కుల వివక్షను కూకటివేళ్లతో పెకిలించి సమాజంలో ‘సమభావన’ రావాలనే ఆకాంక్షతో జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుండు నారాయణరావు తీసుకొచ్చిన పాటల సంకలన పుస్తకమే ‘సమభావన’. ప్రజాసంస్కృతి పాటలు పేరుతో అభ్యుదయం, సమభావంతో ఉన్న పాటలను ఇందులో పొందుపర్చిన తీరు అద్వితీయం. అభినందనీయం. ప్రతి పాటలోనూ లోతైన భావజాలం, శ్రమైక సంస్కృతి, సమభావం, సంస్కృతి, అసమానతలు లేని సమాజం వంటి అంశాలు ప్రతిబింబించాయి. కులం, మతం, ప్రాంతం పేరుతో పాలకపక్షాలు చేసే దుర్మార్గపు కుట్రలను పట్టి చూపించింది. మొదటి పాటగా శ్రీ శ్రీ రాసిన పాట మహాప్రస్థానం పుస్తకంలోని ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది.. చీకటి శక్తుల పీకలు దులిమే వెలుతురు వైపు మహాప్రస్థానం.. దోపిడీ బొక్కుల తుదముట్టించే న్యాయం వైపు మహాప్రస్థానం’ అంటూ సాగే పాటలో సామాజిక అసమానతలను పట్టిచూపారు. ‘నిను మోసినా నను మోసినా’ అంటూ కాకర్ల శ్యామ్ రాసిన పాటలో మనుషులంతా ఒక్కటే. అందరి శరీరంలో ఉండేది ఒకే రక్తం అంటూ సాగుతుంది. ‘తరలిరాద తనే వసంతం’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన పాటలోనూ, ‘గోవుల్లు తెల్లన’ అంటూ వేటూరి రాసిన పాటలో కూడా పశువులకు కూడా లేని తారతమ్యాలు మనుష్యులకు ఎందుకంటూ ప్రశ్నించారు. ‘ఏమండి పండితులారా..’ అంటూ సాగే పాటలో ‘కుల మతాల బేధం పెట్టి సంఘాన్ని చీల్చేశారు. సమానత్వాన్ని చంపారు.. అంటరానితనమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు’ అంటూ ప్రశ్నించారు. సినారె రాసిన ‘గాలికి కులమేదీ’ అంటూ సాగే పాటలో ‘ఏదీ ప్రతిభకు కలదా ఫలబేధం.. వీరులకెందుకు కులబేధం.. అది మనసుల చీల్చెడు మతబేధం’ అంటూ అసమానతలను గురించి పట్టిచూపించింది. ‘అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని..’ అనే పాటలోనూ ఇలాంటి మారణహోమం ఛాయలను పట్టిచూపారు. ‘చౌదరిగారు ఓ నాయుడు గారు ’ అంటూ గుండవరపు సుబ్బారావు రాసిన పాటలో ‘మీ పేరు చివర ఆ తోకలెందుకు.. ఈ ఊరు చివరనే మా పాకలెందుకు’ అంటూ సాగే పాటలో కులోన్మాదాన్ని పట్టిచూపించారు. ఆత్రేయ రాసిన ‘గున్నమామిడి కొమ్మమీద’ అంటూ సాగే పాటలో రెండుగూళ్లలో ఉండే రామచిలుక, కోయిలలు కూడా ‘ఒక పలుకే పలుకుతాయ్ ఒక జట్టుగా తిరుగుతాయి’ అంటూ ఐక్యతను తెలియజేసేది. శ్రీశ్రీ రాసిన ‘పాడవోయి భారతీయుడా..’ అంటూ సాగే పాటలో ‘కదిలి సాగవోయి ప్రగతిదారులా.. కాంచవోయి నేటి దుస్థితి ఎదురించవోయి ఈ పరిస్థితి..’ అంటూ సాగే పాటలో పదవీ వ్యామోహం, కులమత బేధాలు, భాషా ద్వేషాలు, దోపిడీ, విద్వేషాలు.. ఇలా సమాజంలోని అనేకాంశాల గురించి ప్రస్తావించారు. దాశరథి రాసిన ‘అందరికీ ఒక్క దేవుడు’లో ‘మతాలు ఏవైనా, కులాలు వేరైనా.. మంచి మనసుతో మనుషులమై మనమంతా కలిసుంటాము’ అంటూ మానవత్వపు సొబగులను గుప్పించారు. రాముడైనా, రహీమైనా, జీసస్ అయినా అందరికీ ఒక్కడే దేవుడు అంటూ ప్రభోదించారు. కదిరి వెంకటరెడ్డి రాసిన ‘కులంలో ఏముందిరా సోదరా.. వల్లకాటిలో ఒకటైపోదురు!’ అంటూ చచ్చాక కులం, మతం మట్టిలో కలిసిపోతాయన్నారు. వడ్లమూడి నాగేశ్వరరావు రాసిన ‘సుందర భారత మనందరిది’లోనూ కుల విభజనలు సమాజ ప్రగతికి తిలోదకాలని చెప్పారు. కరుణశ్రీ రాసిన ‘ మా కండలు పిండిన నెత్తురు’లోనూ పెత్తందారులకే అభివృద్ధి జరుగుతుందనే సందేశం ఇచ్చారు. పంచాది కృష్ణమూర్తి రాసిన ‘కులతత్వం కూలాలి’లో ‘కులం, మతతత్వం పోవాలి’ అంటూ గట్టిగా చెప్పారు. గుడిశ నటరాజు రాసిన ‘మానవత్వాన్ని మంటగలిపేదే ఈ కులం’, జయరాజు రాసిన ‘మనువాదానికి మరణశాసనం’, ‘ఉన్నదీ ఊరుబయటా’లోనూ అసమానతలను తెలియజేశారు. జి.సన్యాసిరావు రాసిన ‘గాలిది ఏ కులం’లో పక్షులు, ప్రకృతి, జంతుజాలాలకు లేని కులం, మనుష్యులకు ఎందుకంటూ ప్రస్తావించారు. దేవేంద్ర రాసిన ‘జాషువా సాహిత్య ఏరువాకా’లోనూ ‘అణగారిన ఆపన్నులు పెట్టిన పొలికేకనా జాషువా.. మన జాషువా’ అంటూ ప్రస్తావిం చారు. ఇలా అనేక పాటలు ఈ సంకలనంలో ఏర్చికూర్చారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినది అంటే అతిశయోక్తి కాదు.
- కార్తికేయ
పుస్తకం పేరు : సమభావన
పేజీలు : 158
సంకలనకర్త : గుండు నారాయణరావు
ప్రతులకు : 8886822312, 9490098042
ధర : రూ.150







కామెంట్‌లు (0)