కవిత్వం అంటే భావాలకు రెక్కలు తొడగడం. విజ్ఞానం అంటే ఆలోచనలకు దిశ చూపడం. ఈ రెండూ కలిసినప్పుడు అక్షరాలకు కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ఆ ప్రపంచంలోకి పాఠకుడిని ఆహ్వానించే ప్రయత్నమే పి. అరుణ్‌కుమార్ రచించిన ‘జీరో గ్రావిటీ’. ఫిజిక్స్ అంటే భౌతికశాస్త్రమని సాధారణంగా భావిస్తాం. కానీ దానిని సకల శాస్త్రాల సమాహారంగా, విజ్ఞాన ప్రపంచానికి సింహద్వారంగా దర్శించినప్పుడు దాని పరిధి మరింత విస్తరిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలనే కాకుండా సామాజిక జీవితం, మానవ సంబంధాలు, సమాజ పరిణామాలను సైతం భౌతికశాస్త్ర దృక్పథంతో పరిశీలించవచ్చని ‘జీరో గ్రావిటీ’ నిరూపిస్తుంది. మూల సూత్రాలను లోతుగా అర్థం చేసుకుంటే ప్రతి శాస్త్రంలోనూ ఒక తత్వం ఉంటుందని, ఆ తత్వంలోనే కవిత్వం దాగి ఉంటుందని అరుణ్‌కుమార్ తన రచనల ద్వారా చాటుతున్నారు. విజ్ఞానాన్ని సామాన్యులకు సైతం సులభంగా చేరవేయాలనే తపన కలిగిన ఉపాధ్యాయుడిగా ఆయన రచనల్లో సరళత, విషయ పరిజ్ఞానం, సామాజిక స్పృహ, కవితాత్మకత కనిపిస్తాయి.
‘శూన్యం–కవిత్వం’, ‘బిగ్ బ్యాంగ్’ వంటి అంశాల్లో విశ్వ విజ్ఞానాన్ని సులభమైన భాషలో పరిచయం చేసిన అరుణ్‌కుమార్, ‘జీరో గ్రావిటీ’లో అదే వైఖరిని కవిత్వంలోకి తీసుకొచ్చారు. మొత్తం 58 కవితలు ఉన్న ఈ సంపుటి ‘నిత్యత్వ నియమం’ నుంచి ‘సత్యోదయ సంతకం’ వరకు వైజ్ఞానిక ఆలోచనలతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ‘జీరో గ్రావిటీ’ అంటే వైజ్ఞానిక పరిభాషలో భారరహిత స్థితి. అయితే కవి ఈ పదాన్ని కేవలం భౌతికశాస్త్ర భావనగా కాకుండా తాత్విక, సామాజిక, కవితాత్మక ప్రతీకగా మలిచారు.
‘నా అక్షర శాంతి వికిరణాలు
సామాన్యుని హక్కుల
స్వర దర్పణ స్వేచ్ఛా ప్రతిబింబాలు’
అంటూ సంపుటి ప్రారంభంలోనే తన కవితా స్వరాన్ని ప్రకటించారు. సామాన్యుడి హక్కులు, స్వేచ్ఛ, సామాజిక బాధ్యతలను కవిత్వంలోకి తీసుకురావడం ఆయన రచనా దృక్పథానికి అద్దం పడుతుంది.
దేశ ప్రగతిని కూడా కవి ప్రత్యేకమైన వైజ్ఞానిక దృష్టితో దర్శించారు. ‘ఫస్ట్ స్టెప్ @50’ కవితలో అగ్రరాజ్యాల ఆలోచనల రేడియేషన్ నుంచి భారత అంతరిక్ష ప్రయాణం వరకు అనేక పరిణామాలను ప్రస్తావిస్తూ, ఒకనాటి ఆకలి భారతం నుంచి అంతరిక్ష శక్తిగా ఎదిగిన దేశ ప్రయాణాన్ని చిత్రించారు. సతీష్ ధావన్ దార్శనికత, ఆర్యభట్ట ప్రయోగం, చంద్రయాన్, మంగళయాన్ వంటి విజయాలు ఆయనకు కవితా వస్తువులయ్యాయి.
‘చంద్రయాన్ ఓ సైన్స్ విప్లవం
మంగళయాన్ రేపటి భవిష్యత్ దిక్సూచి
భారతం... మేరా భారత్ మహాన్’
అనే భావధారలో దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతిని కీర్తించారు. దేశభక్తిని కేవలం నినాదంగా కాకుండా శాస్త్రీయ పురోగతితో అనుసంధానించడం ఈ కవిత ప్రత్యేకత.
జననం నుంచి మరణం వరకూ... కవిత్వమే!
మానవ జీవితాన్ని మొత్తంగా కవిత్వంగా దర్శించడం కూడా ఈ సంపుటిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
‘నవ మాసాల అమ్మపోరు కవిత్వం!
నలుగురు మోసే పాడె తోడు కవిత్వం!
జనన మరణాల మధ్య బతుకంతా కవిత్వం!’
అంటూ జీవితంలోని ప్రతి దశలోనూ కవిత్వాన్ని అన్వేషించారు. నులివెచ్చని ప్రభాత కిరణాల్లో భావకవిత్వాన్ని, మండుటెండల్లో పోరాట కవిత్వాన్ని, ఇంద్రధనుస్సుల్లో ప్రేమకవిత్వాన్ని దర్శించడం ఆయనలోని కవి దార్శనికతకు నిదర్శనం.
కాలుష్యం, పర్యావరణ విధ్వంసంపైనా ఆయన ఎంతో భావోద్వేగంతో తీవ్రంగా స్పందించారు.
‘సూర్యుడెందుకో నిద్ర లేవడానికి
చిన్నపిల్లాడిలా మారాం చేస్తూ
తూర్పు తలుపులు తెరవడం లేదు
బయటికి రావడానికే కాదు
బతకడానికే భయపడుతున్నాడెందుకో...’
అంటూ ప్రకృతి సంక్షోభాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించారు. పర్యావరణ సమస్యను కేవలం శాస్త్రీయ గణాంకంగా కాకుండా జీవన సమస్యగా చూపించారు.
‘ఒకప్పుడు స్వేచ్ఛ...
ఇప్పుడు స్వచ్ఛత బర్నింగ్ టాపిక్’
అంటూ మారుతున్న సామాజిక ప్రాధాన్యతలను గుర్తుచేస్తారు. ‘ఎర్త్ ఎన్విరాన్‌మెంట్ హార్ట్ ఎటాక్’ కు థెరపీ అవసరమని చెప్పడం ద్వారా భూమిని రోగిగా, పర్యావరణ పరిరక్షణను చికిత్సగా ప్రతీకాత్మకంగా చూపించారు.
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర నేపథ్యంగా రాసిన ‘సునీత @ స్పేస్‌వార్’ లో సాంకేతిక వైఫల్యాల మధ్య అంతరిక్షంలో ఎదురైన అనిశ్చితిని కవితాత్మకంగా ప్రతిబింబించారు.
‘అంతరిక్షపు చెరసాలలో
భార రహితమై
సాంకేతిక వైఫల్యాల
గాఢాంధకారంలో...’
అనే భావచిత్రం అంతరిక్షంలోని భారరహిత స్థితినే కాకుండా సంక్షోభ సమయంలో మనిషి అనుభవించే మానసిక భారాన్ని కూడా సూచిస్తుంది. భౌతిక భావన ఒకచోట ప్రారంభమై మానవ తాత్విక అనుభవంగా మరోచోట విస్తరించడం ‘జీరో గ్రావిటీ’ ప్రత్యేకత.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంపై కవి చూపిన అభిమానం మరో ప్రత్యేకత.
‘కాలం కరిగిపోయి
కొవ్వొత్తిలా మారి
కలాం జీవన గమనానికి సెల్యూట్ చేస్తూ...
తూర్పు సందుల్లో సూర్యుడు కాదు
నేడు అబ్దుల్ కలాం ఉదయించారు’
అనే భావవ్యక్తీకరణలో కలాంను స్ఫూర్తి సూర్యుడిగా ప్రతిష్ఠించారు. కలాం కేవలం శాస్త్రవేత్తగా కాకుండా యువత కలలకు దిశ చూపిన ఆశావాదిగా కవి దర్శించారు.
‘జీరో గ్రావిటీ’కి పలువురు ప్రముఖ సాహితీవేత్తలు ప్రశంసలు అందించారు. సినీ గీత రచయిత డాక్టర్ వెనిగళ్ల రాంబాబు ఈ సంపుటిని సర్వశాస్త్ర సమ్మేళనంగా అభివర్ణించారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అరుణ్‌కుమార్‌ను సృజనశీల రచయితగా అభినందించారు.
పరిశోధక సాహితీవేత్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఫిక్షన్, నాన్‌ఫిక్షన్ రెండింటిలోనూ గ్రావిటీ పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ తెలుగు కవిత్వానికి కొత్త దిశను చూపించారని ప్రశంసించారు. డాక్టర్ సుంకర గోపాలయ్య శాస్త్రీయ దృక్పథాన్ని పట్టిచూపారని, డాక్టర్ పసునూరి రవీందర్ సైన్సుకు ఆధారాలు, కవిత్వానికి భావుకతను జోడించారని అభిప్రాయపడ్డారు. కత్తిమండ ప్రతాప్ ఫిజిక్స్ సూత్రాలకు తాత్విక ఆలోచనలను జోడించి సామాజిక వాస్తవాలతో అరుదైన అక్షర ప్రయోగం చేశారని పేర్కొనగా, జూకంటి జగన్నాథం అరుణ్‌కుమార్‌ను ‘ద్రవాధునిక కవి’గా అభివర్ణించారు.
పుస్తకం: జీరో గ్రావిటీ
రచయిత: పి. అరుణ్‌కుమార్
9394749536
సగ్గుర్తి నాగశిరోమణి
8247694665







కామెంట్‌లు (0)