ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో కథకురాలిగా, సామాజిక స్పృహ కలిగిన రచయిత్రిగా రోహిణి వంజారి సుపరిచితులు. నిత్య జీవితంలో తారసపడే సత్యాలను, కన్నీళ్లు పెట్టించే వాస్తవాలను తన కథల ద్వారా ఆవిష్కరించిన ఆమె, తన అంతరంగ భావనలను, సమాజం పట్ల తనకున్న తపనను కవిత్వ రూపంలోకి మార్చి అందించిన అద్భుతమైన కవితా సంపుటి ఈ “దిగులు వర్ణం". కవయిత్రిగా ఇది ఆమెకు తొలి కవితా సంపుటి అయినప్పటికీ, అనుభవజ్ఞురాలైన ఒక తాత్వికతపు చూపు ఈ కవితల్లో మనకు కనిపిస్తుంది.
ప్రకృతి ఇచ్చిన సప్తవర్ణాల 'ఇంద్రధనుస్సు' కవితలో మనుషుల ద్వేషపు రంగులను చూసి భయపడి, ఒక "దిగులు వర్ణాన్ని" సంతరించుకుందనే లోతైన ఆలోచనను // ప్రకృతి అంతా రంగులమయం // మనిషి ప్రవృత్తిలోనే ఉంది అవకరపు గాయం // ప్రకృతిలో ఎన్నో రంగులు ఉన్నాయి. కానీ మనిషి తన స్వార్థంతో, కుతంత్రాలతో ఆ రంగులకు కుల, మత, రాజకీయ కలర్స్‌ను పులిమేస్తున్నాడని కవయిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. “మనుషుల మనోవర్ణాలకు భయపడి ఏ రంగుకు ఏ అవకరాన్ని అంటగడతారోనని.. కనపడాలంటేనే భయపడి దిగులు మేఘాన్ని కప్పుకుందిప్పుడు." అంటారు.
బాల్యం, యవ్వనం, స్త్రీ అస్తిత్వం, జీవిత తాత్వికత వంటి అంశాల్ని తడుతూ.. 'భయం నీడలో' // నడివీధుల్లో మా నగ్న దేహాల ఊరేగింపులతో// భీతిల్లి పడి ఉన్నాం.. // అంటూ ఉరితీయాల్సింది మృగాలని కాదు మృగ దాడికి పథకం వేసిన వ్యవస్థని అంటూ మూల కారణాల్ని తవ్వి చూపిన వైన్యం. అందుకు చేయవల్సిన కర్తవ్యాన్ని కూడా ఇలా తెలిపారు..// నేల రాలిన పూలు నేర్పిన పాఠాలు //ఆత్మరక్షక కవచాలై దిశదిశలా వ్యాప్తిస్తాయి ఇక..// అంటూ.. "నువ్వే నువ్వే" కవితలో ఓర్పు, సహనం, ప్రేమ నీ సహజ ఆభరణాలు. వీటితో పాటుగా ధైర్యం, ఆత్మబలం, పోరాడి సాధించే గెలుపు ముఖ్యం అంటూ నువ్వంటే నువ్వే ఇక అంటూ ఆత్మబలాన్ని నింపారు. బతకడం అంటే కేవలం పగలు రాత్రులు మారడం కాదు. మరణం అంటే కేవలం మట్టిలో కలవడమే కాదు.. వాటి మధ్య జరిగే ప్రయాణపు ఉద్దేశాన్ని 'కవచ కుండలాలు' కవితతో మనసున్న మనుషులుగా మారుదాం అంటూ సందేశాన్ని ఇస్తూ.. కర్తవ్యాన్ని తెలిపారు.
వృద్ధాప్యపు బెంగ సమాజానికి, మానవత్వానికి, అద్దం పట్టే వాస్తవాల్ని కంటికి కనబర్చారు. సమాజంలో నానాటికీ దిగజారిపోతున్న విలువలు, మనుషుల మధ్య పెరుగుతున్న దూరం 'చీకటి దీపాలు' కవిలో //ఒకరికి మోదం/ మరొకరికి ఖేదం // అంటూ //మనిషి మనిషికి చేసే ప్రేమ పందేరమే అసలైన పండుగ// అని ఎప్పటికీ తెలుసుకోలేము// చీకటి దీపాలం మేము..// అంటూ.. ముగించారు. మతం పేరిట గోడలు కట్టుకుని, నిచ్చెనమెట్ల ఆధిక్యం కోసం మనుషులు కొట్టుకు చస్తుంటే.. మనిషి ప్రవృత్తిలోని కుతంత్రాలను ఆమె తన కలంతో నిలదీశారు. ఇందులోని దిగులంతా వ్యక్తిగతమైనది కాదు. సమాజంలో కరువైపోతున్న మానవత్వం గురించిన దిగులు సామాజిక చైతన్యపు రంగుల్ని అద్దారు.
ఈ ఆధునిక సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను కవయిత్రి ఎంతో బలంగా చిత్రించారు. లైంగిక దాడులు, గృహహింస, సైబర్ నేరాలు వంటివన్నీ స్త్రీ అస్తిత్వాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చెబుతూనే, మహిళలు "విమెన్ కార్డ్" ఆశించకుండా స్వశక్తితో, ఆత్మవిశ్వాసంతో ఈ సమాజంలో ముందడుగు వేయాలని ప్రబోధించారు. "బాల్యపు చైతన్యాలు, యవ్వనపు శిఖరాగ్రాలు ఎక్కేసాక పడమటి మెట్లు దిగడమంటే ఎంత బెంగో.. మాటల ఊతం లేకుండా మరలుతున్న ఒంటరి పయనం..." అంటూ వృద్ధాప్యంలో మనుషులు పడే వేదనను కళ్ళకు కట్టారు. జీవితంలోని వివిధ దశలను, ముఖ్యంగా వయసు పైబడినప్పుడు మనుషుల్లో కలిగే ఒంటరితనాన్ని ఆమె కవితల్లో జీవిత తాత్వికతను జోడించి హృద్యంగా ఆవిష్కరించారు.
రచయిత్రి కవిత్వ శైలి చాలా సరళంగా, నేరుగా పాఠకుడి హృదయాన్ని తాకుతుంది. క్లిష్టమైన పదజాలం జోలికి వెళ్లకుండానే, నిత్యం మనం వాడే పదాలతోనే లోతైన తాత్విక స్పృహను కలిగించడం ప్రత్యేకత. వచన కవిత్వ రూపంలో సాగిన ఈ కవితల్లో వాక్య నిర్మాణం చాలా పొదుపుగా, అర్థవంతంగా ఉంది. కవయిత్రి సామాజిక ఘటనల పట్ల స్పందించిన తీరులో ఎక్కడా కృత్రిమత్వం లేదు. హృదయపూర్వకమైన ఆర్తి కనిపిస్తుంది. ప్రకృతి రంగుల నుంచి మొదలుకొని, సమాజంలోని అసమానతలు, స్త్రీ వేదన, మాతృత్వం, జీవిత సత్యాల వరకూ ఎన్నో అంశాలను ఒకే సంపుటిలో స్పృశించారు. కేవలం దిగులును మాత్రమే చూపించకుండా, ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు వైపు ఆశకు మెట్లు వేస్తూ కవయిత్రి పాఠకుడిని నడిపించారు.
ఈ కవితా సంపుటి ఆధునిక మనిషి అంతఃచేతనను తట్టి లేపే ఒక మేలుకొలుపు. సమాజం పట్ల బాధ్యత, సాటి మనుషుల పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కవిత్వం ఇది.
- వర్ధని
93461 58185
పుస్తకం పేరు : దిగులు వర్ణం (కవితా సంపుటి)
రచయిత్రి : రోహిణి వంజారి
నెం: 90005 94630
పేజీలు: 120,
ధర: 200/-









కామెంట్‌లు (0)