ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాస్త్రీయ ఆలోచనలకు ప్రతిరూపమే ‘మునికిష్టడి మాణిక్యం’

6 రోజుల క్రితం

‘Munikishtadi Manikyam’ is the embodiment of scientific thinking.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:24 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

​బాల సాహిత్యం పిల్లలను కాసేపు నవ్వించి, కొద్దిసేపు ఊహాలోకంలో విహరింపజేయడానికే పరిమితం కాకూడదు. వారి ఆలోచనలకు పదును పెట్టాలి. ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి. ప్రకృతిని పరిశీలించే చూపును ఇవ్వాలి. మూఢనమ్మకాల స్థానంలో శాస్త్రీయ దృక్పథాన్ని నాటాలి. అలాంటి లక్షణాలను తనలో మేళవించుకున్న కథే ‘మునికిష్టడి మాణిక్యం’. తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన శల్య వైద్య కుటుంబానికి చెందిన ఆర్‌సి కృష్ణస్వామిరాజు కలం నుంచి జాలువారిన రచనే ఇది. రచయితగా ఆయన రాసిన 650కు పైగా చిన్నా, పెద్దా కథలు వివిధ ప్రతికల్లో ప్రచురితమయ్యాయి. వీటిలో 150 పిల్లల కథలు, 18 కథా సంపుటాలు, రెండు నవలలు ఉన్నాయి. తానా, మంచిపుస్తకం సంస్థలు సంయుక్తంగా మునికిష్టడి మాణిక్యం పుస్తకాన్ని 2025లో ముద్రించాయి. పిల్లలకు సరళమైన కథాంశాన్ని తీసుకుని విజ్ఞానం, వినోదం, గ్రామీణ జీవితం, హాస్యం, మానవీయ విలువలను కలగలిపిన ఈ కథ ఆధునిక బాలసాహిత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. మునికిష్టడు ఎంతో ప్రేమగా పెంచుకున్న కోడి ‘మాణిక్యం’ కనిపించకుండా పోవడంతో కథ ప్రారంభమవుతుంది. మాణిక్యాన్ని వెతికే క్రమంలో మునికిష్టడు, అతని స్నేహితులు ఎదుర్కొనే అనుభవాలే కథకు ప్రాణం. అయితే ఇది కేవలం తప్పిపోయిన కోడిని వెతికే కథ కాదు. ప్రతి సంఘటన వెనుక ఒక విజ్ఞాన అంశాన్ని, ఒక ఆలోచనను, ఒక సామాజిక సందేశాన్ని రచయిత జోడించారు. అందువల్ల కథ చదువుతున్న పిల్లలకు తెలియకుండానే అనేక కొత్త విషయాలు పరిచయమవుతాయి. కథలో శాస్త్రీయ దృక్పథం ప్రధాన ఆకర్షణ. మూడు కాళ్ల కోడిపిల్లను చూసి కొందరు ఆశ్చర్యపడి, దానిని మూఢనమ్మకాలతో అనుసంధానించేందుకు ప్రయత్నిస్తారు. కానీ మునికిష్టడు దాని వెనుక జన్యుపరమైన కారణాన్ని గుర్తిస్తాడు. అసాధారణంగా కనిపించే ప్రతి విషయాన్నీ అద్భుతంగా భావించకుండా, దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచనను రచయిత పిల్లల్లో కలిగిస్తారు. ఇదే కథలోని అసలైన విజ్ఞాన సందేశం. రంగురంగుల కోడిపిల్లలు, పలవరేణి ఆకులతో పాలను గడ్డకట్టించడం, పుత్తూరు కట్టు వైద్య విధానం, జంతువుల ప్రవర్తన, పక్షుల అలవాట్లు వంటి అనేక అంశాలు కథలో సహజంగా కలిసిపోయాయి. విజ్ఞానం పుస్తకాల్లోని అక్షరాల్లోనే ఉండదని, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ, పల్లె జీవితంలోనూ, మన నిత్య అనుభవాల్లోనూ దాగి ఉంటుందని కథ చెబుతుంది. పిల్లలు ‘ఎందుకు?’ అని అడగడం తప్పు కాదని, ఆ ప్రశ్నే విజ్ఞానానికి తొలి మెట్టు అని రచన సూచిస్తుంది. పాత్రల చిత్రణ కథకు మరో బలం. మునికిష్టడు పరిశీలనా శక్తి, విజ్ఞానాసక్తి, తార్కిక ఆలోచన కలిగిన బాలుడిగా కనిపిస్తాడు. అతని స్నేహితులు బాలాజీ, కుచేలుడు, శంకరుడు, చంద్రుడు భిన్నమైన బాల్య స్వభావాలను ప్రతిబింబిస్తారు. బాలాజీ అమాయక హాస్యాన్ని పంచితే, కుచేలుడిలో మూఢనమ్మకాలతో పాటు ఆశావాదం కనిపిస్తుంది. శంకరుడు ఊహాలోకంలో విహరిస్తే, చంద్రుడు బాల్య సహజత్వానికి ప్రతినిధిగా నిలుస్తాడు. వీరి మధ్య జరిగే సంభాషణలు కథను ఉల్లాసంగా నడిపిస్తాయి. హాస్యం కూడా కథలో ప్రత్యేకమైన ఆకర్షణ. పిల్లల అమాయక ప్రశ్నలు, వారి అపోహలు, స్నేహితుల మధ్య చమత్కారాలు, పెద్దల వ్యాఖ్యలు సహజంగానే నవ్వు తెప్పిస్తాయి. అయితే ఆ నవ్వు వెనుక రచయిత ఒక ఆలోచనను దాచిపెడతారు. అందుకే హాస్యం కేవలం వినోదంగా మిగలకుండా కథకు సందేశాన్ని అందించే సాధనంగా మారింది.

ఈ పుస్తకంలో గ్రామీణ జీవితం సజీవంగా కనిపిస్తుంది. పల్లె వీధులు, బావులు, చెట్లు, కోళ్లు, పక్షులు, రైతు జీవనం, స్థానిక వైద్య పద్ధతులు, దేవాలయ వాతావరణం, పిల్లల ఆటలు, ఇవన్నీ కథకు సహజమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. పల్లె సంస్కృతిని రచయిత కేవలం నేపథ్యంగా చూపకుండా, కథలోని అనుభవాల్లో భాగం చేశారు. దీంతో పాఠకుడి కళ్ల ముందు ఒక పల్లెటూరు కదలాడుతున్న అనుభూతి కలుగుతుంది.

భాష సరళంగా, సహజంగా ఉండటం బాలలతో కథను మరింత దగ్గర చేస్తుంది. గ్రామీణ పదజాలం, సామెతలు, చమత్కార సంభాషణలు కథకు నిండుదనాన్ని ఇచ్చాయి. పిల్లలకు సులభంగా అర్థమయ్యే భాషలోనే విజ్ఞాన విషయాలను చెప్పడం రచయిత సాధించిన విజయంగా చెప్పాలి. అయితే కొన్ని సందర్భాల్లో విజ్ఞాన సమాచారాన్ని ఎక్కువగా చేర్చడం వల్ల కథా వేగం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు ప్రధాన కథాంశానికి కొద్దిగా దూరంగా వెళ్లిన భావన కలిగించినా, పిల్లల విజ్ఞాన వికాసం దృష్ట్యా అవి ఉపయోగకరంగానే నిలుస్తాయి. మొత్తంగా ‘మాణిక్యం’ పిల్లలను నవ్విస్తూ ఆలోచింపజేసే కథ. పరిశీలించాలి, ప్రశ్నించాలి, కారణాలను తెలుసుకోవాలి, మూఢనమ్మకాలను కాకుండా శాస్త్రీయ దృక్పథాన్ని నమ్మాలనే సందేశాన్ని సున్నితంగా అందిస్తుంది. ప్రకృతి పట్ల ప్రేమ, జంతువుల పట్ల ఆప్యాయత, స్నేహబంధాల విలువ వంటి మానవీయ అంశాలనూ కథ మోసుకొస్తుంది. నేటి పిల్లలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు, విజ్ఞానంతో ఆలోచించే అలవాటును పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ‘మాణిక్యం’ మంచి బాలసాహిత్య ప్రయత్నం. పిల్లలకు మాత్రమే కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా చదివి, పిల్లలతో చర్చించదగిన కథ ఇది. వినోదం నుంచి విజ్ఞానానికి, ఆశ్చర్యం నుంచి ఆలోచనకు, మూఢనమ్మకం నుంచి శాస్త్రీయ దృక్పథానికి పిల్లలను నడిపించే ‘మునికిష్టడి మాణిక్యం’ నేటి బాలసాహిత్యంలో తనదైన ముద్ర వేస్తుంది. పుస్తకానికి గోపాలకృష్ణ గీచిన బొమ్మ కూడా బాగా ఆకర్షణీయంగా ఉంది.

కళ్యాణ్‌

9640341721


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్