ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిజ్ఞత

34 నిమిషాల క్రితం

vedhasri reasina item photo(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:09 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆ ఉదయం .. వంటకి అమ్మకి కూరగాయలు కోసిచ్చి, సెల్ అందుకుంది వినీత. గత కొద్ది రోజులుగా అదే కాలక్షేపం. సెల్ చేతిలో ఉంటే.. ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే అనుకుంది. అయితే, ఈ పని అమ్మకి నచ్చదు. చూస్తే చాలు విసుక్కుంటుంది. ‘ఎందుకు? అస్తమానమూ ఆ సెల్లు. ఈ సెలవుల్లో ఏ కుట్లో, అల్లికలో నేర్చుకోవచ్చు కదా! కాలక్షేపం అవుతుంది. పోనీ వంట నేర్చుకుంటావా? అంటే, అదీ లేదు. పెళ్ళయితే ఎలాగే? ఆ పరీక్షల రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో! గానీ, నీకు మరో వ్యాపకం లేకుండా పోయింది’ అంటూ విసుక్కుంది రామేశ్వరి.

ఆ మాటతో తనకూ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని అమ్మకేం తెలుసు. ఆ రోజూ ఎంతో దూరంలో లేదు. అందుకే, రోజులు గడుస్తున్న కొద్దీ ఏదో తెలియని అలజడి. స్థిమితంగా కూర్చోలేకపోతుంది. ఫిజిక్సు పేపరు కష్టంగా వచ్చింది. ఇంగ్లీషూ సరిగ్గా రాయలేదు. అలా ఆలోచిస్తుండగానే స్నేహితురాలు పూజిత నుంచి ఫోను వచ్చింది. ముగ్గుళ్ళ గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టరు సీతానగరంకు సైకిళ్ళ మీద వెళ్లి, ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయిలు వాళ్ళిద్దరే.

‘టీ.వీ చూసావా? ఈ రోజు’ అంటూ పూజిత ఆతృతగా అడిగింది.

‘లేదు.. ఏం?’ అడిగింది ఆశ్చర్యంగా.

‘రేపు మధ్యాహ్నం మన రిజల్ట్స్ విడుదల చేస్తారంట. ఏం జరుగుతుందో! ఏమో! నాకైతే చాలా భయంగా ఉంది’ చెప్పింది.

‘అమ్మో! నాకూ అంతే’ అంది వినీత అంతే భయంగా.

భయపడినట్లుగానే వినీత ఫెయిలు అయితే, పూజిత పాస్ అయ్యింది. తను ఫెయిల్ అయినదానికన్నా పూజిత పాస్ అవడం ఎక్కువ బాధ కలిగించింది వినీతకి.

‘తండ్రి చిన్నప్పుడే పోతే, తల్లి కష్టపడి చదివిస్తుంటే చదువుకోవడానికి.. ఏం బాధో!’ పక్కన ఇంట్లో ఉండే పిన్ని మరెవరితోనే అనడం వినీతకు మింగుడు పడలేదు.

‘ఇక నీకు పెళ్లి చెయ్యడమే మిగిలింది. అందాకా ఆ పోయిన పరీక్ష ఏదో కట్టు. వచ్చినవాళ్ళకి, అమ్మాయి ఇంటరు పాసు అయ్యింది అని అయినా చెప్పుకోవాలి కదా!’ అంటూ చిన్నగా కేకలేసింది. ఈ రోజుల్లో పిల్లల్ని ఏమనకూడదన్నట్లు .. అయినా వినీత చిన్నబోయింది. ముభావంగా ఉండిపోయింది. ఇప్పుడు పూజిత ఇంజనీరింగులో జాయినయి పోతే, తన ముందే రోజూ కాలేజీకి వెళ్లి వస్తుంటే.. ఊహించు కోలేకపోయింది వినీత.


రెండు రోజుల తర్వాత ఉదయం పదకొండున్నర సమయానికి బయటకి వెళ్ళడానికి తయారవుతున్న కూతుర్ని ప్రశ్నార్థకంగా చూస్తూన్న తల్లికి ‘పూజిత వాళ్ళ ఇంటికి’ అని చెప్పింది.

‘తొందరగా వచ్చెయ్యి’ పుత్తడి బొమ్మలా తయారయిన కూతుర్ని చూస్తూ అంది.

‘లేదు. సాయంత్రం సినిమాకి అనుకున్నాం’ అంది చెప్పులేసుకుని బయలుదేరుతూ. కూతురు బాధ నుంచీ తెరుకోవడమే కావలసిందని తల్లి మనసులో అనుకుంది.


ఆ రాత్రి పది గంటలు దాటినా కూతురు ఇంటికి రాకపోతే .. స్నేహితురాలి ఇంట్లో ఉండిపోయిందేమో! అనుకుంది. అప్పుడపుడూ అలాగే ఉండిపోతుంది. పూజిత వాళ్ళ ఇల్లు ఊరికి చివరగా పొలాల్లోకి ఉంటుంది. రాత్రి పూట ఒక్కతీ రాలేక ఉండిపోయి ఉండవచ్చని సరిపెట్టుకుంది. ఇంట్లో ఉన్న ఒక్క ఫోనూ కూతురి దగ్గరే ఉంటుంది. తెల్లవారిపోయినా వినీత ఇంటికి రాక పోయేసరికి .. ఎదురింట్లో ఉండే వాసుని పంపింది రామేశ్వరి. ‘అక్కని తీసుకు రారా..’ అని.

వెళ్ళిన పది నిముషాలకే పరిగెత్తుకుంటూ వచ్చాడు వాసు.

‘అక్క నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళలేదట పెద్దమ్మా!.’ చెప్పాడు ఆయాసంతో. దాంతో గుండెల్లో .. రాయి పడింది రామేశ్వరికి. కనిపించిన అందరినీ అడిగింది.

‘నిన్న బస్సులు ఆగే చోట చూసాను. ఎప్పటిలా కాలేజీకి వెళుతుందేమో! అనుకున్నా’ చెప్పాడు ఒకతను.

‘ఇంకా ఆలస్యం చేస్తే మంచిదికాదు. వెంటనే పోలీసు కంప్లైంట్‌ ఇవ్వాలి’ అన్నారు లోకజ్ఞానం తెలిసినవాళ్ళు. అలాగే ఇచ్చింది రామేశ్వరి. విషయం అంతా విన్న స్టేషన్ హౌస్ ఆఫీసరు విశ్వనాథరావు, వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతికతతో ఆమె ఫోన్ నెంబరును ట్రాక్ చేశారు. ఆ నెంబరు .. రామచంద్రాపురం మండలంలోని, వంగలపూడి గ్రామంలో ఉన్నట్లు చూపించింది. అక్కడికి ఆ ప్రదేశం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే విషయం రామేశ్వరికి వివరించి ..

క్షణం ఆలస్యం చెయ్యకుండా తన సిబ్బందితో బయలుదేరారు విశ్వనాథరావు. రెండు గంటల్లో చేరుకున్నారు అక్కడికి.

వాళ్ళు వెళ్లేసరికి .. ఏటిగట్టుకి దగ్గరలో.. ఉన్న పంటపొలాల్లో ఓ చెట్టు కింద ఒంటరిగా నిలబడి ఉంది వినీత. పోలీసులు ప్రశ్నించడంతో ..

మొదట బిత్తరపోయి, బుకాయించినా అమ్మ పేరు చెప్పడంతో ..

‘చచ్చిపోవాలనే.. ఊరి నుండి దొరికిన బస్సు ఎక్కి వచ్చేశాను. ఎవరికీ ఆచూకీ తెలియకుండా ఉండడం కోసం అన్నట్లు. వచ్చిన తర్వాత ఎలా చావాలో తెలీలేదు.. అలాగే ఇంటికి వెళ్ళలేక అవస్థపడుతున్నాను’ అంటూ చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది.

‘పరీక్ష పోతే.. పట్టుదలగా చదివి.. సప్లిమెంట్‌ ‌రాయొచ్చు కదా!. ఫోను చూస్తూ సమయం వృథా చేయకుండా చదివితే.. నీ స్నేహితులు పాస్‌ అయినట్లు నీవు పాస్‌ అయ్యేదానివి. అందరిలాగే మీరు కూడా రెగ్యులర్ విద్యార్థుల్లాగా పై కోర్సుకి వెళ్లి చదువుకోవచ్చు. అంతేగానీ.. అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటే ఏమెస్తుంది? కనీ, పెంచిన వాళ్ళకి గుండె కోత తప్ప. నీకు తండ్రి లేడని అంటున్నావు .. ఇలా చెయ్యోచ్చా!?’ అంటూ మందలించి కౌన్సెలింగు ఇచ్చాడు.

అప్పటికి తన తప్పు తెలిసివచ్చి, వినీత కన్నీటి పర్యంతమయ్యింది. ఎంతసేపూ తను పరీక్ష ఫెయిల్ అయ్యింది. తనకు అవమానం జరిగింది. బయటివాళ్ళు ఏమనుకుంటారు? అనుకుందే గాని, తన గురింఛి ఆలోచించే తల్లిని గురించి పట్టించుకోలేదు. వెంటనే పోలీసులతో ఇంటికి చేరింది. తల్లిని పట్టుకొని ఏడ్చింది. రాజేశ్వరికి కూతుర్ని అప్పజెప్పి పోలీసులు వెళ్లిపోయారు. ఆకలితో ఉన్న వినీతకి అన్నం తినిపించింది తల్లి. వెంటనే తన గదిలోకి వెళ్లి.. ఫిజిక్స్‌ ‌పుస్తకం తీసి చదవసాగింది. అది చూసి రామేశ్వరి తన కూతురులో మార్పు వచ్చి, విజ్ఞతతో చదువుకుంటుందని సంతోషించింది.

P.L.N. మంగారత్నం

9701426788

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్