ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజీవితంలోనూ భోగి

1 గంట క్రితం

d4e3043aa4940e8e13ade5468e8a9e13.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్‌. ‘‘ప్రేమమ్‌’’తో తెలుగు, మలయాళ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఆ తర్వాత వరుస అవకాశాలతో తన కెరీర్‌లో ముందుకెళ్లారు. తెరపై ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే అనుపమ.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం గత రెండేళ్లు ఎంతో క్లిష్టమైనవని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ బంధం తొలినాళ్లలో సాధారణంగానే అనిపించి నప్పటికీ, కాలం గడిచేకొద్దీ పరిస్థితులు మారాయని ఆమె బాధను వ్యక్తం చేశారు. అయినా వాటన్నింటినీ దాటుకొని సినిమాల్లో నటిస్తూ.. కెరీర్‌ ‌లో ముందుకెళ్తున్నారు. ఆగస్టులో విడుదల కానున్న ‘భోగి’ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయిగా నటించి, మెప్పించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు.. కొత్త సినిమా గురించి తెలుసుకుందాం.


వ్యక్తిగత జీవితంలో ఎదురైన మానసిక వేధింపుల గురించి మాట్లాడటానికి ఇప్పటికీ చాలామంది వెనుకాడుతుంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్‌ వంటి కొందరు హీరోయిన్లు తమ అనుభవాలను బహిరంగంగా సోషల్‌‌మీడియాలో పంచుకుంటూ, ఇలాంటి బంధాల్లో ఉన్నవారికి అవగాహన కల్పిస్తున్నారు. సంబంధాల్లో నియంత్రణ, మానసిక ఒత్తిడి, స్వేచ్ఛను కోల్పోవడం వంటి అంశాలపై గతంలోనూ పలువురు సినీ తారలు కూడా తమ గొంతు వినిపించారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్‌ తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని కీలక విషయాలపై తొలిసారి బహిరంగంగా మాట్లాడారు.

మొదట్లో బాగానే..

ఏ సంబంధమైనా ప్రారంభంలో అందంగా, సంతోషంగా అనిపించొచ్చు. తన విషయంలోనూ అలాగే జరిగిందని అనుపమ పేర్కొన్నారు. అయితే క్రమంగా తన వ్యక్తిగత నిర్ణయాలు, సోషల్‌ మీడియా పోస్టులు, ఫొటోలు వంటి విషయాలపై నియంత్రణ చూపించే పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె వివరించారు. తాను అనుభవించిన పరిస్థితిని ఆమె ‘నార్సిసిస్టిక్ అబ్యూస్ (మానసిక వేధింపుల)’గా అభివర్ణించారు. ఈ అనుభవం తనపై భావోద్వేగపరంగానే కాకుండా శారీరకంగానూ ప్రభావం చూపిందని చెప్పారు. ఆ సంబంధం ఒక దశలో పెళ్లి వైపు కూడా వెళ్లిందని, ఇరువైపుల కుటుంబాల్లోనూ పెళ్లి గురించి చర్చలు జరిగాయని, అయితే చివరకు ఆ బంధం తనకు సరైనది కాదని గ్రహించి, వెనక్కి తగ్గినట్లు ఆమె వివరించారు. ఆ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదని ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. ఒక సంబంధం నుంచి బయటకు రావడం మాత్రమే కాదు.. దాని ప్రభావం నుంచి తనను తాను బయటకు తీసుకురావడం కూడా పెద్ద ప్రయాణమే అని భావోద్వేగానికి లోనయ్యారు.

ఆరోగ్యంపైనా ప్రభావం..

ఆ కాలంలో తాను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని అనుపమ వెల్లడించారు. భయాందోళన, శారీరక ఇబ్బందులు, బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పిన విషయాలు మీడియాలో వచ్చాయి. ఒక దశలో శస్త్రచికిత్స అవసరమయ్యేంత ఆరోగ్య సమస్యలు కూడా ఎదురైనట్లు ఆమె వివరించారు. అయితే ఈ అనుభవాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న తీరు మారిందని, గతాన్ని తలుచుకుని బాధపడటం కంటే.. దాని నుంచి పాఠాలు నేర్చుకుని, ముందుకు వెళుతున్నానని చాలా స్పష్టంగా చెప్పారు.

తనను తాను వెతుక్కోవడం

ఆ సంబంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై తాను దృష్టి పెట్టడం ప్రారంభించినట్లు ఆమె మాటల్లో కనిపిస్తోంది. ప్రశాంతత, స్వీయ అవగాహన, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నాననే భావనను ఆమె వ్యక్తం చేశారు. కష్టకాలంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల విలువ తెలుస్తుంది. అనుపమకు కూడా సినీ పరిశ్రమలోని కొందరు స్నేహితులు అండగా నిలిచారు. ముఖ్యంగా నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తనకు అప్పుడప్పుడు మెసేజ్‌ చేసి, ధైర్యం చెబుతుంటారని ఆమె చెప్పిన విషయం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అలాగే హీరో రామ్‌ ‌కూడా మంచి స్నేహితుడు అని చెప్పారు.

కొత్త పాత్రలతో..

గతాన్ని పూర్తిగా చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఆ గతం తన భవిష్యత్తును నిర్ణయించకుండా చూసుకున్నారు అనుపమ. కొత్త సినిమాలు చేస్తూ.. విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహాగానాలకు దూరంగా ఉంటూ, తనకు నచ్చిన విషయాలను స్వేచ్ఛగా చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఆ రెండేళ్ల కాలం తర్వాత.. ఆమె తమిళంలో ‘‘లాక్‌‌డౌన్‌’’ సినిమాలో అనిత పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులోనూ ‘‘మరీచిక’’లో నటించారు. ఇది మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇందులో అనుపమతో పాటు రెజీనా కసాండ్రా, విరాజ్‌ అశ్విన్‌ నటించారు. సినిమాలో అనుపమ నటనకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ‘‘ The Pet Detective’’ — మలయాళంలో నటించారు. ‘‘పరదా’’ తెలుగుచిత్రంలో నటించారు. ఈ కామెడీ-డ్రామాలో అనుపమ సుబ్బు పాత్రలో ప్రధానపాత్ర పోషించారు.

పల్లెటూరి అమ్మాయిగా..

సంపత్‌‌ నంది దర్శకత్వంలో తీసిన ‘‘భోగి’’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ “కందుల సులోచన రాణి” అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను చిత్రబృందం పల్లెటూరి వాతావరణంలో, కష్టపడి పనిచేసే యువతిగా పరిచయం చేసింది. సులోచన రాణి మోదుగ ఆకులతో విస్తరాకులు తయారుచేసి, జీవనం సాగించే మహిళ. ఆమె ప్రకృతితో మమేకమై ఉండే వ్యక్తిత్వం. కష్టపడి పనిచేసే స్వభావం, పట్టుదల ఉన్న ఈ పాత్రలో ప్రధానంగా కనిపిస్తాయని చిత్రబృందం తెలిపింది. ఇలా అనుపమ జీవితంలో ఎదురైన బాధలను ‘భోగి’ మంటల్లో వేసి, కెరీర్‌లో ఒకే తరహా ప్రేమకథల హీరోయిన్‌గా కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకునే దిశగా ముందుకు వెళుతున్నారు.​



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్