ఎదలో అంతరంగం తరంగాలై మ్రోగుతుంది.
మనసు...ఆశల ముసుగుకప్పుకొని ఆరాటపడుతోంది.
ఆకాశాన్ని చుట్టేస్తుంది. విశ్వాన్ని తిరిగొస్తుంది.
ఏవేవో కలల్ని కంటుంది. బతుకు పోరుకై కదులుతుంది
మనసొక మంచుగడ్డయి కరుగుతుంది.
నిత్యం కోరికల ఆవిరైపోతుంది.
దుఃఖసాగరంలో పడి తనువు కొట్టుకుపోతుంది.
ఎదలో ఎదో తెలియని అలజడులు...
అలలై ఎగసిపడుతున్నాయి.
జలపాతాలై జారిపడుతున్నాయి.
నక్షత్రాల కాంతులై వెలుగుతున్నాయి.
నిత్యసంఘర్షణ యుద్ధంలో తలలు తెగిన_
చీకటి రోజులకు నిత్యదీపమై కాంతులీనుతోంది
ప్రయత్నం.
నేను నమ్ముకున్నదే ప్రయత్నాన్ని.
అంతుచిక్కని పద్మవ్యూహంలో జీవితమొక
రణరంగమై రగులుతోంది.
గుండె అగ్నిగుండమై మండుతుంది.
ఒళ్ళంతా అల్లుకున్న ప్రశ్నల తీగల్ని తెంపే
కత్తెరై కన్నీటి దారలతో పరుగులు తీస్తుంది.
ఉరకలెత్తే ఉత్సాహానికి దారిపొడవునా
ముళ్ళకంపలతో ముస్తాబు.
పాదాలు రక్తతర్పణంతో తడసిపోయి...
ఎర్రని గుర్తులను ముద్రిస్తున్నాయి.
బతుకుపోరులో అంతర్లీనమై సాగుతున్న.
సన్నని కాంతిరేఖల మీద నడుస్తున్న.
అదుపుతప్పిన అడుగులను సరిచేస్తూ...
గతితప్పిన గతాన్ని స్మరిస్తూ...
నడుస్తున్న సమయాన్ని ఆస్వాదిస్తూ...
వచ్చే ఆటుపోట్లను అంచనావేస్తూ...జీవితంలో
అంతర్లీనమై సాగుతున్నా.
అశోక్ గోనె
9441317361







కామెంట్‌లు (0)