమాలు తీశారు. జయపజయాలు చవిచూశారు. ఆ తర్వాత కాలంలో తెలుగువారు హిందీలోనూ చిత్రాలు తీయాలని పట్టుబట్టారు. ‘‘భారత దేశ సినిమా పరిశ్రమతో పోలిస్తే తెలుగు డైరెక్టర్లు, నటీనటులు ఎవ్వరికీ తీసిపోరు’’ అంటూ స్టేట్‌‌మెంట్‌ ఇవ్వడం అనేది సినీ పరిశ్రమలో మార్పునకు ఆయన పెద్దపీఠ వేస్తారనడానికి నిదర్శనం. తెలంగాణా నిజాం పాలనలో ఉన్నా.. హెచ్‌.ఎం.రెడ్డి ఇచ్చిన ధైర్యంతో ఎగ్జిబిటర్లు, డిస్ర్టబ్యూటర్లు అంతా కలిసి 1941 లో ‘‘హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ ‌కారమర్స్‌’’ ని స్థాపించారు. కన్నడ నేలపై పుట్టిన తెలుగువాడైన హెచ్‌.ఎం.రెడ్డి దగ్గర అసిస్టెంట్‌‌గా టి. కృష్ణ చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత ఎడిటర్‌‌గా, దర్శకుడిగా ఆయన ఎదిగారు. ఇలా చిన్నా, పెద్దవారందరినీ హెచ్‌.ఎం.రెడ్డి ప్రోత్సహించడం ఆయన దొడ్డ మనసుకు నిదర్శనం. ఇటువంటి నిక్కచ్చి, నిజాయితీ గల మనిషి గురించి హెచ్‌. రమేష్‌‌బాబు రాయడం నిజంగా అభినందనీయం.

వీర

94905 59477

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్